హైదరాబాద్ మేఘం ఏపీకి వెళ్లిందా?

Update: 2016-09-22 10:03 GMT
సరిగ్గా రెండు రోజలు క్రితం హైదరాబాద్ తాట తీసిన వాన.. ఇప్పుడు ఏపీకి ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. మంగళవారం రాత్రి ఎనిమిది గంటలకు మొదలైన వర్షం నాన్ స్టాప్ గా బుధవారం ఉదయం వరకు కురవటం.. గడిచిన వందేళ్ల చరిత్రలో రెండో అతి పెద్ద వర్షపాతంగా నమోదు కావటం తెలిసిందే. ఈ భారీ వర్షానికి కారణంగా దట్టమైన క్యుములోనింబస్ మేఘంగా చెప్పాలి. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా మారి బలపడటం.. నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నవేళ.. రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు భారీగా పడుతున్న పరిస్థితి.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. మొన్న హైదరాబాద్ లో కురిసిన భారీ వర్షానికి(ఆరేడు గంటల వ్యవధిలో 16 సెంటీమీటర్లకు పైనే) కారణమైన దట్టమైన క్యుములోనింబస్ మేఘం అలా ప్రయాణిస్తూ..ఏపీ మొత్తాన్ని విస్తరించిందా? అన్న సందేహం కలిగే పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఎందుకంటే.. అటు రాయలసీమలోని కర్ను.. ఇటు కోస్తాలోని గుంటూరు.. కృష్ణా.. ప్రకాశం.. ఉభయ గోదావరి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలు భారీగా వర్షాలు కురుస్తున్నాయి.

మరి ముఖ్యంగా గుంటూరు జిల్లాలోని పల్పాడు ప్రాంతంలోని పిడుగురాళ్ల.. సత్తెనపల్లి.. మాచర్ల.. తదితర ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షం తీవ్రత ఎంత ఎక్కువగా ఉందంటే.. రైళ్ల రాకపోకలకు తీవ్ర విఘాతం కలిగించేలా మారింది. సికింద్రాబాద్ – గుంటూరు మధ్య నడిచే పలు రైళ్లను భారీ వర్షాల కారణంగా నిలిపివేశారు. రైళ్ల పట్టాల మీదకు భారీగా వర్షపు నీరు చేరటంతో.. రైళ్ల రాకపోకలకు తీవ్రఅంతరాయం చోటు చేసుకుంది. ఇక.. వాగులు.. వంకలు పొంగిపొర్లుతుండటంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. గంటల వ్యవధిలో సత్తెనపల్లి పట్టణంలో 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు చెబుతున్నారు. నరసరావుపేటలోనే భారీ వర్షాలు కురుస్తున్నాయి. పెద్ద ఎత్తున కురుస్తున్న వర్షంతో వందలాది మందిని ముందస్తు జాగ్రత్తగా సురక్షిత ప్రాంతాలకు తరలించారు.  నిజానికి.. బుధవారం.. గురువారం హైదరాబాద్ మహా నగరంలో భారీ వర్షాలకు అవకాశం ఉందన్న వార్తలు వచ్చాయి. అదృష్టవశాత్తు బుదవారం చిరు జల్లులు తప్పించి పెద్దగా వర్షం కురవలేదు. గురువారం ఇప్పటివరకూ (మధ్యాహ్నా సమయానికి) వర్షపు జాడ లేదు. ఇదంతా చూస్తే.. హైదరాబాద్ ను ముంచెత్తిన వాన మేఘం.. ఏపీకి వెళ్లి దంచికొడుతుందన్న భావన కలగటం ఖాయం.
Tags:    

Similar News