తెలుగు రాష్ట్రాల్లోనూ హార్దిక్ పటేల్

Update: 2015-10-01 09:36 GMT
హార్దిక్ పటేల్... పూర్తిగా మీసాలు కూడా బలపడని 22 ఏళ్ల ఈ కుర్రాడు మొండి ఘటం మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి కలవరం పుట్టించాడు. పటేల్ సామాజిక వర్గానికి రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ... దేశం యావత్తు తనపై దృష్టి నిలిపేలా సంచలనం సృష్టించాడు.... లక్షలాది మందితో ర్యాలీలు... డిపాజిట్లు ఉపసంహరించి గుజరాత్ ప్రభుత్వాన్ని భయపెట్టేలా కొత్తకొత్త ఎత్తుగడలతో నిరసనలు... ఇలా ప్రతి విషయంలోనూ హార్దిక్ అదరగొట్టేశాడు. తాజాగా ఈ చిరుత పులి తెలుగు రాష్ట్రాలకు సంబంధించి చేసిన ఓ డిమాండ్ తో ఈ రాష్ట్రాలపై తాను కన్నేశానని చెప్పకనే చెప్పాడు. తన పటేల్ ఉద్యమాన్ని ఇతర సామాజిక వర్గాలతో కలిపి దేశవ్యాప్త ఉద్యమం చేయాలని భావిస్తున్నానని సంకేతాలు పంపాడు. తెలుగు రాష్ట్రాల్లో కాపులను ఓబీసీల్లో చేర్చాలని ఆయన డిమాండ్ చేయడం సంచలనమైంది.

పటేల్ సామాజిక వర్గానికి రిజర్వేషన్లు కావాలని గుజరాత్ రాష్ట్రంలో హార్దిక్ పటేల్ చేస్తున్న డిమాండుకు మెజార్టీ వర్గాలు నుంచి వ్యతిరేకత ఉన్నా పటేల్ సామాజిక వర్గంతో పాటు రిజర్వేషన్లు కోరుతున్న పలువురు ఆయనకు మద్దతుగా నిలుస్తున్నారు. ఇప్పుడాయన  తన రిజర్వేషన్ల ఉద్యమాన్ని ఇతర రాష్ట్రాలకు వ్యాపింప చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా, తెలుగు రాష్ట్రాల్లోని కాపులను ఓబీసీల్లో చేర్చాలని డిమాండ్ చేశారు. తద్వారా, అన్ని రాష్ట్రాల్లో సామాజిక వర్గాలను సంఘటితం చేసేందుకు పావులు కదుపుతున్నారు. ఇప్పటికే రిజర్వేషన్ల కోసం కుర్మీ - గుజ్జర్లు - మరాఠా - పటేళ్లను కలుపుకొని ఆయన అఖిల భారతీయ పటేల్ నవ నిర్మాణ్ సేన ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.

అలాగే, ఏపీలో రిజర్వేషన్లు కోరుతున్న కాపుల మద్దతు దిశగా ఆయన అడుగులు వేస్తున్నారు. కాపులను ఓబీసీల్లో చేర్చాలన్న పోరాటానికి మద్దతు ఇస్తున్నట్లు చెప్పారు. తమ రిజర్వేషన్ల ఉద్యమంలో కాపులను కూడా కలుపుకొని పోతామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల సమయంలో కాపు సామాజిక వర్గాన్ని బిసిల్లో చేర్చుతామని హామీ ఇచ్చారు. ఆ హామీని నెరవేర్చుతామని ఆయన పలుమార్లు ప్రకటించారు.  ఇప్పుడు హార్దిక్ ఇక్కడ అడుగుపెడితే చంద్రబాబుకు కూడా తలనొప్పులు తప్పవు. రాజకీయంగానూ మార్పులు జరగొచ్చు.

Tags:    

Similar News