మ‌నిషిగా చేసిన త‌ప్పే.. చెన్నై వాసి క‌ష్టం

Update: 2015-12-02 13:08 GMT
వీధులు వాగులుగా మారిపోయాయి. లోత‌ట్టు ప్రాంతాలు త‌టాకాల‌య్యాయి. ఎయిర్ పోర్ట్ అయితే చెరువుగా మారిపోయింది. మ‌హా న‌గ‌రంలోని  పెద్ద‌పెద్ద జంక్ష‌న్లు కాస్తా మోకాళ్ల లోతులో వ‌ర్షపు నీరు నిలిబ‌డిపోయాయి. అక్క‌డా.. ఇక్క‌డా అన్న తేడా లేకుండా ఇప్పుడు చెన్నై నీళ్ల‌తో నిండిపోయింది. గ‌త కొద్దిరోజులుగా కురిసిన వ‌ర్షం చేసిన న‌ష్టం ఒక ఎత్తు అయితే.. మంగ‌ళ‌వారం కురిసిన వాన చెన్నైని భారీగా దెబ్బ తీసింది. దాదాపుగా 40 ల‌క్ష‌ల మంది ఇళ్ల‌ల్లో నుంచి బ‌య‌ట‌కు రాలేక‌పోతే.. సుమారు 20ల‌క్ష‌ల‌కు పైగా ఇళ్లు నీళ్లలో మునిగిన ప‌రిస్థితి. ర‌వాణా కోసం ఖాళీ అయిల్ డ్రుమ్ములు.. ప‌డ‌వ‌లు వాడుతున్న దుస్థితి.  ఎందుకిలా జ‌రిగింది? చెన్నై వాసికి ఎందుకింత క‌ష్టం వ‌చ్చి ప‌డింది?అంత పెద్ద మ‌హాన‌గ‌రం నీటి బంధ‌నంలో ఎలా చిక్క‌కుపోయింది? అన్న‌ది ఇప్పుడు పెద్ద ప్ర‌శ్న‌లుగా మారాయి.

ప్ర‌కృతి క‌న్నెర్ర చేయ‌టంతో పాటు.. మ‌నిషి చేసిన ఒకొక్క త‌ప్పు.. ఇప్పుడు మొత్తంగా ఒక్క‌సారిగా త‌మ‌కే చుట్టుకోవ‌టంతో విల‌విల‌లాడే ప‌రిస్థితి. మూడు నెల‌ల పాటు కురిసే వ‌ర్షం కేవ‌లం గంట‌ల వ్య‌వ‌ధిలో కుర‌వ‌టం ఒక ప్ర‌ధాన కార‌ణ‌మైతే.. దేశంలోని వివిధ మ‌హా న‌గ‌రాల్లో ఉన్న‌ట్లే పాల‌కుల నిర్ల‌క్ష్యం.. ప్ర‌జ‌ల బాధ్య‌తారాహిత్యం వెర‌సి.. ఇప్పుడు అంద‌రికి చుట్టుకునే ప‌రిస్థితి. మిగిలిన మ‌హాన‌గ‌రాల్లో మాదిరే చెన్నైలోని డ్రైనేజీ నిర్వ‌హ‌ణ స‌రిగా లేక‌పోవ‌టం.. మురుగునీటి కాల్వ‌ల సిల్ట్ తీయ‌క‌పోవ‌టం.. అక్ర‌మ క‌ట్ట‌డాలు.. నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా చేప‌ట్టిన క‌బ్జాల పుణ్య‌మా అని.. వ‌ర్ష‌పు నీరు త‌న దారిన తాను పోయేందుకు అవకాశం లేకుండా పోవ‌టంతో.. ఇళ్ల‌ల్లోకి.. ఆఫీసుల్లోకి నీళ్లు చొచ్చుకొచ్చే ప‌రిస్థితి.

ఇప్పుడు కురిసినంత‌టి భారీ వ‌ర్షాలు కురిసిన‌ప్పుడు న‌ష్టం తీవ్ర‌త ఎక్కువే ఉంటుంది. దీనికి తోడు పాల‌కుల అవినీతి.. బాధ్య‌తారాహిత్యం పుణ్య‌మా అని వ‌ర్ష‌పు నీరు వెళ్లేందుకు వీల్లేని ప‌రిస్థితులు చోటు చేసుకోవ‌టంతో నీళ్లు ఎక్క‌డిక‌క్క‌డ నిలిచిపోయాయి. చెన్నైలోని బ‌కింగ్ హోం కెనాల్ సంగ‌తే తీసుకోండి. వ‌ర్ష‌పు నీటిని తీసుకెళ్లే ఈ కెనాల్ మొత్తం సిల్ట్ తో నిండిపోవ‌టం.. గ‌త కొద్ది సంవ‌త్స‌రాలుగా దాని పూడికితీత నిర్వ‌హించ‌క‌పోవ‌టం.. దాని ప్ర‌వాహానానికి అడ్డుగా నిర్మాణాలు జ‌ర‌ప‌టంతో భారీగా కురిసిన వ‌ర్షం రోడ్ల మీద‌కు వ‌చ్చేలా చేసింది. జ‌ల ప్ర‌ళ‌యంలో చిక్కుకున్న చెన్నై మ‌హాన‌గ‌రం భ‌యంతో చేస్తున్న ఆర్త‌నాదం మిగిలిన మ‌హాన‌గ‌రాల ప్ర‌జ‌ల‌కు మేలుకొలుపు కావాలి. నిర్ల‌క్ష్యంతో మ‌నిషి చేసే త‌ప్పులు ఎంత‌టి తిప్ప‌లు తెస్తాయ‌న్న విష‌యం ఇప్ప‌టి త‌న్ని(చెన్న‌)పురిని చూస్తే ఇట్టే తెలుస్తుంది.
Tags:    

Similar News