హర్షకుమార్ కాల్పులు ఎందుకు జరిపారు?

Update: 2015-07-11 23:08 GMT
కొందరు నేతల వైఖరి చాలా చిత్రంగా ఉంటుంది. తమ రాజకీయ మైలేజీ కోసం సమస్యల్ని తెరపైకి తీసుకొచ్చి రచ్చ రచ్చ చేస్తుంటారు. తాజాగా ఏపీలోమాజీ ఎంపీ హర్షకుమార్ వైఖరి ఇలానే ఉంది. గోదావరి పుష్కరాలు ప్రారంభం కావటానికి కేవలం రెండు రోజుల సమయం మాత్రమే ఉన్న సమయంలో.. ఆయన క్రిస్టియన్ శశ్మాన వాటికకుస్థలం కేటాయించాలని కోరుతూ.. ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. సుదీర్ఘ కాలం పాటు ఎంపీగా వ్యవహరించిన హర్షకుమార్.. తన సర్కారు అధికారంలో ఉన్నప్పుడు ఈ సమస్య పరిష్కారం కోసం ఎందుకు కృషి చేయలేదో అర్థంకాని పరిస్థితి.

చేతిలో అధికారం ఉన్నప్పుడు పనులు చేయకుండా.. పవర్ లేనప్పుడు.. అధికారపక్షంపై ఒత్తిడి తీసుకొస్తూ రచ్చ.. రచ్చచేయటం మామూలే. దీనికి హర్షకుమార్ మినహాయింపు కాదు. తానుచేస్తున్న దీక్ష విషయంలో ఏపీ సర్కారు సానుకూలంగా స్పందించటం లేదంటూ తన దీక్షను మరింత ఉధృతం చేశారు. ఈ సందర్భంగా హర్షకుమార్ ఆరోగ్యం కాస్త ఆందోళన కరంగా ఉండటంతో.. ఆయన చేస్తున్న దీక్షను భగ్నం చేసేందుకు పోలీసులు ప్రయత్నించారు.

ఈ సందర్భంలోనే.. మాజీ ఎంపీ కొడుకులిద్దరూ..తండ్రి చేస్తున్న ఆందోళనను సమీక్షిస్తున్నారు. వారిలో ఒకరు ఏపీ ముఖ్యమంత్రిచంద్రబాబు బస చేసిన ప్రాంతానికి చేరుకొని (పుష్కరాల సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి శనివారం రాజమండ్రికి చేరుకున్నారు) ఆయన్ను కలిసే ప్రయత్నం చేశారు.

మరోవైపు హర్షకుమార్ దీక్షను భగ్నం చేసేందుకు పోలీసులు ప్రయత్నించిన నేపథ్యంలో.. తన వ్యక్తిగత తుపాకీని గాల్లోకి కాల్పులు జరిపిన హర్షకుమార్.. పోలీసులు కానీ తన దగ్గరకు వస్తే.. అదే తుపాకీతో తాను కాల్చుకొని చనిపోతానంటూ హెచ్చరించారు. మొత్తానికి హర్షకుమార్ ని.. ఆయన తుపాకీని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. ఆయన్నుప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ఈ సందర్భంగా అక్కడున్న హర్షకుమార్ మద్ధతుదారులు పోలీసు వాహనాల్ని ధ్వంసం చేశారు. మరోవైపు.. ఆసుపత్రికి తరలించిన హర్షకుమార్.. తనకు చికిత్స చేసేందుకు ప్రయత్నిస్తున్న వైద్యుల్ని వారిస్తూ.. చికిత్సకు నిరాకరించారు. ఇక.. శనివారం రాత్రి ఇదే అంశానికి సంబంధించి నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి.

ఆసుపత్రికి చేరిన హర్షకుమార్.. తన అనుచరుడి బైక్ మీద శనివారం అర్థరాత్రి వేళ పారిపోయారు. తర్వాత కాసేపటికే.. రాజమండ్రి త్రీటౌన్ పోలీస్ స్టేషన్ దగ్గర లొంగిపోయారు. గాల్లోకి కాల్పులు జరిపిన ఘటనను సీరియస్ గా తీసుకున్న పోలీసులు.. మాజీ ఎంపీ హర్షకుమార్ పై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసే ప్రయత్నంలో నిమగ్నమయ్యారు. సమస్యను పరిష్కరించే కన్నా.. దాంతో మరింత రచ్చ చేయటం రాజకీయ నాయకులకు చేతనైనంతగా మరెవరికీ చేతకాదేమో. తాను ఎంపీగా ఉన్న సమయంలో.. శ్శశాన వాటికకు స్థలం కేటాయించటం పెద్ద కష్టమే కాదు. హర్షకుమార్ అప్పుడేం చేశారో..?
Tags:    

Similar News