సిద్ధిపేటలో హరీశ్ మాటలు విన్నారా?

Update: 2016-04-04 05:46 GMT
తెలంగాణ రాష్ట్రంలో మిగిలిన నియోజకవర్గాలు ఒక ఎత్తు అయితే సిద్ధిపేట వ్యవహారం ఒక ఎత్తు. ఆ నియోజకవర్గంలో హరీశ్ రావు మాట శిలాశాసనంగా చెబుతారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కంటే కూడా హరీశ్ మాటకే అక్కడి ప్రజలు ప్రాధాన్యత ఇచ్చారు. హరీశ్ నోటి నుంచి మాట వచ్చిందంటే చాలు దాన్ని పూర్తి చేసే వరకు నిద్రపోరు లాంటి తరహా వ్యాఖ్యల్ని తరచూ పలువురు చేస్తుంటారు. వీటిల్లో నిజం ఎంత? అన్నది పక్కన పెడితే.. ఆ తరహా మాటల్నే మంత్రి కమ్ కేసీఆర్ మేనల్లుడు హరీశ్ నోటి వెంట రావటం గమనార్హం.

తాజాగా సిద్ధిపేట మున్సిపాలిటీకి జరుగుతున్న స్థానిక ఎన్నికల్లో మొత్తం స్థానాల్లోనూ గులాబీ జెండా ఎగరాలన్న టార్గెట్ పెట్టుకున్నారు హరీశ్ రావు. దీనికి తగ్గట్లే ఆయన విపరీతంగా శ్రమిస్తున్నారు. సిద్ధిపేటలో తనకున్న పట్టును మరోసారి ప్రదర్శించాలని తపిస్తున్న హరీశ్ నోటి వెంట తాజాగా వచ్చిన వ్యాఖ్యలు చూస్తే.. నియోజకవర్గం మీద ఆయనకున్న పట్టు ఎంతన్నది ఇట్టే అర్థమవుతుంది.

సిద్ధిపేటలోని 34 వార్డుల్లో ఆరు వార్డులు ఏకగ్రీవం అయ్యాయని.. మిగిలిన 28 వార్డుల్లోనూ టీఆర్ ఎస్ జెండా ఎగరాలన్న హరీశ్.. కారు గుర్తుకు ఓటేస్తే హరీశ్ కు ఓటేసినట్లేనని చెప్పారు. కొద్ది నెలల్లో సిద్ధిపేట జిల్లా కేంద్రం కానుందని.. సిద్ధిపేట వాసుల కల అయిన రైలును త్వరలోనే తీసుకొస్తానని చెప్పుకొచ్చారు. పార్టీ కంటే తనకున్న పట్టును హరీశ్ తన మాటలతో చెప్పకనే చెప్పేశాడు కదూ.
Tags:    

Similar News