మండలి రద్దు ఖాయం..కేంద్రం గ్రీన్ సిగ్నల్!

Update: 2020-01-29 11:34 GMT
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా ఏపీ శాసనమండలిపై కీలక నిర్ణయాన్ని తీసుకున్న విషయం తెలిసిందే. ఏపీ వికేంద్రీకరణ బిల్లు కి అడ్డుపడుతుందన్న కోపంతో ఏకంగా సీఎం జగన్ మండలిని పీకేయడానికి నిర్ణయం తీసుకోని - అత్యవసరంగా అసెంబ్లీని సమావేశ పరిచి ..మండలి రద్దు పై అసెంబ్లీ లో తీర్మానాన్ని ఆమోదించి కేంద్రానికి పంపించారు. ఈ నేపథ్యంలో సీఎం జగన్ మాట్లాడుతూ ...ప్రజల చేత ఎన్నుకోబడిన శాసనసభ్యులు - అధికారంలో ఉన్న ఒక పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని మండలిలో ఉన్న కొందరు ఉద్దేశపూర్వకంగా వ్యతిరేకిస్తుంటే ఊరికే కూర్చోవాల్సిన అవసరం లేదు అంటూ మండలి రద్దుని తెరపైకి తీసుకొచ్చారు.

కానీ, అసెంబ్లీ లో తీర్మానం చేసి కేంద్రానికి పంపినప్పటికీ కూడా కొందరు రాజకీయ ప్రముఖులు - టీడీపీ నేతలు మండలి రద్దు పై కేంద్రం ఇప్పుడప్పుడే ఒక నిర్ణయం తీసుకోదు అని - కేంద్రం దీనిపై కొంత సమయం తీసుకుంటుంది అని  - పార్లమెంట్ లో ఈ బిల్లు ఆమోదం పొందటం అంత సులభం కాదు అంటూ మాట్లాడుతున్నారు. కానీ , అందులో ఏమాత్రం కూడా నిజం లేదు అని తాజాగా జరుగుతున్న పరిణామాలని బట్టి చూస్తే అర్థమౌతుంది. మండలి రద్దు పై కేంద్రం అతి త్వరలోనే నిర్ణయం తీసుకోబోతుంది అని బీజేపీ నేతల మాటల బట్టే చెప్పవచ్చు.

ఈ మండలి రద్దు వ్యవహారం పై మాట్లాడిన బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహరావు.. మండలి రద్దు అంశాన్ని కేంద్రం రాజకీయ కోణంలో చూడటం లేదని - ఈ అంశం పై  రాజ్యాంగం ప్రకారమే ప్రక్రియను ముందుకు తీసుకెళతామని  - ఆలస్యం చేయడం - తొందరగా పూర్తి చేయడం లాంటివేవీ ఉండవని తెలిపారు. ఉద్దేశపూర్వకంగా జాప్యం చేసే ఆలోచన కేంద్రానికి లేదని - వ్యవస్థకు లోబడే నిర్ణయాలు ఉంటాయని చెప్పారు. 169(1) ప్రకారం అసెంబ్లీ.. తీర్మానాన్ని చేస్తే దాన్ని కేంద్రం ముందుకు తీసుకెళ్లాలి తప్ప తాము చేసేదేమీ ఉండదని తెలిపారు.

ఇకపోతే ఈ మండలి రద్దు వ్యవహారం పై కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది అని చెప్పడానికి మరో కారణం కూడా ఉంది అంటూ రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. అదేమిటంటే ... 2014లో అధికారం చేపట్టే నాటికి బీజేపీకి రాజ్యసభలో పెద్దగా సంఖ్యా బలం లేదు. లోక్‌ సభలో బంపర్ మెజారిటీ వున్న బీజేపీకి - ఎన్డీఏ ప్రభుత్వానికి ప్రతీ కీలక బిల్లు సమయంలో  కాంగ్రెస్ పార్టీ నుంచి యూపీఏ పక్షాల నుంచి  వ్యతిరేకత ఎదురైంది. ఒకానొక సందర్బంలో సాక్షాత్తు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. ప్రజాస్వామ్యబద్దంగా లోక్‌ సభలో మెజారిటీలో ఏర్పాటైన ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను రాజ్యసభలో బలం వుందన్న ఉద్దేశంతో అడ్డుకుంటారా? అంటూ ఆగ్రహం  వ్యక్తం చేసారు. ఇప్పుడు ఏపీ సీఎం జగన్ కూడా ఇదే అంశం పై మండలి రద్దు తీర్మానం చేసి కేంద్రానికి పంపించారు.


Tags:    

Similar News