ఆంధ్రోళ్ల‌తో కాంగ్రెస్ కుమ్మ‌క్కు: హ‌రీశ్

Update: 2018-10-08 07:26 GMT
తెలంగాణ‌లో ముంద‌స్తు ఎన్నిక‌ల షెడ్యూలు ఖ‌రారైన నేప‌థ్యంలో టీఆర్ ఎస్ సీనియ‌ర్ నేత‌ - ఆప‌ద్ధ‌ర్మ మంత్రి హ‌రీశ్ రావు త‌న మాట‌ల వేడిని పెంచుతున్నారు. ప‌దునైన విమ‌ర్శ‌ల‌తో ప్ర‌త్య‌ర్థి పార్టీల‌పై క‌త్తులు దూస్తున్నారు. తాజాగా సిద్ధిపేట‌లో పార్టీ కార్య‌క‌ర్త‌ల స‌మావేశంలో కాంగ్రెస్‌ పై హ‌రీశ్ నిప్పులు చెరిగారు. తెలంగాణ కాంగ్రెస్ నేత‌లు ఆంధ్రా పాల‌కుల‌తో కుమ్మ‌క్క‌య్యార‌ని ఆరోపించారు. రాష్ట్ర ప్ర‌యోజ‌నాల‌ను పొరుగు రాష్ట్రానికి వారు తాక‌ట్టు పెడుతున్నారంటూ ధ్వ‌జ‌మెత్తారు.

కాంగ్రెస్ నేత‌లు తాత్కాలిక రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల కోసం ఆంధ్రోళ్ల‌తో జ‌ట్టుక‌డుతున్నారంటూ హ‌రీశ్ రావు ఆరోప‌ణ‌లు గుప్పించారు. దాని ద్వారా తెలంగాణ‌కు తీర‌ని అన్యాయం జ‌రుగుతుంద‌న్న వాస్త‌వాన్ని వారు గుర్తించ‌లేక‌పోతున్నార‌ని విమ‌ర్శించారు. 'స్వాతంత్ర్యానంత‌రం 60 ఏళ్ల పాల‌న‌లో తెలంగాణ‌ను కాంగ్రెస్ దారుణంగా మోసం చేసింది. ఇక్క‌డి స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించేందుకు ఆ పార్టీ ఎంత‌మాత్రమూ ప్ర‌య‌త్నించ‌లేదు. నిరంత‌రం ఆంధ్ర‌నే నెత్తిన పెట్టుకుంటూ.. తెలంగాణ‌ను స‌వ‌తి బిడ్డ‌లా చూసింది' అని హ‌రీశ్ పేర్కొన్నారు. అదే స‌మ‌యంలో కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ ఎస్ తెలంగాణ కోసం ఎంత‌గా ప‌రిత‌పించిందో ప్ర‌జ‌లంద‌రికీ తెలుసున‌న్నారు. ప్ర‌త్యేక‌ రాష్ట్ర సాధ‌న కోసం టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ తన ప్రాణాల‌ను కూడా లెక్క‌చేయ‌ని సంగ‌తిని గుర్తుచేశారు. తెలంగాణ‌లో ప‌రాయి పాల‌న తీసుకొచ్చేందుకు కాంగ్రెస్ నేత‌లు ప్రయ‌త్నిస్తున్నార‌ని హ‌రీశ్ ధ్వ‌జమెత్తారు. స్వ‌ప‌రిపాల‌నే ల‌క్ష్యంగా తెలంగాణ ప్ర‌జ‌లు సొంత రాష్ట్రాన్ని సాధించుకుంటే.. మ‌ళ్లీ ప‌రాయి పాల‌న వైపు రాష్ట్రాన్ని న‌డిపించాల‌ని కాంగ్రెస్ చూస్తోందంటూ విమ‌ర్శించారు. హ‌స్తం పార్టీ కుయుక్తులు తెలంగాణ ప్ర‌జ‌ల ముందు ఫ‌లించ‌బోవ‌ని విశ్వాసం వ్య‌క్తం చేశారు. కాంగ్రెస్‌కు త‌గిన గుణపాఠం చెప్తూ టీఆర్ ఎస్‌ కే మ‌ళ్లీ ప్ర‌జ‌లు అధికారం క‌ట్ట‌బెడ‌తార‌ని జోస్యం చెప్పారు.

Tags:    

Similar News