‘జగన్’ రిక్వెస్ట్ కు నో అన్న హైకోర్టు

Update: 2016-11-29 04:22 GMT
ఏపీ విపక్ష నేత.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చెందిన జగతి పబ్లికేషన్స్ కు.. జగన్ మెదడుగా చెప్పే ఆయన సన్నిహితుడు విజయసాయిరెడ్డికి హైకోర్టులో ఊరట కలగలేదు. జగన్ అక్రమాస్తుల కేసుల విచారణలో తమకు నష్టం కలిగించేలా ఉన్నఉత్తర్వుల్నిపున: సమీక్షించాలని.. స్పష్టత ఇవ్వాలని కోరుతూ తాజాగా పెట్టుకున్న పిటీషన్లకు హైకోర్టు నుంచి సానుకూలత వ్యక్తం కాలేదు.

దీనికి సంబంధించి దాఖలు చేసిన పిటీషన్లను స్వీకరించేందుకు హైకోర్టు నో చెప్పేసింది. దీనికి సంబంధించిన అభ్యంతరాలు ఉంటే సీబీఐ ప్రత్యేక కోర్టులో పిటిషన్లు దాఖలు చేసుకోవాలని సూచించింది. జగన్ అక్రమ ఆస్తుల కేసుల్లో పలువురు నిందితులు హైకోర్టును ఆశ్రయించి.. విచారణపై స్టే పొందారు. దీంతో.. మిగిలిన కేసుల్లో సీబీఐ కోర్టు విచారిస్తోంది. ఒకే రకమైన ఆరోపణలున్న కొన్ని కేసుల్లో విచారణ సాగటం వల్ల నష్టం కలుగుతుందని.. అందుకే.. గతంలో ఇచ్చిన ఉత్తర్వులను ఒక్కసారి పున:సమీక్షించాలని కోరుతూ జగన్ సన్నిహితుడు విజయ్ సాయి రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు.

ఆయనతో పాటు జగతి పబ్లికేషన్ సంస్థ కూడా మరో పిటీషన్ దాఖలు చేశారు. అయితే.. వీటిని పరిశీలించిన కోర్టు.. స్టే ఇచ్చేందుకు నో చెప్పేస్తూ.. పిటిషన్లను తిరస్కరించింది. దీంతో.. ‘స్టే’ మీద ఆశలు పెట్టుకున్న విజయసాయిరెడ్డికి.. జగతి పబ్లికేషన్లకు నిరాశ కలిగిందని చెప్పక తప్పదు. తాజా పరిణామాల నేపథ్యంలో గతంలో సాగుతున్న కేసుల విచారణ మరింత ఊపందుకునే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News