రాజ్య‌స‌భ‌లో తెలుగు కోసం ప‌ట్టుబ‌ట్టిన హ‌రికృష్ణ‌

Update: 2018-08-29 12:00 GMT
నంద‌మూరి కుటుంబం అంటేనే తెలుగుకు వారెంత ప్రాధాన్య‌త ఇస్తారో చెప్పాల్సిన అవ‌స‌ర‌మే లేదు. స్వ‌ర్గీయ ఎన్టీఆర్ ను ఇప్ప‌టికి తెలుగోళ్లు ప్రాంతాల‌కు అతీతంగా గుర్తు పెట్టుకుంటారు. తెలుగోడి కీర్తి ప‌తాకాన్ని.. తెలుగు వాడి ఆత్మ‌గౌర‌వ నినాదాన్ని ప్ర‌పంచానికి చాటి చెప్పిన ఎన్టీఆర్ కొడుకుగా హ‌రికృష్ణ‌.. తెలుగు కోసం ఎంత ప‌ట్టుబ‌ట్టే వార‌న‌టానికి విభ‌జ‌న వేళ రాజ్య‌స‌భ‌లో ఆయ‌న ప్ర‌సంగాన్ని ప‌లువురు గుర్తు తెచ్చుకుంటారు.

విభ‌జ‌న నేప‌థ్యంలో రాజ్య‌స‌భ‌లో జ‌రిగిన చ‌ర్చ‌లో రాజ్య‌స‌భ స‌భ్యుడిగా ఉన్న హ‌రికృష్ణ మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా తెలుగు ప్ర‌జ‌ల‌ను విడ‌దీసే చ‌ర్చ‌లో పాల్గొన‌టం బాధాక‌రంగా ఆయ‌న ఆవేద‌న వ్య‌క్తం చేశారు. తెలుగులో మాట్లాడ‌టాన్ని నాటి రాజ్య‌స‌భ ఉపాధ్య‌క్షుడు కురియ‌న్ అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. తెలుగులో మాట్లాడాలంటే ముందుగా అనుమ‌తి తీసుకోవాల‌ని.. అలాంటిదేమీ తీసుకోనందున మాట్లాడ‌టం కుద‌ర‌ద‌న్నారు.

అయితే.. తాను తెలుగులోనే మాట్లాడ‌తాన‌ని.. విభ‌జ‌న వేళ ట్రాన్స్ లేష‌న్ కంటే ఎక్స్ ప్రెష‌న్ చాలా ముఖ్య‌మ‌న్నారు. స‌భ‌లో ఇన్ని భాష‌ల వారు ఉన్న‌ప్పుడు.. ట్రాన్స్ లేట‌ర్స్ కోసం ఆడ‌గాల్సిన అవ‌స‌రం ఏముంద‌ని ప్ర‌శ్నించారు.  వారిని అందుబాటులో ఉంచాల్సిన బాధ్య‌త స‌భ‌కు లేదా? అని అడిగారు. తాను ఈ రోజు మాట్లాడ‌తాన‌ని ముందే తెలిసిన‌ప్పుడు ఎందుకు ఏర్పాటు చేయ‌ర‌ని ఆయ‌న క్వ‌శ్చ‌న్ చేశారు. అయితే.. స‌భ్యుడు మాట్లాడేదేమిటో తెలుసుకోవాల్సిన బాధ్య‌త ఉంది క‌దా? అని కురియ‌న్ వ్యాఖ్యానించ‌గా.. అంత‌లో క‌లుగుజేసుకున్న వెంక‌య్య స‌భ్యుడు ఫ‌లానా భాష‌లోనే మాట్లాడాల‌ని స‌భాఅధ్య‌క్షుడికి లేద‌న్నారు. తెలుగులో మాట్లాడొద్ద‌ని కురియ‌న్ ఎంత కోరినా.. హ‌రికృష్ణ మాత్రం తెలుగులోనే మాట్లాడారు. తాంబూళాలు ఇచ్చేశాం త‌న్నుకు చావండ‌ని అంటారా? అని ప్ర‌శ్నిస్తూ.. ఒక కంటికి క‌న్నీరు.. మ‌రో కంటికి ప‌న్నీరా?  ఒక కంట్లో కారం చ‌ల్లి మ‌రో కంటికి కాటుక రాస్తారా? అంటూ విభ‌జ‌న మీద త‌న ఆవేద‌న‌ను అచ్చ తెలుగులోనే వ్య‌క్తం చేశారు.


Tags:    

Similar News