బాబు ప్ర‌సంగం..ఆ బీజేపీ పెద్దాయ‌న ఖుషీ

Update: 2018-06-17 09:46 GMT
ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ అధ్య‌క్ష‌తన సాగిన నీతి ఆయోగ్ స‌మావేశంలో కీల‌క ఘ‌ట్టం ముగిసింది. రాష్ర్టాల త‌ర‌ఫున‌ అభిప్రాయం వినిపించే ప్ర‌క్రియ‌కు శుభం కార్డు ప‌డింది. ఇందులో ప్ర‌ధానంగా తెలుగు రాష్ట్రాలైన ఏపీ - తెలంగాణ సీఎంలు నారా చంద్ర‌బాబు నాయుడు - క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్ రావు ప్ర‌సంగం ముగిసింది. నీతి ఆయోగ్ సమావేశంలో రాష్ట్రాల త‌ర‌ఫున అభిప్రాయం వినిపించే అవ‌కాశాన్ని అక్ష‌ర‌క్ర‌మంలో ఇచ్చారు. దీంతో ఏపీ సీఎం చంద్రబాబు ముందుగా మాట్లాడారు. రాష్ట్ర విభజన ఏకపక్షంగా జరిగిందని - న్యాయం చేస్తామని చెప్పిన కేంద్రం మాట నిలబెట్టుకోలేదని ఆయన అన్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసేందుకు నిధులు ఇవ్వాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని గుర్తుచేశారు. భూసేకరణ - పునరావాసానికి నిధులు ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే రాజధాని నిర్మాణానికి నిధుల కొరతను కేంద్రం తీర్చాలని కోరారు. రాష్ట్ర తలసరి ఆదాయాన్ని పరిగణనలోకి తీసుకుని నిధుల కేటాయింపులు చేయాలని తెలిపారు.

అయితే ఏడు నిమిషాల పాటు చంద్రబాబు ప్రసంగించిన తర్వాత కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌ నాథ్‌ సింగ్... ఏపీ సీఎం ప్రసంగాన్ని అడ్డుకున్నారు. దీనికి సమాధానం ఇచ్చిన చంద్రబాబు... ఏపీని ప్రత్యేకంగా చూడాల్సిన అవసరం ఉందని - సమస్యల తీవ్రత దృష్ట్యా మాట్లాడేందుకు మరికొంత సమయం ఇవ్వాలని కోరారు. మొత్తంగా 20 నిమిషాల పాటు నీతి ఆయోగ్ సమావేశంలో చంద్రబాబు మాట్లాడటంపై బీజేపీ నేత - ఎంపీ జీవీఎల్ న‌ర‌సింహారావు రియాక్ట‌య్యారు. నీతి ఆయోగ్ సమావేశంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కి ప్రత్యేకంగా 20 నిమిషాలు మాట్లాడే అవకాశం దక్కడం నేను కూడా గర్విస్తున్నానని - నిర్దిష్ట సమయంలో జరిగే సమావేశం కాబట్టి అందరు సీఎంలకు కొంత సమయమే కేటాయించబడి ఉంటుందని ఆయ‌న అన్నారు. నీతి ఆయోగ్ సమావేశంలో చంద్రబాబు రాష్ట్ర సమస్యలను విస్తృతంగా ప్రస్తావించారని టీడీపీ నేతలు ప్రచారం బాగా చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. చెప్పిన మాటలకు కట్టుబడి ఉండాలని, ప్రచారాలకే పరిమితమై ప్రజల అభివృద్ధి కి పని చేయడం లేదని ఆరోపించారు. ప్రజా సంక్షేమానికి చొరవ తీసుకోవడం లేదని పేర్కొంటూ..స‌మావేశంలో సమస్యలు లేవనెత్తుతున్నారు కానీ క్షేత్ర స్థాయిలో ఎందుకు పట్టించుకోవడం లేదని ఏపీ స‌ర్కారును జీవీఎల్ ప్ర‌శ్నించారు.

కేంద్రం సహాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నా ఏమీ పట్టనట్లు ఉన్నారని జీవీఎల్ ఆస‌క్తిక‌ర‌మైన వ్యాఖ్య‌లు చేశారు. స్పెషల్ పర్పస్ వెహికిల్ ఏర్పాటు చేయమంటే ఇంతవరకు ఎందుకు చేయలేదని ఆయ‌న ప్ర‌శ్నించారు. ఆర్భాటాలు - ప్రచారాలు తప్ప పనులు చేయడం లేదని బాబు స‌ర్కారుపై మండిప‌డ్డారు. `ఒకప్పుడు ప్రత్యేక హోదా కంటే ఎక్కువ నిధులు రాష్ట్రానికి వచ్చాయని మీరే పత్రికల్లో రాయించారు కదా? హోదా కంటే ప్యాకేజీ వల్లే నిధులు బాగా వచ్చాయని మీరు అన్నది నిజం కాదా? ఇప్పుడు మీరు చేస్తున్న వ్యాఖ్యలు చూస్తే యూ టర్న్ తీసుకున్నట్టు ప్రజలకు తెలుస్తోంది.`` అంటూ జీవీఎల్ పేర్కొన్నారు. పోలవరానికి రావలసిన నిధులు అన్ని త్వరలోనే రాబోతున్నాయని, నాబార్డు ద్వారా వెంటనే విడుదల అవుతాయని త‌మకు సమాచారం ఉందని జీవీఎల్ వివ‌రించారు. వెనకబడిన జిల్లాలకు 300 కోట్ల రూపాయల చొప్పున కేంద్రం ఇచ్చిందని, రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన ప్రతి ఒక్క రూపాయి కేంద్రం ఇస్తూనే ఉంటుందని ఆయ‌న తెలిపారు. రాష్ట్ర ప్రజలను తప్పుదోవ ప‌ట్టించేలా ప్రచారాలు చేయవ‌ద్ద‌ని కోరారు.
Tags:    

Similar News