టీఆర్ ఎస్‌ కు వ‌రంగ‌ల్ టెన్ష‌న్‌

Update: 2016-03-02 09:35 GMT
తెలంగాణ‌లో జ‌రుగుతున్న వ‌రుస ఎన్నిక‌ల ప‌ర్వంలో భాగంగా ప్ర‌స్తుతం జ‌రుగుతున్న గ్రేటర్ వరంగల్ - ఖ‌మ్మం కార్పొరేష‌న్‌ - అచ్చంపేట న‌గ‌ర పంచాయ‌తీ పోరు ఇపుడు తెలంగాణ‌లో హాట్ టాపిక్‌ గా మారింది. అన్నింటికంటే ముఖ్యంగా ఉద్య‌మ భావ‌జాలం అధికంగా ఉండే వ‌రంగ‌ల్‌లో  రెబల్స్ ప్రధాన పార్టీలకు దడ పుట్టిస్తున్నారు. పార్టీ త‌ర‌ఫున బీ ఫాం ద‌క్క‌ని అసంతృప్తులు తిరుగుబాటు అభ్యర్థులుగా బరిలోకి దిగ‌గా...అధికార పార్టీలో ఈ రెబల్స్ ఎక్కువ మంది ఉండ‌టంతో ఇపుడు వ‌రంగ‌ల్‌ లో ఒక‌వైపు ప్ర‌చారం, ఇంకోవైపు బుజ్జ‌గింపుల ప‌ర్వం కొన‌సాగుతోంది.

వ‌రంగ‌ల్‌లోని మొత్తం 58 డివిజన్లలో 398 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇందులో 147 మంది ఇండిపెండెంట్లుగా బ‌రిలో ఉన్నారు. అధికార పార్టీ నుంచి టికెట్ కోసం స‌హజంగానే పెద్ద ఎత్తున పోటీ ఎదురైంది. ఆశావాహులందరికీ టికెట్ రాకపోవడంతో టీఆర్ ఎస్ నాయ‌కులే 47 వార్డుల్లో రెబెల్స్‌ గా పోటీకి దిగారు. ఈ తిరుగుబాటుదారుల‌ను పోటీ నుంచి తప్పించేందుకు మంత్రి, వ‌రంగ‌ల్ ఎన్నిక‌ల టీఆర్ ఎస్‌ ఇంచార్జీ హరీష్ రావు శ‌త‌విధాల‌ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్ర‌మంలో రెబెల్స్‌ తో మాట్లాడేందుకు సిద్ధ‌ప‌డ‌క‌పోతే స్థానిక ఎమ్మెల్సీ కొండా మురళీ స‌హ‌కారంతో ఆ నాయ‌కుల‌తో ఫోన్లో మాట్లాడుతున్నట్టు తెలుస్తోంది. ఇదే స‌మ‌యంలో పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థులు ప్రజల్లో ఉండి ప్రచారం చేయాలని హ‌రీష్ స్ప‌ష్టం చేస్తున్నారు.

ఎన్నికల్లో రెబెల్స్ సగానికంటే ఎక్కువ డివిజన్లలో పొటీలో ఉన్నందున వారిని నయానో, భయానో దార్లోకి తెచ్చుకుంటూనే ప్రచారం నిర్వ‌హించ‌డంలో హ‌రీష్ రావు బిజీబిజీగా ఉన్నారు. గ్రేటర్ వరంగల్ ఎన్నికల్లో పోలింగ్ కు సమయం దగ్గర పడుతుండటంతో రెబెల్ అభ్యర్థులను బుజ్జగించే పని చేస్తూనే..ఓట్లు చీలకుండా పార్టీ అభ్యర్థుల గెలుపు ద‌క్కేలా హరీష్ శ్ర‌మిస్తున్నారు. అయిన‌ప్ప‌టికీ రెబెల్స్ ను దారిలోకి రాకుంటే పరిస్థితి ఎలా ఉంటుందన్నదానిపై ప‌లువురు గులాబీ నేత‌లు టెన్షన్ పడుతున్నారు.
Tags:    

Similar News