భార్యా బాధితులు..రావణున్ని కాదు శూర్పనఖను కాల్చారు!

Update: 2018-10-19 16:23 GMT
దసరా సంబరాలు అన‌గానే ట‌క్కున గుర్తుకువ‌చ్చేది..రావ‌ణ ద‌హ‌నం. ద‌స‌రా సంద‌ర్భంగా సాధారణంగా రావణుని దిష్టిబొమ్మలను దహనం చేయడం సహజం. కానీ మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌ లో మాత్రం కొందరు భార్యా బాధితులు రావణుడి బదులు ఆయన సోదరి శూర్పనఖ దిష్టిబొమ్మలను దహనం చేసి త‌న ప్ర‌త్యేక‌త‌ను చాటుకున్నారు. ఔరంగాబాద్ సమీపంలోని కరోలి గ్రామంలో పత్ని పీడిత్ పురుష్ సంఘటన అనే ఈ సంస్థ ఈ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ వీడియో - ఫొటోలు ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి.

వివ‌రాల్లోకి వెళితే...పత్ని పీడిత్ పురుష్ సంఘటన ఫౌండర్ భరత్ ఫూలారే వివ‌ర‌ణ ప్ర‌కారం ఇండియాలోని చట్టాలన్నీ పురుషులకు వ్యతిరేకంగానే ఉన్నాయి. అవన్నీ మహిళలకు అనుకూలంగా ఉన్నాయి. ఆ చట్టాలను దుర్వినియోగం చేస్తూ భార్యలు.. భర్తలను హింసిస్తున్నారు అని అన్నారు. ``దేశంలో పురుషుల పట్ల ఉన్న ఈ వివక్షను మేం ఖండిస్తున్నాం. అందుకే మహిళలపై ఉన్న వ్యతిరేకతను ఇలా శూర్పనఖ దిష్టిబొమ్మను దహనం చేయడం ద్వారా చెప్పాలనుకున్నాం`` అని అతడు అన్నాడు. 2015 రికార్డుల ప్రకారం పెళ్లయిన జంజల్లో ఆత్మహత్యలు చేసుకొని మరణించిన వాళ్లలో 74 శాతం పురుషులేనని భరత్ చెప్పాడు. హిందూ పురాణాల ప్రకారం రామరావణ యుద్ధానికి మూల కారణం ఈ శూర్పనఖే. తన చెల్లెలికి జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకునే ఉద్దేశంతోనే రావణుడు ఓ సన్యాసి రూపంలో వచ్చి సీతను ఎత్తుకెళ్లినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఈ నేప‌థ్యంలో జ‌రిగే రావ‌ణ ద‌హనం ఇలా కొత్త రూపును సంత‌రించుకుంది.

Tags:    

Similar News