మోడీ ఫార్ములాను కాపీ కొట్టేసిన కేసీఆర్‌

Update: 2018-04-24 04:29 GMT
ఔను. ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీని తెలంగాణ సీఎం కేసీఆర్ కాపీ కొట్టారు. అది కూడా త‌న‌కు ఇష్ట‌మైన ప‌థ‌కాన్ని అమ‌లు చేసే స‌మ‌యంలో మోడీ ఏ పిలుపు అయితే ఇచ్చారో...అదే పిలుపును కేసీఆర్ డిటో దించేశారు. ఇదే విష‌యాన్ని కేసీఆర్ మేన‌ల్లుడు - రాష్ట్ర మంత్రి హ‌రీశ్‌ రావు వెల్ల‌డించారు. ఇంత‌కీ ఏంటా మోడీ పిలుపు ఏంటంటే... ఎల్పీజీ గ్యాస్ సిలిండ‌ర్‌ కు అర్హ‌త క‌లిగి ఉన్న‌ప్ప‌టికీ మెరుగైన ఆర్థిక స్థోమ‌త‌తో ఉండ‌టం వ‌ల్ల స‌బ్సిడీలో కాకుండా నేరుగా గ్యాస్ సిలిండ‌ర్ కొనుగోలు చేయ‌డం విష‌యంలో స‌బ్సిడీ వ‌దులుకోమ‌ని చేసిన ప్ర‌క‌ట‌న‌. బ‌దులుగా ఈ స‌బ్సిడీని అర్హులైన పేద‌ల‌కు అందిస్తామ‌ని ప్ర‌ధాని ప్ర‌చారం చేశారు. దీనికి స్పందించి దాదాపు కోటి మందికి పైగా త‌మ స‌బ్సిడీని వ‌దులుకున్నార‌ని బీజేపీ శ్రేణులు చెప్తుంటాయి.

స‌రిగ్గా మోడీ లాంటి పిలుపునే తాజాగా కేసీఆర్ ఇచ్చారు. దేశంలోనే మొట్ట‌మొద‌టి సారిగా...రైత‌న్న‌కు ద‌న్నుగా నిలిచేందుకు ఎక‌రాకు పంట‌కు రూ.4000 పెట్టుబ‌డిని అందించే విప్ల‌వాత్మ‌క నిర్ణ‌యాన్ని కేసీఆర్ తీసుకున్న సంగ‌తి తెలిసిందే. వ‌చ్చే వ్య‌వ‌సాయ సీజ‌న్ నుంచే దీన్ని అమ‌లు చేసేందుకు స‌ర్వం సిద్ధ‌మైంది. త్వ‌ర‌లోనే చెక్కులు కూడా పంపిణీ చేయ‌నున్నారు. ఈ నేప‌థ్యంలో మంత్రులు ఆయా ప్రాంతాల వారీగా ప్ర‌చారం చేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా తాజాగా సీఎం కేసీఆర్ మేన‌ల్లుడు - మంత్రి హరీశ్ రావు ఓ ఆస‌క్తిక‌ర విష‌యాన్ని పంచుకున్నారు.

సంగారెడ్డి జిల్లాలో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో మంత్రి హ‌రీశ్‌ రావు మాట్లాడుతూ పంట పెట్టుబడి వద్దనుకునే వాళ్లు స్వచ్ఛందంగా వదులుకోవచ్చునని సూచించారు. 'గివిట్ అప్' ద్వారా వదులుకున్న పంట పెట్టుబడిని తిరిగి రైతు సమన్వయ సమితి ఖాతాల్లోనే జమ చేస్తామన్నారు. ఈ డబ్బును ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం తీసుకోదని స్పష్టం చేశారు. రెవెన్యూ విలేజ్ ఆధారంగా చెక్కుల పంపిణీ జరుగుతుందని హరీశ్ రావు తెలిపారు. ఏ ఊరిలోనైనా ఒకే రోజులో చెక్కులు పంపిణీ పూర్తి చేయాలని కోరారు. గ్రామాల్లో ఉండే వృద్ధులు - వికలాంగులకు ఇంటి దగ్గరికి వెళ్లి చెక్కులివ్వాలని ఆయన ఆదేశించారు. రైతు సమన్వయ సమితి సభ్యులు, ప్రజా ప్రతినిధులు రైతులకు భోజన వసతి కల్పిస్తే బాగుంటుందని హరీశ్ రావు సూచించారు. యావద్దేశం తెలంగాణ దగ్గర నేర్చుకునే విధంగా క్రమశిక్షణతో చెక్కులు పంచాలని కోరారు. ఎవరి పేరిట చెక్కులుంటే వాళ్లే చెక్కులు తీసుకోవాలని రైతులని కోరారు. పంట వేసినా - వేయక పోయినా మొదటి సారి అందరికి చెక్కులు పంపిణీ చేస్తామన్నారు. పంట వేయని వారి గురించి తరువాత ఆలోచిస్తామని చెప్పారు. చెక్కు తీసుకున్న 90 రోజుల్లో డబ్బులు తీసుకోకుంటే వాళ్లకు పంట పెట్టుబడి అవసరం లేదని భావిస్తామని కూడా మంత్రి అన్నారు. అయితే ఈ ప్ర‌తిపాద‌న‌కు ఎలాంటి స్పంద‌న వ‌స్తుందో చూడాలి మ‌రి.

Tags:    

Similar News