హ‌రీశ్ ఫాలోయ‌ర్స్ ఎంత‌గా ర‌గిలిపోతున్నారంటే?

Update: 2019-06-20 04:47 GMT
రాజ‌కీయాల్లో ఏం జ‌రిగినా.. అది ఉత్త పుణ్యానికి జ‌ర‌గ‌దు. దాని వెనుక క‌నిపించ‌ని కార‌ణాలెన్నో ఉంటాయి. తెలంగాణ ఏర్పాటు కేసీఆర్ చేసిన దీక్షతో సాధ్యం కాలేదు. కాంగ్రెస్ కుయుక్తి  కూడా ఉంద‌న్న‌ది మ‌ర్చిపోకూడ‌దు. ఎన్టీఆర్ వెన్నుపోటు.. తాజాగా జ‌గ‌న్ చారిత్ర‌క విజ‌యం అన్ని ఒక్క‌రోజులో జ‌రిగిపోలేదు. దాని వెనుక ఏళ్ల‌కు ఏళ్లుగా చోటు చేసుకున్న అనేక ప‌రిణామాలు ఒక పెద్ద ఘ‌ట‌న‌కు కార‌ణ‌మ‌వుతుంటాయి.

రాజ‌కీయాల్లో తెలిసి త‌ప్పులు చేయ‌కూడ‌దు. ప‌లానా వారి ఉనికి ఉండ‌కూడ‌ద‌ని ఆశించ‌టం అత్యాశే అవుతుంది. టీఆర్ఎస్ అన్న‌ది క‌నిపించ‌కూడ‌ద‌న్న ఉద్దేశంతో దానిపై రాజ‌కీయంగా జ‌రిగిన దాడుల్ని చ‌రిత్ర తిర‌గేస్తే క‌నిపిస్తుంది. దెబ్బ కొట్టాల‌న్న ప్ర‌తిసారీ మ‌రింత బ‌లోపేతమైన ఘ‌న చ‌రిత్ర ఆ పార్టీ సొంతం. ఎందుకంటే.. ఆ పార్టీ నిజాయితీగా తెలంగాణ రాష్ట్ర సాధ‌న‌ను కోరుకుంది. ఆ ల‌క్ష్యం త‌ప్పించి మ‌రింకేమీ లేదు. అదే ఆ పార్టీకి వ‌ర‌మైంది.

అప్ప‌టి టీఆర్ఎస్ కు ఇప్ప‌టి టీఆర్ఎస్ కు పోలిక లేదన్న మాట కొంద‌రి నోట వినిపిస్తూ ఉంటుంది. కేసీఆర్ లాంటి తిరుగులేని అధినేత పార్టీకి అండ‌గా ఉన్న‌ప్పుడు అసంతృప్తి జ్వాల‌కు అవ‌కాశం ఉంటుందా? అంటే ఉండ‌ద‌నే చెబుతారు. కానీ.. అందుకు సిత్రంగా రోజులు గ‌డిచే కొద్దీ కేసీఆర్ మీద అసంతృప్తిని వ్య‌క్తం చేసే నేత‌ల లిస్ట్ అంత‌కంత‌కూ పెరిగిపోతోంది.  ఇదో ప్ర‌మాద సంకేతంగా చెప్ప‌క త‌ప్ప‌దు. కానీ.. ఇలాంటి వాటిని ప‌ట్టించుకునే ప‌రిస్థితుల్లో కేసీఆర్ లేర‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

తాజాగా తెలంగాణ వ్యాప్తంగా కాళేశ్వ‌రం ఫీవ‌ర్ న‌డుస్తోంది. ఒక భారీ ప్రాజెక్టును రికార్డు స‌మ‌యంలో పూర్తి చేసిన ఘ‌ట‌న‌లు  ఈ మ‌ధ్య కాలంలో లేవ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. అందునా.. నీటి కొర‌త ఎక్కువ‌గా ఉండే తెలంగాణ‌లో నీళ్ల‌ను చూస్తే.. తెలంగాణ‌వాసులు అదోలాంటి ఆనందాన్ని వ్య‌క్తం చేస్తుంటారు. సంబ‌ర‌ప‌డిపోతుంటారు. అలాంటి చోట బాహుబ‌లి లాంటి కాళేశ్వ‌రం ప్రాజెక్టు ల్యాండ్ మార్క్ లాంటిది. దాన్ని పూర్తి చేసిన కేసీఆర్ ను మ‌ర్చిపోలేరు.

అయితే.. ఇంత పెద్ద ప‌నిని పూర్తి చేసిన కేసీఆర్‌.. ఆ ప‌ని పూర్తి చేయ‌టంలో నిజాయితీగా ప‌ని చేసిన హ‌రీశ్ రావును ప‌క్క‌న పెట్టేసిన తీరు గులాబీ పార్టీలో అంత‌ర్గ‌త చ‌ర్చ‌కు కార‌ణ‌మ‌వుతుంది. ఇక‌.. హ‌రీశ్ ను అభిమానించి.. ఆరాధించే వారి ప‌రిస్థితిని ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌ర‌మే లేదు. వారిని క‌దిలిస్తే చాలు.. త‌మ నేత‌కు జ‌రిగిన మోసాన్ని వారు అదే ప‌నిగా చెబుతున్నారు. కాకుంటే.. కేసీఆర్ బ‌లాన్ని ప్ర‌శ్నించే ప‌రిస్థితి లేక‌పోవ‌టంతో వారు కుమిలిపోతున్నారు.

కాళేశ్వ‌రం ప్రాజెక్టు తెలంగాణ‌కు వ‌ర‌ప్ర‌దాయ‌ని ఎలా అవుతుందో.. ఈ ప్రాజెక్టు మోసానికి.. న‌మ్మ‌క‌ద్రోహానికి.. విశ్వాసంగా ప‌ని చేసిన వారి ప‌ట్ల నిర్ద‌య‌గా వ్య‌వ‌హ‌రించిన వైనానికి నిలువెత్తు రూపంగా నిలుస్తుంద‌ని చెబుతున్నారు.

తెలంగాణ రాజ‌కీయాల‌కు సంబంధించి భ‌విష్య‌త్తులో చోటు చేసుకునే ఎన్నో ప‌రిణామాల‌కు కాళేశ్వ‌రం ప్రాజెక్టు కీల‌కం కానున్న‌ద‌న్న మాట వినిపిస్తోంది. రేపు (శుక్ర‌వారం) ప్రారంభ‌మ‌య్యే కాళేశ్వ‌రం ప్రాజెక్టు.. కేసీఆర్ కు వ‌రంగా మారుతుందా?  శాప‌మ‌వుతుంద‌న్న‌ది కాల‌మే చెబుతుందంటూ వినిపిస్తున్న వ్యాఖ్య‌లు చూస్తే.. భ‌విష్య‌త్తు క‌ళ్ల ముందు క‌నిపించ‌క మాన‌దు.
Tags:    

Similar News