ప్ర‌త్య‌క్ష న‌ర‌కాన్ని చూసిన హైద‌రాబాదీ

Update: 2017-09-30 05:25 GMT
నోరు తెరిస్తే చాలు.. సంప‌న్న‌రాష్ట్రం అంటూ బ‌డాయి క‌బుర్లు చెప్పే ముఖ్య‌మంత్రి కేసీఆర్ క‌నిపిస్తారు. త‌మ పాల‌న ఎంత అద్భుతంగా ఉందో తెలుసా? అంటూ గొప్ప‌లు చెప్పే కేసీఆర్‌.. హైద‌రాబాద్ మ‌హాన‌గ‌రాన్ని విశ్వ‌న‌గ‌రంగా మార్చే స్వ‌ప్నంలో త‌ల‌మున‌క‌లైన‌ట్లుగా చెప్పే కేసీఆర్ కుమారుడు క‌మ్ మంత్రి కేటీఆర్ ల మాట‌ల మాటేమో కానీ.. చినుకు ప‌డితే చాలు హైద‌రాబాదీ జీవితం చిత్త‌డైపోతోంది.

తాజాగా శుక్ర‌వారం కురిసిన కుంభ‌వృష్టి హైద‌రాబాద్ జ‌న‌జీవితాన్ని అత‌లాకుత‌లం చేసి పారేసింది. భారీ వ‌ర్షం ఒక‌ప‌క్క‌.. లోత‌ట్టు ప్రాంతాల మున‌క మ‌రోప‌క్క‌.. ఈ రెండు చాల‌వ‌న్న‌ట్లుగా చోటు చేసుకున్న ట్రాఫిక్ జాం తీవ్ర‌త అంతా ఇంతా కాదు. ప్ర‌ధాన ర‌హ‌దారుల్లో నిలిచిపోయిన వాహ‌నాలు.. గంట‌కు రెండు కిలోమీట‌ర్లు కూడా మించి ముందుకు క‌ద‌ల‌ని ప‌రిస్థితి చోటు చేసుకుంది.

ద‌ట్ట‌మైన క్యుములోనింబ‌స్‌.. నింబో స్ట్రేట‌స్ మేఘాలు భూ ఉప‌రిత‌లానికి కేవ‌లం 0.9 కిలోమీట‌ర్ల  ద‌గ్గ‌ర‌కు రావ‌టంతో హైద‌రాబాద్ మ‌హాన‌గ‌రం సాయంత్రం 4 గంట‌ల ప్రాంతానికే చీక‌టి ప‌ట్టేసింది. ఐదు గంట‌ల ప్రాంతానికి ద‌ట్ట‌మైన కారు మ‌బ్బులు న‌గ‌రం మొత్తాన్ని చుట్టేశాయి. నాలుగు గంట‌ల నుంచి మొద‌లైన వ‌ర్షం ఆరు గంట‌ల వ‌ర‌కూ బాదేసింది. ఆ త‌ర్వాత నుంచి వ‌ర్షం తీవ్ర‌త లేకున్నా.. అంత‌కు ముందు కురిసిన వాన‌తో రోడ్లు మొత్తం జ‌ల‌మ‌యం అయ్యాయి.
ఇక‌.. లోత‌ట్టు ప్రాంతాల గురించి చెప్పాల్సిన అవ‌స‌ర‌మే లేదు. చివ‌ర‌కు సైబ‌రాబాద్ మొత్తం కూడా దారుణ‌మైన ప‌రిస్థితి నెల‌కొంది.

ప్ర‌ధాన ర‌హ‌దారులు మొత్తం ట్రాఫిక్ జాంతో న‌గ‌ర జీవి విల‌విల‌లాడిపోయాడు. టూ వీల‌ర్ కూడా క‌ద‌ప‌లేని స్థితిలో ఉండిపోవ‌టంతో ముందుకు.. వెన‌క్కి వెళ్ల లేక తీవ్ర అవ‌స్థ‌ల‌కు గుర‌య్యారు. ఇక‌.. పండ‌గ నేప‌థ్యంలో ప్ర‌యాణాలు పెట్టుకున్న వారి సంగ‌తి చెప్పాల్సిన అవ‌స‌ర‌మే లేదు. చాలామంది త‌మ బ‌స్సుల్ని.. ట్రైన్ల‌ను మిస్ అయ్యారు. ట్రాఫిక్ చిరాకుతో ముప్పావు గంట‌లో చేరాల్సిన గ‌మ్య‌స్థానం ఏకంగా మూడున్న‌ర గంట‌ల‌కు పైగా సాగి ప్ర‌త్య‌క్ష న‌ర‌కం ఏమిటో అర్థ‌మ‌య్యేలా చేసింది.

హైద‌రాబాద్ ట్రాఫిక్ ఇంత అస్త‌వ్య‌స్తం కావ‌టానికి కార‌ణం గంట‌ల వ్య‌వ‌ధిలో కురిసిన భారీ వ‌ర్షంగా చెబుతున్నారు. వాతావ‌ర‌ణ శాఖ అందిస్తున్న స‌మాచారం ప్ర‌కారం నిన్న సాయంత్రం 4 నుంచి రాత్రి 7 గంట‌ల మ‌ధ్య‌లో మాదాపూర్ ప్రాంతంలో ఏకంగా 8.1 సెంటీమీట‌ర్ల వ‌ర్ష‌పాతం న‌మోదైన‌ట్లుగా చెబుతున్నారు. దీంతో.. భారీగా వ‌ర్షం చేరుకొని రోడ్ల మీద నిలిచిపోయింది.

వ‌ర్ష‌పు నీరు రోడ్ల మీద నిలిచిపోవ‌టంతో వాహ‌నాలు ముందుకు వెళ్ల‌లేని ప‌రిస్థితి. రోడ్లు మొత్తాన్ని వ‌ర్ష‌పు నీరు క‌మ్మేయ‌టంతో ముందు ఏముందో ఎవ‌రికి తెలీని ప‌రిస్థితి. శుక్ర‌వారం సాయంత్రం నుంచి అర్థ‌రాత్రి 12 గంట‌ల వ‌ర‌కూ ట్రాఫిక్ జాం నెల‌కొని న‌గ‌ర జీవికి చుక్క‌లు క‌నిపించేలా చేశాయి. ఈ ప్ర‌త్య‌క్ష న‌ర‌కాన్ని ఫేస్ చేసిన ప్ర‌తిఒక్క‌రి మ‌దిలో ఒక ఆలోచ‌న క‌చ్ఛితంగా వ‌చ్చి ఉంటుంది. త‌మ మాదిరి సీఎం కేసీఆర్‌.. మంత్రి కేటీఆర్‌ ల‌ను కారులో ఎక్కించి ఏ మాదాపూర్ చౌర‌స్తాలోనో.. ఏ కుక‌ట్‌ ప‌ల్లిలోనో.. ఏ దిల్‌ సుఖ్ న‌గ‌ర్ లోనో జ‌ర్నీ చేయించి ఉంటే బాగుండేద‌ని.
Tags:    

Similar News