ఆన్‌ లైన్ క్లాస్‌ ల‌పై ఏపీ హైకోర్టు ఆగ్ర‌హం: ‌ఏపీ స‌ర్కార్‌ పై మండిపాటు

Update: 2020-07-03 16:23 GMT
తాజాగా మ‌రో అంశంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వానికి షాక్ త‌గిలిన‌ట్ట‌య్యింది. ఆన్‌లైన్ క్లాసుల నిర్వహణపై హైకోర్టు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. ఆన్‌ లైన్ క్లాస్‌ ల నిర్వ‌హ‌ణ‌పై ప్ర‌శ్న‌లు సంధించింది. ఈ మేర‌కు ఏపీ ప్ర‌భుత్వానికి కొన్ని ఆదేశాలు జారీ చేసింది. ఆన్‌ లైన్ క్లాస్‌ ల నిర్వ‌హ‌ణ‌పై దాఖ‌లైన పిటిషన్‌ పై హైకోర్టు శుక్రవారం విచారణ చేపట్టింది. విద్యా సంవత్సరం ప్రారంభించలేదని..  మంత్రివ‌ర్గ‌ భేటీలో తుది నిర్ణయం తీసుకుంటార‌ని అడ్వకేట్ జనరల్ న్యాయ‌స్థానానికి తెలిపారు. దీనికి స్పందించిన ధ‌ర్మాస‌నం ఇంకా నిర్ణయం తీసుకోనప్పుడు ఆన్‌ లైన్ క్లాసెస్ ఎందుకు నిర్వహిస్తున్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఆర్థికంగా వెనుకబడిన వారు ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఎలాంటి న్యాయం జరుగుతుందని వ్యాఖ్యానించింది. దీనిపై లిఖితపూర్వకంగా ఈనెల 13వ తేదీన నిర్ధిష్ట ప్రణాళిక సమర్పించాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది.

ఆన్‌ లైన్ క్లాస్ పిటీషన్‌ లో (ఇస్మా) ఇండిపెండెంట్ స్కూల్ మేనేజ్ మెంట్ అసోసియేషన్ ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేసింది. సీబీఎస్సీ మార్గదర్శకాలకు అనుగుణంగా రెండు నెలల కింద‌టే విద్యా సంవత్సరం ప్రారంభించామని ఇస్మా తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఆన్‌ లైన్ క్లాసుల వలన తల్లిదండ్రులపై ఎలాంటి ఒత్తిడి లేదని ఈ సంద‌ర్భంగా కోర్టుకు వివరించారు. ఆన్‌ లైన్ క్లాసులు తల్లిదండ్రులకు ఆప్షన్ మాత్రమేనని తెలిపారు. సీబీఎస్‌ సీపై రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి నియంత్రణ లేదని స్ప‌ష్టం చేశారు. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలంటూ ఇస్మాకు హైకోర్టు అదేశాలు జారీ చేసింది. దీనిపై తదుపరి విచారణను ఈ నెల 13వ తేదీకి న్యాయ‌స్థానం వాయిదా వేసింది.

ఆన్ లైన్ తరగతులపై కేబినెట్ సబ్ కమిటీ పరిశీలిస్తోందని - కేంద్ర ఆదేశాల ప్ర‌కారం ఈ నెల తర్వాతే విద్యా సంవత్సరంపై నిర్ణయం తీసుకుంటామని ప్ర‌భుత్వం హైకోర్టుకు తెలిపింది. విద్యా సంవత్సరం మొదలు కాకముందే ఆన్‌ లైన్ తరగతులను ఎలా అనుమతిస్తున్నారని ధ‌ర్మాస‌నం ప్రశ్నించింది. ఆన్‌ లైన్ తరగతులకు అనుమతి ఇవ్వలేమని ఈ సంద‌ర్భంగా స్ప‌ష్టం చేసింది. మహారాష్ట్ర మాదిరిగా స్పష్టమైన నిర్ణయం ఎందుకు తీసుకోరని పేర్కొంది. ఆన్‌లైన్ త‌ర‌గతులు నిర్వ‌హిస్తే ఒక్కో ఇంట్లో రెండు మూడు ల్యాప్ టాప్‌లు కొనే పరిస్థితి ఉందా అని ప్ర‌భుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. ఢిల్లీలో ఏసీ గదుల్లో కూర్చుని నిర్ణయాలు తీసుకోవద్దని ఘాటుగా హెచ్చ‌రించింది. గిరిజన, ఏజెన్సీ ప్రాంతాల్లోని విద్యార్థులను కూడా దృష్టిలో ఉంచుకోవాలని సూచించింది. దీనిపై కేంద్ర ప్రభుత్వం, సీబీఎస్ఈ, ఎన్సిటీఈని ప్రతివాదులుగా చేర్చాలని పిటిషనర్‌ను హైకోర్టు ఆదేశించింది. కేంద్రం, సీబీఎస్ఈ వాదనలు కూడా వింటామని ధ‌ర్మాస‌నం తెలిపింది.

Tags:    

Similar News