స్టార్ హోట‌ల్ల‌ లో బాబు...కోర్టులో పిల్‌

Update: 2018-11-12 11:03 GMT
ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు స‌హా - తెలుగుదేశం పార్టీ తీరుపై ఒంటికాలిపై విరుచుకుప‌డే బీజేపీ జాతీయ నేత‌ - ఆ పార్టీ అధికార ప్ర‌తినిధి జీవీఎల్ న‌ర‌సింహారావు మ‌రోమారు చంద్ర‌బాబు తీరుపై విరుచుకుప‌డ్డారు. చంద్ర‌బాబు ప్ర‌తి నిర్ణ‌యం వెనుక రాజ‌కీయ ఎత్తుగ‌డ ఉంటుంద‌ని - అందులో భాగ‌మే తాజాగా జాతీయ‌స్థాయిలో కూట‌మి అని ఆయ‌న మండిప‌డ్డారు. ఓ వైపు రాష్ట్రం కష్టాల కడలిలో ఉందంటూనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రజల సొమ్ముతో విలాసవంతమైన ప్రయాణాలు సాగిస్తున్నారని జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. టీడీపీ నేతలు అభివృద్ధిపై చర్చకు సవాళ్లు విసిరి తరువాత పరారవుతున్నారని ఎద్దేవా చేశారు.

ఢిల్లీ - బెంగళూరు - చెన్నై వంటి నగరాలకు పార్టీపరమైన కార్యక్రమాలకు ప్రత్యేక విమానాల్లో వెళ్లి తన వందిమాగధులతో ఖరీదైన స్టార్ హాటళ్లలో బస చేస్తున్నారని - దీనికి  ఖ‌ర్చు చేస్తున్న సొమ్ము ఎక్క‌డిదో చెప్పాల‌ని జీవీఎల్ ప్ర‌శ్నించారు. ఈ విష‌యంలో తాము కోర్టులో ప్ర‌జాప్ర‌యోజ‌న వ్యాజ్యం దాఖ‌లు చేస్తామ‌న్నారు. ఆ టూర్ల‌కు సహకరించే అధికారులను కూడా బాబుతోపాటు కోర్టుకు ఈడుస్తామని హెచ్చరించారు. దేశంలో అత్యంత సంపన్నుడు - వేలాది ఎకరాలకు అధిపతి బాబుకు పాల వ్యాపారంపై ఉన్న శ్రద్ధ పాలనపై లేదన్నారు. విశాఖ భూ కుంభకోణంపై వేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం ‘సిట్’ అసలు దోషులను రక్షించేందుకేనని అన్నారు. గతంలో మంత్రి అయ్యన్నపాత్రుడు విశాఖ భూకుంభకోణంలో మంత్రి గంటా శ్రీనివాసరావు - ఎమ్మెల్యే పీలా గోవిందు తదితరులున్నట్లు ఆరోపించారని - తీరా తొమ్మిది నెలల తర్వాత మంత్రి మండలి ఆమోదించిన నివేదికలో వారెవరి పేర్లు లేవని అన్నారు. అసలు సిట్ అంటే సేఫ్ గార్డింగ్ ఇంటరెస్ట్స్ ఆఫ్ టీడీపీగా మారిందంటూ జీవీఎల్ ఎద్దేవా చేశారు.

అగ్రిగోల్డ్ తరహా లోనే విశాఖ భూకుంభకోణంపై కూడా ఉద్యమించాలని పార్టీ కోర్ కమిటీ నిర్ణయించిందని జీవీఎల్ తెలిపారు. ఈ నెల 19 నుంచి 24 వరకు భూముల స్వాహాపై ఉద్యమాలు చేయనున్నట్లు చెబుతూ బాధితులు తమ సమస్యలను పార్టీ దృష్టికి తీసుకురావచ్చన్నారు. అగ్రిగోల్డ్ వ్యవహారంపై కేంద్రం 75 శాతం నిధులు ఇవ్వలంటూ టీడీపీ ప్రభుత్వం కొత్త పల్లవి అందుకుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ముందుగా రూ.1134 కోట్లు చిన్న మదుపుదారులకు ఇచ్చివేస్తే లక్షలాది మంది బాధితులు ఊపిరిపీల్చుకుంటారని - ఆపై తాము కేంద్రంతో మాట్లాడి మిగిలిన నిధులు ఇప్పిస్తామన్నారు. రాయలసీమ అభివృద్ధిపై ప్రత్యేక కార్యాచరణ రూపొందించేందుకు ఈనెల 18న తిరుపతిలో జరిగే పార్టీ కోర్ కమిటీ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుంటామన్నారు. ముఖ్యంగా హైకోర్టును రాయలసీమలో ఏర్పాటు చేయాలని జీవీఎల్ డిమాండ్ చేశారు. కడపలో తానే ఉక్కు ఫ్యాక్టరీ పెడతానంటున్న బాబు విశాఖ రైల్వే జోన్ కూడా ఏర్పాటు చేయగల సమర్థుడంటూ ఎద్దేవా చేశారు. న‌వ్యాంధ్రకు కేంద్రం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రకటించడమే గాక ఆర్థికంగా సాయం చేసిందన్నారు. అయినా కేంద్రం ఏమీ ఇవ్వడం లేదని ముఖ్యమంత్రి అబద్దాలు చెబుతున్నారన్నారు. దేశంలో బీజేపీ మినహా మిగతా అన్ని రాజకీయపార్టీల్లో కుటుంబ పాలన కొనసాగుతోందన్నారు. అందుకే అభివృద్ధి జరగడం లేదన్నారు. మన రాష్ట్రంలో చంద్రబాబుకు తనయుడు లోకేశ్ - సోనియాకు కుమారుడు రాహుల్‌గాంధీ... ఇలా ఎన్నో రాష్ట్రాల్లో ఇదే తరహా కుటుంబ పాలన కొనసాగుతోందన్నారు.

  


Tags:    

Similar News