మేన‌మామ కాన్ఫిడెన్సే మీకునా హ‌రీశ్‌?

Update: 2018-09-28 04:40 GMT
ముంద‌స్తు ఎన్నిక‌లకు సంబంధించి ఈసీ త‌న నిర్ణ‌యాన్ని ఇప్ప‌టికి వెల్ల‌డించ‌న‌ప్ప‌టికీ.. రాజ‌కీయ వ‌ర్గాల్లో ముంద‌స్తు వేడి ఎప్పుడో వ‌చ్చేసిన సంగ‌తి తెలిసిందే. త‌మ రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థుల‌పై ఏ మాత్రం క‌నిక‌రం లేకుండా తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ‌టంలో తెలంగాణ అధికార‌ప‌క్షం అంద‌రి కంటే ముందుంద‌న్న‌ది నిజం.

అభ్య‌ర్థుల ఎంపిక విష‌యంలోనూ.. పొత్తుల అంశంపైనా కిందా మీదా ప‌డుతున్న కాంగ్రెస్ త‌దిత‌ర పార్టీల‌కు.. తాజాగా త‌మ పార్టీ నేత‌ల‌పై వ‌చ్చి ప‌డుతున్న కేసులు.. త‌నిఖీలు ఇప్పుడు మ‌రో త‌ల‌నొప్పిగా మారుతున్నాయి. ఇదిలా ఉంటే.. అధికార‌ప‌క్ష నేత‌లు మాత్రం ప్ర‌చారంలో దూసుకెళుతున్నారు. విప‌క్ష నేత‌ల తీరును.. వారి అవినీతిపైనా మండిప‌డుతున్నారు.

తెలంగాణ ఆప‌ద్ద‌ర్మ ముఖ్య‌మంత్రి కేసీఆర్ మేన‌ల్లుడు క‌మ్ తాజా మాజీ మంత్రి హ‌రీశ్ రావు త‌న మాట‌ల దాడిని మ‌రింత పెంచారు. వ‌చ్చే సాధార‌ణ ఎన్నిక‌ల త‌ర్వాత తెలంగాణ‌లో కాంగ్రెస్ కు ప్ర‌తిప‌క్ష పార్టీ హోదా కూడా ద‌క్క‌ద‌ని జోస్యం చెప్పారు.

తెలంగాణ అభివృద్ధిని అడ్డుకోవ‌టానికి కాంగ్రెస్‌.. టీడీపీలు జ‌ట్టు క‌ట్ట‌టాన్ని ఆయ‌న త‌ప్పు ప‌ట్టారు.  ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకోవ‌టంపై తీవ్ర అభ్యంత‌రం వ్య‌క్తం చేసిన హ‌రీశ్‌.. కాళేశ్వ‌రం ప్రాజెక్టును ఏపీ సీఎం అడ్డుకుంటున్నార‌ని చెప్పారు. అలాంటి బాబుతో కాంగ్రెస్ జ‌ట్టు క‌ట్ట‌ట‌మా అని నిల‌దీస్తున్నారు.

హ‌రీశ్ ఆగ్ర‌హం బాగానే ఉంది కాదు.. తెలంగాణ రాష్ట్రం వ‌చ్చిన త‌ర్వాత కూడా ఇంకా ఆంధ్రా.. తెలంగాణ పేరుతో రాజ‌కీయాలు చేయ‌టం ఏమిట‌న్న‌ది ఒక క్వ‌శ్చ‌న్‌. రాజ‌కీయాల్లో అంతో ఇంతో ప‌రిణితి ఉంద‌ని భావించే హ‌రీశ్ లాంటి వారు.. మేన‌మామ మ‌న‌సుల్ని దోచుకోవ‌టానికి అదే ప‌నిగా కాంగ్రెస్ పై విమ‌ర్శ‌లు చేయ‌టం ద్వారా.. ఆ పార్టీకి ప్ర‌జ‌ల్లో సానుభూతి పెంచేలా హ‌రీశ్ వ్యాఖ్య‌లు ఉంటున్నాయ‌ని చెబుతున్నారు. ఎంత కాంగ్రెస్‌పార్టీ అయితే మాత్రం మ‌రీ అంత చుల‌క‌నా? అంటూ హ‌రీశ్ ను ప్ర‌శ్నించే వారు లేక‌పోలేదు.

నిజంగానే కాంగ్రెస్ కానీ ప్ర‌తిప‌క్ష హోదా కూడా సాధించ‌లేని స్థితిలో ఉండి ఉంటే.. హ‌రీశ్ మ‌రీ ఇంత స్థాయిలో ఆ పార్టీపై దునుమాడేవారా? అన్నది ప్ర‌శ్న‌. తెలంగాణ‌లో త‌మ‌కు ఇబ్బంది పెట్టే ఏ పార్టీ ఉన్నా.. దానిపై తీవ్ర విమ‌ర్శ‌లు చేసే గులాబీ నేత‌ల తీరుకు త‌గ్గ‌ట్లే హ‌రీశ్ వ్య‌వ‌హ‌రిస్తున్నారే త‌ప్పించి.. త‌న‌దైన ప‌రిణితి చూపించ‌టం లేద‌న్న వాద‌న వినిపిస్తోంది. మిగిలిన నేత‌ల మాదిరే హ‌రీశ్ సైతం విమ‌ర్శ‌లు చేయ‌టం ఆయ‌న స్థాయికి సూట్ కావ‌టం లేద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.
Tags:    

Similar News