లేకలేక పదవి వస్తే.. అప్పుడే గండమా?

Update: 2018-02-27 15:43 GMT
ఆయన పాపం ఎప్పటినుంచో కేబినెట్ ర్యాంకు పదవి కోసం తహతహలాడిపోతున్నారు. కానీ ఎంతకూ అది దరికి రావడం లేదు. దీంతో ఎంపీగా గెలిచిన తర్వాత.. మళ్లీ గెలిపించిన పార్టీని వదిలేసి.. అధికార పార్టీ తీర్థం పుచ్చుకుని ఏదో ఒక రకంగా కాస్త పెద్దర్యాంకు హోదా దక్కించుకోవాలని చాలా కాలంగా  కుస్తీలు పడుతున్నారు. ఎట్టకేలకు ఆయనకోసం యావత్తు ప్రభుత్వ యంత్రాంగం కదలి.. కొత్త వ్యవస్థను ఏర్పాటుచేసి సారథ్యాన్ని.. కేబినెట్ హోదాలో ఆయన చేతిలో పెట్టారు. తీరా - పదవి దక్కిందనే ముచ్చట కూడా తీరకముందే.. దానికి గండం పొంచి ఉందనే భయం వెన్నాడుతోంది. ఈ ఉపోద్ఘాతం మొత్తం తెలంగాణ లో రైతు సమన్వయ సమితులకు రాష్ట్ర అధ్యక్షుడుగా నియమితులైన గుత్తా సుఖేందర్ రెడ్డి గురించి.

సుఖేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీగా గెలిచారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిన తర్వాత.. అటు ఏపీతో పాటు తెలంగాణలో కూడా కాంగ్రెస్ దారుణంగానే దెబ్బతింది. ఆ పార్టీ తరఫున తెలంగాణలో గెలిచిన అతి కొద్దిమంది ఎంపీల్లో గుత్తా కూడా ఒకరు. కాంగ్రెస్ ఎంపీగా ఆయన కొత్తగా గద్దె ఎక్కిన తెరాస సర్కారు మీద ఒక  రేంజిలోనే పోరాడారు. చట్టం - రాజ్యాంగం  నియమ నిబంధనల మీద అవగాహన ఉన్న ఆయన.. కేసీఆర్ కేబినెట్ సెక్రటరీలంటూ కేబినెట్ హోదాతో కొందరికి పదవులను పంచేసిన వైనంపై న్యాయపోరాటం చేశారు.

ఆతర్వాత రాష్ట్రంలో మారిన  పరిస్థితుల్లో భవిష్యత్తు ఉండాలంటే.. గులాబీ ముద్ర బెటరని ఆ పార్టీలో చేరిపోయారు. అయితే అప్పటినుంచి ఆయనకు కూడా కేబినెట్ హోదాను అనుభవించాలనే కోరిక విపరీతంగా ఉంది. అలాంటి హామీ ఇచ్చే కేసీఆర్ కూడా పార్టీలోకి తీసుకున్నట్లు సమాచారం. మొత్తానికి రైతు సమితి రూపంలో ఆయన ముచ్చట తీర్చారు.

కానీ నామినేటెడ్ పోస్టుగా కేబినెట్ హోదా కట్టబెడితే.. తెలంగాణ మంత్రి వర్గానికి ఉండే లిమిట్ మించకుండా ఉండాలని.. రాష్ట్ర కేబినెట్ లో ఒకరిని తొలగించకుండా గుత్తాకు కేబినెట్ ర్యాంకు ఇస్తే ఇబ్బంది తప్పదని.. ఇప్పుడు న్యాయనిపుణులు చెబుతున్నారు. పాపం గుత్తా ఇదే తరహా కేసుల్ని గతంలో నడిపారు. ఇప్పుడాయనకు అదే చిక్కు వచ్చి పడుతోంది. ఇది లాభదాయక పోస్టు కాదని కాబట్టి చిక్కు లేదని - అవన్నీ పరిశీలించాకే హోదా ఇచ్చాం అని తెలంగాణ న్యాయశాఖ చెబుతోంది. కానీ ఆ పోస్టుకు ఓ కార్యాలయం ఉంటుంది. అలాంటివి కూడా రాజ్యాంగం ప్రకారం తగవు.  మరి ఈ న్యాయ సమస్యలోంచి గుత్తా ఎలా బయటకు వస్తారో చూడాలి.

Tags:    

Similar News