ఇచ్చట కరోనా నెగటివ్ సర్టిఫికెట్ అమ్మబడును ... అసలు కథ ఏమిటంటే!

Update: 2021-04-21 11:57 GMT
కరోనా సెకండ్ వేవ్ తో  దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రజలు హడలిపోతున్న విషయం తెలిసిందే. కరోనా వైరస్ మహమ్మారిని అరికట్టడానికి కేంద్ర ప్రభుత్వం, దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు తీరిక అనేది లేకుండా పని చేస్తున్నారు. ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి వెళ్లే ప్రజలకు ఇప్పుడు కోవిడ్ నెగటివ్ సర్టిఫికెట్ తప్పనిసరి అయ్యింది.  ఏ రాష్ట్రం నుంచి ప్రజలు బయటకు వెలుతున్నారో ఆ రాష్ట్ర ప్రభుత్వం, ఆరోగ్య శాఖ అధికారుల దగ్గర కోవిడ్ నెగటివ్ సర్టిఫికెట్ తీసుకుని మా రాష్ట్రంలోకి అడుగుపెట్టాలని కొన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశాయి.

ప్రభుత్వాలు, ఆరోగ్య శాఖ అధికారుల దగ్గర కోవిడ్ నెగటివ్ సర్టిఫికెట్ తీసుకోవాలంటే కచ్చితంగా ఆరోగ్య పరీక్షలు చేయించుకుని ఆ ఫలితాలు వచ్చే వరకు వేచి చూడాలి. కర్ణాటకలోని విజయనగరం జిల్లా హోస్ పేట్ నుంచి ఇతర రాష్ట్రాలకు వెళ్లడానికి వేలాది మంది సిద్దం అయ్యారు. ఇతర రాష్ట్రాలకు వెలుతున్న ప్రజల సొమ్ము లూటీ చెయ్యడానికి హోస్ పేట్ లోని ఓ జిరాక్స్ షాప్ నిర్వహకుడు కరోనా కాలంలో ఘరానా స్కెచ్ వేశాడు. హోస్ పేట్ లోని శివరాజ్ జిరాక్స్ సెంటర్ నిర్వహకుడు శివరాజ్ అమాయకులైన ప్రజలను అడ్డం పెట్టుకుని కోవిడ్ నెగటివ్ సర్టిఫికెట్లు విచ్చలవిడిగా విక్రయించాడు.

కర్ణాటక ప్రభుత్వం జారీ చేసిన ఓ కోవిడ్ నెగటివ్ సర్టిఫికెట్ శివరాజ్ చేతికి చిక్కింది. అంతే ఆ సర్టిఫికెట్ లోని పేర్లు, చిరునామాలు, గుర్తింపు కార్డులు మార్చేసి ఆ సర్టిఫకెట్ లు జిరాక్స్ చేసి వాటిని అమాయకులైన ప్రజల ఫోటోలు, అడ్రస్ లు, ఐడీ కార్డులు అతికించి వాటిని విక్రయించాడు. శివరాజ్ జిరాక్స్ సెంటర్ లో అప్పనంగా ఇస్తున్న కోవిడ్ నెగటివ్ సర్టిఫికెట్లు తీసుకుంటున్న కొందరు ప్రజలు, కాలేజ్ విద్యార్థులు వారివారి సొంత ప్రాంతాలకు బయలుదేరి వెళ్లిపోతున్నారు. విషయం తెలుసుకున్న హోస్ పేట్ టీహెచ్ఓ డాక్టర్ భాస్కర్ హోస్ పేట్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. కచ్చితమైన ఆధారాలతో కేసు నమోదు చేసిన పోలీసులు నకిలి కోవిడ్ నెగటివ్ సర్టిఫికెట్లు ఇస్తున్న జిరాక్స్ షాప్ యజమాని శివరాజ్ ను అరెస్టు చేసి కోర్టు ముందు హాజరుపరిచి రిమాండ్ కి తరలించి , ఇప్పటివరకు ఎంతమందికి ఇచ్చాడు , వారు ఎవరు అనే విషయాలపై విచారణ చేస్తున్నారు.
Tags:    

Similar News