ఏపీకి ప‌ట్టిన ద‌రిద్రం అంటూ క‌డిగేశాడు

Update: 2018-03-01 10:11 GMT
ఏపీకి ప్ర‌త్యేక హోదా అంశంపై గ‌ళం విప్పి.. ఏపీ బాగుప‌డాలంటే హోదాకు మించింది మ‌రింకేమీ లేద‌ని తేల్చిన వారిలో సినీ న‌టుడు శివాజీ ఒక‌రు. విభ‌జ‌న‌కు ముందు వ‌ర‌కు సాఫ్ట్ గా.. ఎంపిక చేసిన కొన్ని సామాజిక అంశాల మీద మాట్లాడిన ఆయ‌న త‌ర్వాతి కాలంలో ఏపీకి ప్ర‌త్యేక హోదా మీద పెద్ద ఎత్తున వాయిస్ వినిపించారు.

నిరాహార‌దీక్ష‌లు.. ఆందోళ‌న‌లు వ‌గైరా.. వ‌గైరా చేసి.. ఎంత‌కూ స్పంద‌న రాక‌పోవ‌టం.. ఏపీ అధికార‌ప‌క్షం ఆగ్ర‌హానికి గురైన నేప‌థ్యంలో కామ్ అయిన శివాజీ ఇన్నాళ్ల త‌ర్వాత మ‌ళ్లీ వాయిస్ వినిపించారు.

తాజాగా గుంటూరులో నిర్వ‌హించిన ప్ర‌త్యేక హోదా.. విభ‌జ‌న హామీల సాధ‌నా స‌మితి నేతృత్వంలో జ‌రిగిన స‌ద‌స్సుకు హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడిన శివాజీ.. రెండు తెలుగు రాష్ట్రాల‌కు గ‌వ‌ర్న‌ర్ గా వ్య‌వ‌హ‌రిస్తున్న న‌ర‌సింహ‌న్ ను తీవ్ర‌స్థాయిలో దునుమాడారు. ఏపీకి ప‌ట్టిన పెద్ద ద‌రిద్రంగా న‌ర‌సింహ‌న్‌ను అభివ‌ర్ణించారు. బాధ్య‌తాయుత‌మైన ప‌ద‌విలో ఉండి కూడా గ‌వ‌ర్న‌ర్ రాజ‌కీయాలు చేస్తున్నార‌న్న ఆయ‌న‌.. ఎంపీలంతా పోరాడాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. పార్ల‌మెంటు జ‌ర‌గ‌కుండా చేస్తే స‌గం విజ‌యం సాధించిన‌ట్లేన‌న్న ఆయ‌న‌.. ఎంపీలు త‌మ స్వార్థం కోసం నాట‌కాలు ఆడుతున్నార‌ని ఆరోపించారు.

రాష్ట్రాన్ని తాక‌ట్టు పెట్టిన వెంక‌య్య ఉప‌రాష్ట్రప‌తి అయ్యార‌ని.. మ‌న రాష్ట్రం గురించి ఏం అడిగినా ఆయ‌న‌కు కోపం వ‌స్తుంద‌ని మండిప‌డ్డారు. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వ‌చ్చిన‌ప్ప‌టికీ.. ప్ర‌త్యేక హోదా ఇవ్వ‌ని ప‌క్షంలో ఎవ‌రూ ఏమీ చేయ‌లేర‌న్నారు. గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్ పై తీవ్ర‌స్థాయిలో ధ్వ‌జ‌మెత్తిన శివాజీ తీరు చూస్తే.. మ‌ళ్లీ బ్యాక్ టు ఫైట్ అన్న‌ట్లుగా ఉంది. రానున్న రోజుల్లో మ‌రెన్ని ఘాటు వ్యాఖ్య‌లు చేస్తారో చూడాలి.
Tags:    

Similar News