రూ.లక్ష కోట్ల దళిత బంధు వేళ కేసీఆర్ కు శీలపరీక్ష అలా పెట్టాలట

Update: 2021-07-25 11:30 GMT
ఈ మధ్యన సోషల్ మీడియాకు.. యూట్యూబ్ చానళ్లకు.. వాట్సాప్ పోస్టులకు బొత్తిగా భయం.. భక్తి లేకుండా పోతోంది. గతంలో మీడియా మాత్రమే ఉండేది. అందులో సెన్సార్ చేసిన వార్తలో.. లేదంటే నిజం చెప్పకుంటే జనాలు ఎక్కడ తిట్టిపోస్తారన్న భయమో.. లేదంటే బాధ్యతగా ఫీల్ కావటమో కానీ జరిగిన విషయాల్ని తమ విచక్షణతో పాటు.. తాము పని చేసే సంస్థల లైన్ కు ఏ మాత్రం ఇబ్బంది కలగకుండా జాగ్రత్తలు తీసుకోవటం కనిపిస్తుంది. ఎప్పుడైతే సోషల్ మీడియా ఎంట్రీ ఇచ్చి.. విశ్వవ్యాప్తం అయ్యిందో.. ఎక్కడో ఒక మూలన కూర్చునే బుజ్జిగాడు సైతం తన మనసులోని మాటను ప్రపంచానికి చెప్పేయటమే కాదు.. తన రాతతోనో.. మాటతోనో పలువురిని ప్రభావితం చేయటం డిజిటల్ విప్లవంతో సాధ్యమైందని చెప్పాలి.

ఎంత చెట్టుకు అంత గాలి అన్నట్లుగా.. ఎంతటోడికైనా ఏదో ఒక కష్టం.. నష్టం మామూలే. సామాన్యులకు ఎలా అయితే సమస్యలు ఉంటాయో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఇప్పుడో కష్టం వచ్చి పడింది. తాను టార్గెట్ చేసి.. పార్టీ నుంచి వెళ్లేలా చేసిన ఈటల రాజేందర్ పొలిటికల్ జీవితానికి షాకింగ్ చెక్ పెట్టాలని తపిస్తున్నారు. ఇందుకోసం ఆయన వేస్తున్న ఎత్తులు అన్ని ఇన్ని కావు. మొన్నటివరకు ఆంధ్రా ప్రాంత పాలకుల్ని తిట్టేందుకు.. వారిపై విరుచుకుపడటం కోసం ఈటల రాజేందర్ ను అస్త్రంగా వినియోగించే వారు. ఈ సందర్భంగా ఆయన కమిట్ మెంట్ ను అదే పనిగా పొగిడేవారు.

తెలంగాణ సాధన కోసం ఈటల పడిన కష్టాన్ని.. ఇప్పుడు తిట్టిపోస్తున్న కేసీఆర్ పదే పదే ప్రస్తావించేవారు. పొగడ్తలతో ముంచెత్తేవారు. అలాంటి ఈటలను ఎట్టి పరిస్థితుల్లోనూ హూజూర్ నగర్ లో ఓడించాలన్న పట్టుదలతో ఉన్నారు. ఇందుకోసం ఆయన వేస్తున్న ఎత్తులు.. చేస్తున్న కసరత్తు అంతా ఇంతా కాదు. ఉప ఎన్నికలు ఏవైనా సరే.. అందులో విజయం తనదే అన్నట్లుగా వ్యవహరించే కేసీఆర్ కు.. దుబ్బాక ఇచ్చిన షాక్ అంతా ఇంతా కాదు. తన అడ్డా లాంటి  దుబ్బాకలో గులాబీ కారు ఓటమి చెందటంతో ఆయన ఇప్పుడు మరింత అలెర్టుగా ఉంటున్నారు. ఈ జాగ్రత్తే ఇటీవల ముగిసిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గులాబీ జెండా రెపరెపలాడేలా చేసింది.

మాస్టర్ మైండ్ కేసీఆర్ ఇప్పుడు హూజూర్ నగర్ టార్గెట్ చేసి.. దాన్ని తన సొంతం చేసుకోవటం కోసం దళిత బంధు పథకాన్ని తెర మీదకు తీసుకొచ్చారన్నది వాస్తవం. ఈ విషయాన్ని ఆయన దాచుకోకుండా ఈ మధ్యన తాను పాల్గొంటున్న ప్రతి సభలోనూ నర్మగర్భంగా ప్రస్తావిస్తున్నారు. ఈ మధ్యన ఏమనుకున్నారో కానీ.. నేరుగానే దాన్ని ప్రస్తావిస్తూ.. అక్కడి దళితుల నోళ్లు ఊరేలా ఆయన మాటలు ఉంటున్నాయి. దీంతో.. కేసీఆర్ కు నిజంగానే దళితుల మీద ఉన్న ప్రేమాభిమానులు ఏ స్థాయివన్న విషయాన్ని తెలుసుకోవటానికి సోషల్ మీడియాలో ఇప్పుడో చిత్రమైన వాదాన్ని తెర మీదకు తీసుకొచ్చారు.

తెలంగాణ సాధనలో కీలకభూమిక పోషించిన కేసీఆర్ కమిట్ మెంట్ ను తాము శంకించటం లేదని.. తాజాగా ఆయన దళిత పక్షపాతిగా మారి.. లక్ష కోట్ల బడ్జెట్ కు సైతం సై అంటున్నవేళ.. ఆయన కమిట్ మెంట్ కు అసలుసిసలు పరీక్ష ఒకటి పెట్టాలన్న మాట వినిపిస్తోంది. దళిత బంధు పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని నిర్ణయించిన తర్వాత.. బోడి హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో గెలవాల్సిన అసవరం లేదు కదా?అని ప్రశ్నిస్తున్నారు. కేసీఆర్ లోని దళిత బంధు మీద ఆయనకున్న కమిట్ మెంట్ లోకానికి అర్థమయ్యేలా చేసేందుకైనా సరే.. ఆయన పార్టీని అక్కడ ఓడించాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు.

ఎందుకంటే.. హూజూర్ నగరంలో టీఆర్ఎస్ గెలిస్తే.. అదంతా దళిత బంధు ఖాతాలోకి వెళ్లిపోతుంది. దళితుల మీద ప్రేమాభిమానాలు ఉన్న కేసీఆర్ లాంటి మహానేతకు దక్కాల్సిన ఇమేజ్ దక్కదు. అదే.. హూజూర్ నగర్ లో టీఆర్ఎస్ ఓడిపోతే.. ఆ ఉప ఎన్నికతో సంబంధం లేకుండా దళితుల శ్రేయస్సు కోసం.. వారి సంక్షేమం కోసం దళిత బంధు పథకాన్నికేసీఆర్ కంటిన్యూ చేస్తారు. అలాంటి వేళ వచ్చే మైలేజీ మరింత భారీగా ఉంటుంది. అందుకే.. హూజూర్ నగర్ లో కేసీఆర్ ను ఓడించటం ద్వారా ఆయనకు శీల పరీక్ష పెట్టాల్సిందే అన్న మాట వినిపిస్తోంది. శుభమా అని భారీ పథకాన్ని ఘనంగా షురూ చేస్తున్న వేళ.. అందుకు భిన్నంగా ఓడించాలన్న దరిద్రపుగొట్టు మాటలు అనటానికి ఎంత గుండె ధైర్యం? కాదంటారా?
Tags:    

Similar News