కేసీఆర్ స‌ర్కారుకు పంచ్‌..ఓవైసీకి షాకిచ్చిన హైకోర్టు

Update: 2018-09-27 05:20 GMT
ప్ర‌జాధ‌నాన్ని.. ప్ర‌జ‌ల ఆస్తుల‌ను కాపాడే స్థానంలో ఉంటూ.. తొంద‌ర‌ప‌డి నిర్ణ‌యాలు తీసుకుంటే వాటికి చెక్ పెట్టే వ్య‌వ‌స్థ‌లు దేశంలో ఉన్నాయ‌న్న భావ‌న కొన్ని ఉదంతాల్ని చూస్తున్న‌ప్పుడు అర్థ‌మ‌వుతూ ఉంటుంది. తాజాగా అలాంటి ప‌నే చేసింది ఉమ్మ‌డి హైకోర్టు. తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి హోదాలో కేసీఆర్ గ‌తంలో తీసుకున్న నిర్ణ‌యంపై హైకోర్టు షాకింగ్ నిర్ణ‌యం తీసుకుంది. కేసీఆర్ స‌ర్కారు నిర్ణ‌యంపై స్టే విధించింది.

ఈ ఉదంతం కేసీఆర్ కు మాత్ర‌మే కాదు.. ఆయ‌న‌కు అతి స‌న్నిహిత మిత్రుడైన మ‌జ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీకి షాక్ అని చెప్ప‌క త‌ప్ప‌దు. ఓవైసీ ఆసుప‌త్రికి భారీ ఎత్తున భూమిని కేటాయించ‌టంపై హైకోర్టు స్టే విధిస్తూ నిర్ణ‌యాన్ని వెలువ‌రించింది. దీనికి సంబంధించి మ‌ధ్యంత‌ర ఉత్త‌ర్వులు జారీ చేసింది. పూర్తిస్థాయి విచార‌ణ కోసం తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వాన్ని.. ఓవైసీ సోద‌రుల‌కు ఉత్త‌ర్వులు జారీ అయ్యాయి.

హైద‌రాబాద్ బండ్ల‌గూడ‌లో ఉన్న ఓవైసీ ఆసుప‌త్రిలో 6500 గ‌జాల స్థ‌లాన్ని ప్ర‌భుత్వం కేటాయించ‌టాన్ని టౌలీచౌక్ కు చెందిన షేక్ అనీసా అనే మ‌హిళ కోర్టులో కేసు వేశారు. ఆమె వేసిన పిటీష‌న్ పై విచార‌ణ జ‌రిపింది. దాదాపు రూ.40 కోట్లు విలువైన ఈ భూమిని ఓవైసీ సోద‌రుల‌కు కేవ‌లం రూ.3.75 కోట్ల‌కే క‌ట్ట‌బెట్ట‌టాన్ని ఆమె ప్ర‌శ్నిస్తున్నారు.

ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యం కార‌ణంగా ప్ర‌భుత్వానికి భారీ ఎత్తున ఆదాయం పోయింద‌ని.. ప్ర‌జాధ‌నం వృధా అవుతుందంటూ పిటీష‌న్ దారు వాదించారు. ఓవైసీ ఆసుప‌త్రి భూముల హ‌క్కుల‌పై ప్ర‌భుత్వం ఏళ్ల త‌ర‌బ‌డి పోరాటం చేసి మ‌రీ భూములు స్వాధీనం చేసుకున్న వైనాన్ని పిటీష‌న‌ర్ త‌న వాద‌న‌లో వినిపించారు. ఎంతో క‌ష్ట‌ప‌డి స్వాధీనం చేసుకున్న భూమ‌ల్ని.. ముఖ్య‌మంత్రిని అస‌దుద్దీన్‌.. అక్బ‌రుద్దీన్ లు క‌లిసిన వెంట‌నే కేబినెట్ లో అజెండా లేకున్నా.. టేబుల్ ఐటెమ్ కింద పెట్టి ఆమోదం ప‌ల‌క‌టాన్ని త‌ప్పు ప‌ట్టారు.

ఈ ఉదంతంపై పిటీష‌న్ దారు చేసిన వాద‌న‌ల్ని విన్న హైకోర్టు మ‌ధ్యంత‌ర ఉత్త‌ర్వులు జారీ చేసింది. అదే స‌మ‌యంలో ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శికి.. ఓవైసీ సోద‌రుల‌కు.. రెవెన్యూ ముఖ్య కార్య‌ద‌ర్శి.. రంగారెడ్డి జిల్లా క‌లెక్ట‌ర్ తో పాటు.. జీహెచ్ ఎంసీ క‌మిష‌న‌ర్ కు సైతం నోటీసులు జారీ చేసింది. ఈ ఉదంతంపై పూర్తి వివ‌రాలు త‌న‌కు అందించాల‌ని కోర్టు కోరిన‌ట్లుగా చెబుతున్నారు. మ‌రీ ఇష్యూపై ఓవైసీ బ్ర‌ద‌ర్స్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.


Tags:    

Similar News