డేరా బాబా ఖాతా క్లోజైందే!

Update: 2017-09-02 14:23 GMT
మెసెంజెర్ ఆఫ్ గాడ్ ఉరఫ్ డేరా బాబా అలియాస్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ టైం అసలు బాగో లేదు. తన అనుచరులతో హల్‌చల్ చేసే బాబా... చేసిన పాపానికి శిక్ష అనుభవిస్తున్నాడు. ఇద్దరు సాధ్విలపై అత్యాచారం చేసినట్లు ఆరోపణలు రుజువవడంతో ఇటీవలే మనోడికి జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. దీంతో కృష్ణుడి అవతారంగా చెప్పుకునే గుర్మీత్‌ను శ్రీకృష్ణ జన్మస్థానానికే పంపారు. అప్పటివరకూ తన మాటే మంత్రంగా..  చెప్పిందే శాసనంగా గడిపిన ఈ బాబా ప్రస్తుతం పలకరించే నాథుడులేక బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నాడు. చేసిన తప్పుకు కుమిలికుమిలి ఏడుస్తున్నాడు.

అయితే మూలిగే నక్కపై తాటిపండు పడినట్టు గుర్మీత్‌కు ఊహించని విధంగా మరో షాక్ తగిలింది.ఇప్పటికే గుర్మీత్‌ సినిమా లైసెన్స్‌ రద్దు కాగా.. తాజాగా అతని ట్విట్టర్‌ అకౌంట్‌ను కూడా మన దేశంలో నిలిపివేశారు. ఈ నిలుపుదలతో భారత్‌లో ఆయన ఫాలోవర్స్‌ ఎవరూ గుర్మీత్‌ అకౌంట్‌ను యాక్సస్‌ చేయడం కానీ, ట్వీట్లు చూడటం కానీ వీలుపడదు. అయితే భారత్‌లో మాత్రమే ఆయన అకౌంట్‌ను బ్లాక్‌ చేశారు. విదేశీయులు మాత్రం డేరా సచ్ఛా సౌదా పోస్టులను చూడవచ్చు. ఇప్పటివరకు గుర్మీత్‌కు 3.6 మిలియన్ల మంది ట్విట్టర్‌ ఫాలోవర్స్‌ ఉన్నారు.
 
ఫాలోవర్స్‌ అభ్యర్థన మేరకు ఆయన అకౌంట్‌ను బ్లాక్‌చేశామని హర్యానాకు చెందిన సీనియర్‌ పోలీసు అధికారి చెప్పారు. డేరాతో సంబంధమున్న ఇతర సోషల్‌ మీడియా అకౌంట్లను వారు చూడటానికి ఇష్టపడట్లేదని పేర్కొన్నారు.  ఇప్పుడు గుర్మీత్ ట్విట్టర్ ఖాతా ఓపెన్ చేస్తే ‘‘"@Gurmeetramrahim's account has been withheld in: India." అనే మెసేజ్ దర్శనమిస్తోంది. ఆయన ట్వీట్లు ఏమీ కనిపించడం లేదు. గుర్మీత్ దత్త పుత్రికగా చెబుతున్న హనీప్రీత్ ఇన్సాన్ ఖాతా కూడా బ్లాక్ అయింది.
Tags:    

Similar News