ప్రమాదాల కుటుంబం

Update: 2018-08-29 05:12 GMT
నందమూరి హరిక్రిష్ణ కుటుంబాన్ని ప్రమాదాలు నిత్యం వెంటాడాయి. ఎక్కడికి వెళ్లాలన్నా తన కారులో తానే డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్లడం హరిక్రిష్ణకు - ఆయన కుటుంబ సభ్యులకు అలవాటు. రెండు రాష్ట్రాలలో ఎక్కడికి వెళ్లాలన్నా హరిక్రిష్ణ - ఆయన కుటుంబ సభ్యులు సొంత కారులోనే వెళ్లేవారు. డ్రైవర్ని కూడా పెట్టుకోకుండా హరిక్రిష్ణే కారు నడపడం ఆయనకు సరదా. పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు - కర్నాటక - కేరళలకు వెళ్లాలన్నా హరిక్రిష్ణ స్వంతంగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్లేవారు. ఇది ఆయనకు ఇష్టమే కాక తన డ్రైవింగ్‌ పై ఉన్న అపారమైన నమ్మకమని సన్నిహితులు చెప్తారు. అభిమానులకు ఎంతో ప్రాముఖ్యత నిచ్చే హరిక్రిష్ణ ఓ అభిమాని కుమారుని వివాహానికి వెళుతూ రోడ్డు ప్రమాదంలో మరణించడం విషాదం. గతంలో నందమూరి హరిక్రిష్ణ కుమారుడు జానకీ రామ్‌ కూడా రోడ్డు ప్రమాదంలోనే మరణించారు. అది కూడా హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారే కావడం గమనార్హం. ఈ ప్రమాదానికి ముందు జానకీ రామ్‌ కు డ్రైవింగ్ విషయంలో హరిక్రిష్ణ జాగ్రత్తలు చెప్పినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. నిజానికి హరిక్రిష్ణ డ్రైవింగ్‌ లో మంచి అనుభవం ఉన్నవారు. ఆయనలాగే కుమారుడు జానకీ రామ్‌ కు కూడా డ్రైవింగ్‌ అంటే ప్రాణం. హరిక్రిష్ణ కుటుంబాన్ని రోడ్డు ప్రమాదాలు వెంటాడతాయి అనడానికి మరో ఉదాహరణ నటుడు - తన కుమారుడు జూనియర్ ఎన్టీఆర్ కు జరిగిన ప్రమాదమే తార్కాణం.

2009లో జూనియర్‌ ఎన్టీఆర్‌ ప్రయాణించిన వాహనం ప్రమాదానికి గురై‍యింది. ఆ ఘటనలో జూనియర్ ఎన్టీఆర్ ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. ఈ సంఘటన తర్వాత రోడ్డు మార్గంలో ప్రయాణాలు తగ్గించమని కుమారుడు జూనియర్‌ ఎన్టీఆర్‌ కు సలహా కూడా ఇచ్చారు. అప్పటి నుంచే జూనియర్‌ ఎన్టీఆర్ విమాన - రైలు మార్గాలలోనే ఎక్కువగా ప్రయాణిస్తున్నారు. కుమారుడికి సలహా ఇచ్చిన హరిక్రిష్ణ మాత్రం ఆ సలహాను పాటించలేదని - దానికి కారణం తన డ్రైవింగ్‌ పై ఆయనకు ఉన్న నమ్మకమేనని సన్నిహితులు చెప్తారు. రాత్రి వేళ్లలో ఎక్కువగా ప్రయాణించడం హరిక్రిష్ణకు అలవాటు. దీనికి కారణం పగటిపూట సమయం కలసి రావడంతో పాటు ఎక్కడైనా ఆగినా అభిమానుల తాకిడి ఉండదని హరిక్రిష్ణ అనేవారు. ఈ ప్రమాదం జరగడానికి ముందు తెల్లవారు ఝమున హరిక్రిష్ణ బయలుదేరారు. నెల్లూరులో తన అభిమాని కుమారుడి వివాహానికి బయలుదేరిన హరిక్రిష్ణకు ఇదే చివరి ప్రయాణం కావడం విషాదం.



Tags:    

Similar News