ఎవరీ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్?

Update: 2017-08-25 12:47 GMT
గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ ....దేశ వ్యాప్తంగా అటు మీడియాలో ఇటు ప్రజల్లో ఈ పేరు ఇప్పుడు మార్మోగిపోతుంది.అత్యాచారం కేసులో దోషిగా తేల్చిన వ్యక్తికి మద్దతు తెలుపుతూ హర్యానా - పంజాబ్ రాష్ర్టాల ప్రజలు హింసకు ఎందుకు పాల్పడుతున్నారు? ఆయనకు ఎందుకింతా పాపులరిటీ? అసలు గుర్మీత్ సింగ్ ఎవరు? అనే ఆస‌క్తి అంద‌రిలో నెల‌కొన్న నేప‌థ్యంలో ఆయ‌న గురించిన వివరాలివి...

ఆగస్టు 15 - 1967న రాజస్థాన్ గంగానగర్ జిల్లాలోని శ్రీగురుసర్ మోదియా గ్రామంలో గుర్మీత్ సింగ్ జన్మించారు. ఈయన తండ్రి భూస్వామి. అప్పుడప్పుడు వ్యవసాయ పనుల్లో తండ్రికి చేదోడువాదోడుగా ఉండేవాడు. గుర్మీత్ ఎప్పుడు ఆధ్యాత్మిక చింతనలో మునిగితేలేవాడు. పంజాబ్‌లోని సిర్సాలో ఉన్న డేరా సచ్చా సౌధా ఆశ్రమ గురువు షా సత్నాం సింగ్ గుర్మీత్‌ ను 7 సంవతర్సాల వయసులోనే చేరదీశాడు. ఆ సమయంలో గుర్మీత్ పేరును రామ్ ర‌హీమ్‌ గా మార్చి మరింత ఆధ్యాత్మికతను నింపాడు. పదహారు సంవత్సరాల తర్వాత 1990లో షా సత్నాం సింగ్ తన శిష్యులను అందరినీ పిలిచి తన వారసుడిగా గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌ ను ప్రకటించాడు. అప్పుడు రామ్ రహీమ్ వయసు 23 ఏళ్లు. కాగా, డేరాసచ్చాసౌదా చీఫ్‌ గా ఉన్న గుర్మీత్ రామ్ రహీమ్ స్వచ్చ సౌదాలో మూడో తరం వ్యక్తి….. డేరా స్వచ్చ సౌదాను స్థాపించిన బెలూచిస్తాన్‌ ప్రాంతానికి చెందిన మస్తానా బలూచిస్తానీని అనుచరులు పునీత బెపరవాహ్‌ మస్తానా జీ మహరాజ్‌ అని పిలుస్తారు. 1960 ఏప్రిల్‌ 18న ఆ‍యన చనిపోయాక షా సత్నాం స్వచ్చ సౌదా బాధ్యతలు స్వీకరించారు. మస్తానా నుంచి 41 ఏళ్ల వయసులో బాధ్యతలు స్వీకరించిన షా సత్నాం 1990 వరకు ఆశ్రమ బాధ్యతలు నిర్వర్తించారు. 1991 డిసెంబర్‌ 13న ఆయన చనిపోయారు. ఆయన బతికుండగానే 1990 సెప్టెంబర్‌ 23న గుర్మీత్‌ రాం రహీమ్ సింగ్ డేరా చీఫ్‌ అయ్యారు. అప్పటికే తన విద్యాభ్యాసాన్ని పూర్తి చేసుకున్న రహీమ్.. హర్జీత్ కౌర్ అనే మహిళను వివాహం చేసుకున్నాడు. వీరికి ముగ్గురు సంతానం. ఇద్దరు ఆడపిల్లలు - ఒక మగ పిల్లాడు.

గుర్మీత్ డేరా సచ్చా సౌధ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు చేపట్టాడు. పేద పిల్లలకు విద్యను అందించడం - రక్త దానం - అవయవ దానం వంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడంతో పాటు ఇందులో ప్రజలను కూడా భాగస్వామ్యం చేసేవాడు. ఇతని ఉపన్యాసాలతో పలువురిని సేవా కార్యక్రమాలకు ప్రేరేపించేవాడు. గుర్మీత్ ఇప్పటి వరకు రెండు సినిమాలు చేశాడు. అవి.. ఎంఎస్‌ జీ(మెసెంజర్ ఆఫ్ గాడ్) - ఎంఎస్‌ జీ 2. ఇక సిర్సాలోని గుర్మీత్‌ కు ఒక పెద్ద టౌన్‌ షిప్ ఉంది. 1000 ఎకరాల స్థలంలో నిర్మించిన టౌన్‌ షిప్‌ లో పాఠశాలలు - స్పోర్ట్స్ విలేజ్ - ఆస్పత్రి - సినిమా హాలుతో పాటు ఇతర భవనాలు ఉన్నాయి. డేరాలోకి రాజకీయ నేతలు రావడం సహజమే. కానీ వారు వస్తున్న విషయం మూడో కంటికి తెలియదు. పొలిటికల్ లీడర్స్ వస్తున్నప్పటికీ.. రాజకీయ వ్యవహారాల్లో గుర్మీత్ జోక్యం చేసుకోలేదు. అయితే 2014 ఎన్నికల్లో హర్యానాలో బీజేపీ తరపున ప్రచారం చేశాడు రామ్ రహీమ్ సింగ్.

2002లో గుర్మీత్‌ పై అత్యాచారం - హత్య కేసులు నమోదు అయ్యాయి. అత్యాచారం కేసులో పంచకుల సీబీఐ కోర్టు గుర్మీత్ రామ్‌ ను దోషిగా నిర్ధారిస్తూ ఆగస్టు 25 - 2017న తీర్పునిచ్చింది. ఆగస్టు 28న ఆయనకు కోర్టు శిక్షను ఖరారు చేసింది. ఈ క్రమంలో రామ్ రహీమ్‌ ను అంబాలా సెంట్రల్ జైలుకు తరలించారు. రామ్ దోషి అని నిర్ధారించడంతో.. పంజాబ్ - హర్యానా రాష్ర్టాల్లో ఆయన మద్దతుదారులు ఆందోళనల బాట పట్టారు.
Tags:    

Similar News