ఇదేం పాడుపని:మోటార్లు లేని ప్రాజెక్టు..?

Update: 2015-09-22 04:03 GMT
రికార్డు సమయంలో నిర్మాణం పూర్తి చేసినట్లు ప్రచారం చేసుకున్న పట్టిసీమ విషయంలో విస్మయకర విషయాలు బయటకు వస్తున్నాయి. కర్నూలు జిల్లాలోని హంద్రీనీవా ప్రాజెక్టు నుంచి పట్టిసీమ ప్రాజెక్టుకు మోటార్లను తరలిస్తున్నారన్న ఆరోపణలువెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే ఒక మోటార్ ను తరలించినట్లు వస్తున్న వార్తలకు తోడుగా.. మరో పది మోటార్లను తరలిస్తున్నట్లుగా చెబుతున్నారు. దీనిపై ప్రభుత్వం.. అధికారులు.. కాంట్రాక్ట్ సంస్థ.. భిన్న వాదనల్ని వినిపిస్తున్నారు.

ప్రాజెక్టుకు అవసరమైన మోటార్లను ఎందుకు ఏర్పాటు చేయలేదన్న ప్రశ్నకు వినిపిస్తున్న సమాధానం.. పట్టిసీమ ప్రాజెక్టుకు అవసరమైన మోటార్ల కోసం బ్రెజిల్ కు చెందిన ఒక సంస్థకు ఆర్డర్ ఇచ్చారు. అనుకున్న సమయానికి మోటార్లు రాకపోవటంతో ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితుల్లో మోటార్ల తరలింపు చేపట్టినట్లుగా చెబుతున్నారు.

మోటార్ల తరలింపు ఎలా సాధ్యమైందన్న ప్రశ్నకు వస్తున్న సమాధానం ఆసక్తికరంగా ఉంది. హంద్రీనావా.. పట్టిసీమ ప్రాజెక్టులను చేపట్టిన కాంట్రాక్ట్ సంస్థ ఒకటే కావటం గమనార్హం. దీనికి తోడు.. హంద్రీనీవా ప్రాజెక్టు కోసం మొత్తం 8 లిఫ్ట్ లు ఉన్నాయి.  ఒక్కో లిఫ్ట్ లో 12 వరకు మోటార్లు ఉన్నాయి. వీటిల్లోని ఒక మోటార్ ను తీసుకెళ్లి పట్టిసీమ ట్రయల్ రన్ పూర్తి చేసిన కాంట్రాక్ట్ సంస్థ.. ఏపీ సర్కారు.. ఇప్పుడు మరింత మైలేజీ కోసం మొత్తం పది వరకు  మోటార్లను తరలించాలని భావిస్తున్నారు.

పట్టిసీమకు మొత్తం 24 మోటార్లు అవసరం ఉన్నా.. ప్రస్తుతానికి అడ్జెస్ట్ మెంట్ కోసమని హంద్రీనీవాకు చెందిన పది మోటార్లను తీసుకొచ్చి.. పని చేస్తున్నట్లుగా చేసి.. బ్రెజిల్ నుంచి మోటార్లు వచ్చిన తర్వాత.. వాటిని పట్టిసీమ ప్రాజెక్టుకు అమర్చి.. హంద్రీనీవాకు పాతవాటినే పెడతారని చెబుతున్నారు. అయితే.. ఇలాంటి పనుల వల్ల హంద్రీనావా ప్రాజెక్టుకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందన్న విమర్శ వినిపిస్తోంది.

రికార్డు సమయంలో ప్రాజెక్టు పూర్తి చేసి.. నీళ్లు విడుదల చేశామన్న మాట కోసం మరీ ఇంత కక్కుర్తి అవసరమా? అన్న ప్రశ్న వినిపిస్తోంది. నాలుగు రోజులు ఆలస్యమైనా.. అన్నీ అనుకున్నట్లుగా పూర్తి చేస్తే.. లేని పోని ఈ రచ్చ ఉండేది కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. విపక్షాలకు విమర్శించే అవకాశం ఇచ్చే కన్నా.. ప్రాజెక్టు ప్రారంభం కాస్త ఆలస్యంగా చేస్తే జరిగే నష్టమేమిటని ప్రశ్నిస్తున్నారు. మొత్తంగా చూస్తే పట్టిసీమను సకాలంలో ప్రారంభించామన్న పేరు కంటే కూడా.. పట్టిసీమ ప్రాజెక్టు కోసం హంద్రీనీవా ప్రాజెక్టు మోటార్లను తరలించారన్న చెడ్డపేరు ప్రభుత్వంపై మరకగా మారుతుందంటున్నారు.
Tags:    

Similar News