హార్దిక్ మీద కేసులే.. కేసులు

Update: 2015-10-21 09:16 GMT
ఉద్యమాలు చేసే నేతలు చాలా జాగ్రత్తగా ఉంటారు. ఉద్యమం కలకాలం పాటు సాగి.. తాము అనుకున్నది సాధించే వరకూ ఆచితూచి వ్యవహరిస్తుంటారు. చట్టబద్ధంగా చేసే ఉద్యమాలకు మాత్రమే ప్రజామోదం ఉంటుందే తప్ప.. అందుకు భిన్నంగా శాంతిభద్రతలకు ఇబ్బందికరంగా మారే అవకాశం ఉన్న ఉద్యమాల పట్ల ప్రభుత్వాలు కఠినంగా అణిచి వేస్తుంటాయి.

ఇక.. ఉద్యమాల్లో మరో కీలకమైన అంశం.. ఉద్యమాలు చేసే వారికి సంబంధించి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవటంతో పాటు.. ఉద్యమాన్ని నడిపించే అధినేత కీలకంగా అవుతారు. అలాంటిది అధినేత చిక్కుల్లో పడితే ఉద్యమం మొత్తం నీరు కారిపోతుంది. గుజరాత్ రాష్ట్ర సర్కారును కుదిపేసి..  దేశం మొత్తాన్ని ఆకర్షించిన హార్దిక్ పటేల్ నిర్వహిస్తున్న పటేళ్ల రిజర్వేషన్ల ఉద్యమం వ్యవహారం ఇప్పుడు ఇదే తీరులో నడుస్తోంది. రెచ్చగొట్టే ప్రకటనలు చేయటం ద్వారా చిక్కుల్లో పడ్డ హార్డిక్ పై ఇప్పుడు కేసుల మీద కేసులు నమోదు అవుతున్నాయి.

పటేదార్ అనామత్ ఆందోళన్ సమితి కన్వీనర్ గా ఉన్న హార్దిక్ పటేల్ పై ఆ మధ్యన దేశద్రోహం కేసు నమోదు కావటం తెలిసిందే. తాజాగా ఆయనపై మరో కేసు నమోదైంది. ఈ జూలై 23న విస్ నగర్ పట్టణంలో హార్దిక్ నాయకత్వంలో ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీ హింసాత్మకంగా మారి విధ్వంసం చోటు చేసుకుంది. దీంతో.. ఈ ఘటనకు హార్దిక్ కు సంబంధం ఉందని పోలీసులు భావిస్తున్నారు. ఇందులో భాగంగా ఆయనపై దోపిడీ కేసు నమోదైంది. చూస్తుంటే.. హార్దిక్ ఉద్యమాలపై చట్టం తన పని తాను చేసుకుంటూ పోతున్నట్లుంది.
Tags:    

Similar News