చెన్నైలో ఇప్పడేం జరుగుతోంది..? 2

Update: 2015-12-06 05:17 GMT
= చెన్నై వరదలకు అందుతున్న సాయం రోజురోజుకీ పెరుగుతోంది. వివిధ సంస్థలు తమ సాయాన్ని ప్రకటిస్తున్నాయి. సినీనటులు పలువురు సాయాన్ని ప్రకటిస్తున్నారు. విజయ్ రూ.5కోట్ల విరాళం ప్రకటించారు. అందరి కంటే వ్యక్తిగత అత్యధిక విరాళంగా చెబుతున్నారు. ప్రఖ్యాత శ్రీలంక క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్ రూ.కోటి విరాళాన్ని ప్రకటించారు. ఆయన భార్యది తమిళనాడు కావటం గమనార్హం. కరూర్ వైశ్యా బ్యాంక్ రూ.2కోట్ల సాయాన్ని ప్రకటించింది. రూ.50లక్షలు ఇస్తామని సింగపూర్ ప్రభుత్వం ప్రకటించింది. ఇఫ్కో ఎరువుల సంస్థ రూ.కోటి సాయాన్ని ప్రకటించారు. వీరు కాక.. పలు ప్రైవేటు సంస్థలు.. స్వచ్ఛంద సంస్థలు తమ సాయాన్ని ప్రకటిస్తున్నాయి. ఆపన్న హస్తం అందించేందుకు ముందుకు వస్తున్నాయి.

= వరద నీరు తగ్గుతున్న ప్రాంతాల్లో కొత్త సమస్యలు షురూ అయ్యాయి. వరద నీరు పోగా.. భారీగా బురద ఇళ్లల్లోతిష్ట వేయటంతో.. వాటిని శుభ్రం చేసుకోవటం తలకు మించిన భారంగా మారింది. ఇంట్లోను ప్రతి వస్తువకు బురద అంటటంతో వాటిని జాగ్రత్తగా తీసుకొని శుభ్రం చేసుకోవటంతోనే చెన్నైవాసులకు పెద్ద పనిగా మారి.. రోజులు గడిచిపోతున్నాయి.

= పారిశుద్ధ్యం పరిస్థితిపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఏ మాత్రం తేడా వచ్చినా పెద్ద ఎత్తున అంటువ్యాధులు సోకే ప్రమాదం ఉందన్న హెచ్చరికలు పెరుగుతున్నాయి. పారిశుద్ధ్య పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున చర్యలు చేపట్టింది.

= తెలుగు వారు నివసిస్తున్న ప్రాంతాల్లో పరిస్థితి దయనీయంగా మారింది. ఇక్కడ వ్యాధులు విబృంభిస్తున్నాయి. పలువురు జ్వరంతో బాధ పడుతున్నారు. వారికి వైద్య సాయం కోసం ఎదురుచూస్తున్నారు.

= ఆకలి కేకలతో దద్దరిల్లుతున్న చెన్నై మహానగరానికి ఇప్పుడు అత్యంత ముఖ్యమైన అవసరం వైద్య నిపుణులు.. పారా మెడికల్ సిబ్బంది సాయమని చెబుతున్నారు. లక్షలాది మంది రోజుల తరబడి నీళ్లల్లో నానుతున్న వేళ.. బురదతో గడుపుతున్న సమయంలో వ్యాధులు విజృంభిస్తాయని.. వారికి సాయం అవసరమని చెబుతున్నారు. భారీ ఎత్తున వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలన్న డిమాండ్ పెరుగుతోంది.

= శనివారం వర్షం లేకపోవటంతో చెన్నై ప్రజలంతా ఊపిరి పీల్చుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితే మరో నాలుగైదు రోజులు సాగితే అంతా సెట్ అయిపోతుందన్న భావన వ్యక్తమవుతోంది.

= చెన్నైతో పాటు.. తమిళ ప్రజలందరికి ఇప్పుడు ప్రధమ శత్రువు ఎవరో తెలుసా.. వానే. వాన అంటే చాలా ఉలిక్కిపడటమే కాదు.. మండిపడుతున్నారు. తమ బతుకుల్లో ఇంతటి కష్టం నింపిన వానంటే వారు విపరీతంగా అసహ్యించుకోవటమే కాదు.. అంతే స్థాయిలో హడలిపోతున్నారు. నెల రోజులుగా కురుస్తున్న వానతో.. వాన వద్దంటే.. వద్దని కోరుకుంటున్నారు.

= వరద పోటు ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతూ.. జనజీవితం ఇప్పుడిప్పుడే కుదుటుపడుతున్న వేళ.. బ్యాంకులు ఆదివారం పని చేయాలని నిర్ణయించారు. డబ్బుల కోసం ప్రజలు విపరీతమైన డిమాండ్ పెరిగిపోవటంతో.. ఆ రద్దీని తగ్గించేందుకు బ్యాంకులు ఆదివారం పని చేయాలని నిర్ణయించారు.

= మిగిలిన వారి కష్టం ఒకలా ఉంటే.. ప్రభుత్వ ఉద్యోగులు.. సేవా సంస్థల్లో పని చేసే ఉద్యోగులు.. వ్యాపారస్తుల కష్టం మరోలా ఉంది. ఒకవైపు తమ విధి నిర్వహణతో పాటు.. మరోవైపు తమ ఇంటికి జరిగిన నష్టాన్ని.. కష్టాన్ని తీర్చుకోవటం కోసం వారు కిందామీదా పడుతున్నారు. అందరూ వస్తు సేవల కోసం ఆరాటపడుతున్న వేళ.. ఇంట్లో కష్టాన్ని వదిలి మరీ.. తమ విధి నిర్వహణతో నిమగ్నమవుతున్నారు. దీంతో.. వారి ఇళ్ల దగ్గర తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

= సహాయ పునరావాస కార్యక్రమాలు జోరుగా సాగుతున్న తమిళనాడులో ఇప్పటివరకూ 11 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించి.. వారికి పునరావాసం కల్పిస్తున్నారు. ఒక్క చెన్నైలోనే ఇలాంటి వారి సంఖ్య 1.75లక్షలు ఉండటం గమనార్హం.
Tags:    

Similar News