సీఎంను వ‌ణికించే బీకాం కుర్రాడే..

Update: 2015-08-19 12:32 GMT
రాష్ట్ర విభ‌జ‌న కార‌ణంగా సీమాంధ్ర దారుణంగా నష్ట‌పోయింద‌న్న విషయాన్ని తెలంగాణ నేత‌లు సైతం ఒప్పుకునే ప‌రిస్థితి. మ‌రి.. అలాంటి ప్రాంతానికి న్యాయంగా.. ధ‌ర్మంగా ఇవ్వాల్సిన‌వి కేంద్రం ఎందుకు ఇవ్వ‌టం లేదు?
కేంద్రాన్ని నిల‌దీసేవారు.. నిల‌దీయాల్సిన వారు చేత‌కాని ద‌ద్ద‌మ్మాలా మిగిలిపోవ‌టం.. ఎవ‌రికి వారు త‌మ రాజ‌కీయ ప్ర‌యోజ‌నాలు త‌ప్పించి ఏపీ ప్ర‌జ‌ల కోసం ప‌ని చేసే వారు లేక‌పోవ‌టం ఒక కార‌ణం. భ‌విష్య‌త్తు చీక‌టిగా మారిన ప్ర‌స్తుత త‌రుణంలో.. ఏం చేస్తే కేంద్రం క‌దిలి వ‌స్తుంద‌న్న ప్ర‌శ్న మ‌దిలో మెదిలే ప్ర‌తిఒక్క‌రికి తెలియాల్సిన వ్య‌క్తి హార్థిక్ ప‌టేల్‌. ప్ర‌స్తుతం గుజ‌రాత్ ప్ర‌భుత్వానికి వ‌ణుకు పుట్టిస్తున్న ఈ బీకాం చ‌దివిన కుర్రాడు సీమాంధ్రుల‌కు స్ఫూర్తిదాత అన‌టంలో సందేహం లేదు. ఇంత‌కీ.. ఈ హార్థిక్ ప‌టేల్ ఎవ‌రు..? అత‌ను సీమాంధ్రుల‌కు స్ఫూర్తి ఎందుక‌వుతాడంటే అత‌ని గురించి మొద‌ట తెలుసుకోవాల్సిందే.

గుజ‌రాత్‌ కు చెందిన ఈ 22 ఏళ్ల కుర్రాడు ప‌టేల్ వ‌ర్గానికి చెందిన‌వాడు. ఇత‌ని తండ్రికి ఒక చిన్న వ్యాపారం ఉంది. ఇత‌గాడు రీసెంట్‌ గా సూర‌త్‌ లో ఒక స‌భ పెడితే 5ల‌క్ష‌ల మంది ప‌రుగులు పెడుతూ వ‌చ్చి.. ఇత‌ని మాట వినేందుకు రెఢీ అయిపోయారు. రెండు నెల‌ల క్రితం ఇత‌గాడు ఎవ‌రో స‌గ‌టు గుజ‌రాతీయుల‌కు తెలీదు. కానీ.. ఇప్పుడు గుజ‌రాత్ మొత్తానికి అత‌నో సంచ‌ల‌నం. ఎంత‌లా అంటే.. గుజ‌రాత్ బీజేపీ స‌ర్కారు వెన్నులో సైతం వ‌ణుకు పుట్టించేంత‌.

ఇంతా చేస్తే అత‌ని తండ్రి బీజేపీ కార్య‌క‌ర్తే. ఇంత‌కీ అత‌నంటే అంద‌రికి అంత క్రేజ్ అంటే.. అత‌ను లేవ‌దీసిన నినాద‌మే. గుజ‌రాత్‌ లో ప‌టేల్ వ‌ర్గానికి రిజ‌ర్వేష‌న్ క‌ల్పించాల‌న్న ల‌క్ష్యంతో పాటిదార్ అనామ‌త్ ఆందోళ‌న్ స‌మితికి  భార‌త్ బాయ్ క‌న్వీన‌ర్ గా ప‌ని చేస్తున్నాడు. అయితే.. ఈ స‌మితిలోకి ఎప్పుడైతే హార్థిక్ ప‌టేల్ ఎంట‌ర్ అయ్యారో అప్ప‌టి నుంచి సీన్ మొత్తంగా మారిపోయింది. హుషారు పుట్టించే ప్ర‌సంగాల‌తో ప‌టేల్ వ‌ర్గీయుల‌కు స‌రికొత్త ఆశ‌గా మారాడు.

ఈ స‌మితి మొత్తం 110 స‌భ‌లు నిర్వ‌హిస్తే హార్థిక్ 70 స‌భ‌ ల్లో పాల్గొన్నాడు. అంతే.. విష‌యం మొత్తం మారిపోయింది. ఇత‌గాడు ఇప్పుడు పిలునిస్తే ల‌క్ష‌లాది మంది త‌మ ప‌నుల్ని ప‌క్క‌న పెట్టేసి మ‌రీ ప‌రుగులు పెడుతున్నారు. తాజాగా ఇత‌గాడు ఈ నెల 27న అహ్మాదాబాద్‌ లో ఒక బ‌హిరంగ స‌భ‌ను నిర్వ‌హిస్తున్నాడు. దీనికి 45 ల‌క్ష‌ల మంది హాజ‌ర‌య్యే అవ‌కాశం ఉందంటున్నారు.

ఇత‌గాడు వాదిస్తున్న‌ట్లు ప‌టేల్ వ‌ర్గానికి ఓబీసీ లోకి చేర్చే అంశాన్ని ప‌రిశీలించాల‌ని మంత్రుల‌తో ఒక క‌మిటీ వేశారు గుజ‌రాత్ ముఖ్య‌మంత్రి ఆనందీ ప‌టేల్‌. సీఎం కు సైతం వ‌ణుకు పుట్టిస్తున్న ఇత‌గాడు.. సీమాంధ్రుకు ఎందుకు స్ఫూర్తి కాదు.

కోరుకోని విభ‌జ‌న‌ను ఆంధ్రుల మీద రుద్ద‌ట‌మే కాదు.. దానికి భారం మొత్తం సీమాంధ్రులే భ‌రించాల‌నే దుర్మార్గాన్ని సీమాంధ్రులు ఎందుకు భ‌రించాలి? ఎందుకు భాద్య‌త వ‌హించాలి. దీనికి కార‌ణ‌మైన కేంద్రం నుంచి ఏపీకి అవ‌స‌ర‌మైన మొత్తం నిధుల్ని ముక్కు పిండి వ‌సూలు చేసేలా సీమాంధ్రులు న‌డుం బిగించాల్సిందే. కాక‌పోతే.. గుజ‌రాత్ కు ఇప్పుడు హార్థిక్ ప‌టేల్ మాదిరి.. స‌రైనోడు ఏపీకి ఒక‌డు కావాలి. అప్పుడు కానీ.. మొత్తంగా సీన్ సెట్ కాదన్న వాద‌న‌లో ఎంతోకొంత నిజం ఉంది క‌దూ..?
Tags:    

Similar News