రిటైర్మెంట్ రోజున.. జేమ్స్ బాండ్ లా చేశాడు

Update: 2019-09-01 04:42 GMT
రీల్ లైఫ్ లో జేమ్స్ బాండ్ ఏమైనా చేస్తాడు. అసాధ్యమన్నది అతడి డిక్షనరీలో ఉండదు. రీల్ బాండ్ ను చూసి రియల్ గా ఉండేందుకు విపరీతంగా ప్రయత్నిస్తుంటారు. అలాంటి రియల్ బాండ్ వ్యవహారం ఇప్పుడు వార్తాంశంగా మారటమే కాదు.. పెద్ద ఎత్తున అందరిని ఆకర్షిస్తోంది. ఇంతకీ.. ఈ రియల్ బాండ్ పాతికేళ్ల కుర్రాడు కాదు. అరవైఏళ్లకు దగ్గర పడిన పెద్ద మనిషి.

అరవైఏళ్ల వయసులో బాండ్ తరహాలో ఏం చేశారంటారా? అక్కడికే వస్తున్నాం. రాజస్థాన్ కు చెందిన రమేశ్ చంద్ మీనా ఒక సాదాసీదా టీచర్. పెళ్లైన కొత్తల్లో ఇంటి మేడ మీద కూర్చొన్న ఏకాంత సమయంలో వారింటి పై నుంచి వెళ్లిందో హెలికాఫ్టర్. దాన్ని అద్దెకు తీసుకోవాలంటే ఎంత అవుతుందని అమాయకంగా అడిగిందామె. దానికి ఆయన సమాధానం చెప్పలేదు కూడా.

అయితే.. భార్య అడిగిన హెలికాఫ్టర్ ను ఆయన మర్చిపోలేదు. తాజాగా ఆయన రిటైర్మెంట్ జరిగింది.విధి నిర్వహణలో తన చివరి రోజున ఆమె కలలో కూడా ఊహించని ఏర్పాటు చేశారు. తన రిటైర్మెంట్ రోజున హెలికాఫ్టర్ ను బుక్ చేసిన ఆయన.. తన భార్యను ఇంటి వద్దకు హెలికాఫ్టర్ లో చేర్చారు. రాజస్థాన్ లోని మారుమూలన ఉన్న మలవలీ గ్రామంలో చోటు చేసుకున్న ఈ ఘటన పలువురిని ఆకర్షిస్తోంది.

భార్య కోరిక తీర్చటం కోసం ఆయన తీసుకున్న నిర్ణయంతో ఆయన్ను రియల్ బాండ్ గా పలువురు అభివర్ణిస్తున్నారు. అప్పుడెప్పుడో పెళ్లైన కొత్తల్లో భార్య అడిగిన మాటను గుర్తు పెట్టుకొని.. ఈ తీరులో ప్లాన్ చేయటాన్ని విశేషంగానే చెప్పాలి. ఢిల్లీ నుంచి తన గ్రామానికి హెలికాఫ్టర్ కోసం తాను రూ.3.70లక్షలు ఖర్చు చేసినట్లుగా చెబుతున్నారు. అనుకుంటాం కానీ రియల్ లైఫ్ లో మనం సరిగా అనుకోవాలే కానీ.. జరగనిదంటూ ఏం ఉంటుంది చెప్పండి?
Tags:    

Similar News