టీ స‌ర్కారు మైండ్ బ్లాంక‌య్యేలా కోర్టు ఫైర్‌

Update: 2018-08-14 16:56 GMT
గులాబీ ద‌ళ‌ప‌తి కేసీఆర్ సార‌థ్యంలో హైకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి చుక్కెదురైంది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి - సంపత్ కుమార్ ల కోర్టు ధిక్కరణ పిటిషన్‌ పై హైకోర్టు మరోమారు ఆగ్రహం వ్యక్తం చేసింది. తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తూ కోర్టు ధిక్కరణగా పరిగణించిన న్యాయస్థానం, రాష్ట్ర న్యాయశాఖ కార్యదర్శికి - అసెంబ్లీ సెక్రటరీకి ఫామ్ 1 నోటీసులు జారీ చేసింది. సెప్టెంబర్ 17న కోర్టుకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ స్పీకర్‌ కు హైకోర్టు షోకాజ్ నోటీసులు జారీ చేసింది.

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా శాసనమండలి ఛైర్మెన్ స్వామిగౌడ్‌ పై హెడ్‌ పోన్ విసిరిన విషయమై కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి - సంపత్‌ కుమార్ ఎమ్మెల్యేల సభ్యత్వాలను రద్దు చేశారు. తమ సభ్యత్వాలను రద్దు చేయడాన్ని నిరసిస్తూ తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి - సంపత్‌ కుమార్‌ లు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో హైకోర్టు ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు అనుకూలంగా తీర్పు వెలువరించింది.వెంటనే ఈ ఇద్దరు ఎమ్మెల్యేలుగా కొనసాగుతారని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ ఆదేశాలను అమలు చేయలేదు. మరో వైపు ఈ తీర్పును సవాల్ చేస్తూ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడ హైకోర్టు డివిజన్ బెంచ్ ను ఆశ్రయించారు. హైకోర్టు డివిజన్ బెంచ్ కూడ ఈ తీర్పును కొట్టివేసింది. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి - సంపత్‌ కుమార్‌ లకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును కూడా  ప్రభుత్వం అమలు చేయలేదు. ఈ తీర్పును అమలు చేయకపోవడంతో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కోర్టు ధిక్కరణ పిటిషన్ ను దాఖలు చేశారు.ఈ పిటిషన్‌ పై మంగ‌ళ‌వారం నాడు హైకోర్టులో విచారణ జరిగింది.

ఎమ్మెల్యేలకు గన్ మెన్ లను కేటాయించని కారణంగా తెలంగాణ డీజీపీకి - జోగులంబా జిల్లా ఎస్పీ - నల్గొండ ఎస్పీ సుమోటోగా తీసుకొని  హైకోర్టు షోకాజ్  నోటీసులు జారీ చేసింది. సెప్టెంబర్ 17న అసెంబ్లీ సెక్రెటరీ వి.నరసింహ చార్యులు - అసెంబ్లీ లా సెక్రెటరీ  నిరంజన్ రావ్ ఇద్దరు నేరుగా కోర్టు హాజరు కావాలని హైకోర్టు ఆదేశించింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేల జీతాలకు సంబంధించిన వివరాలు అసెంబ్లీ రిజిస్టర్ కోర్టుకు సమర్పించాలని హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. కోర్టు ఆదేశాలు ఎవరు దిక్కరించినా శిక్షార్హులేన‌న‌ని హైకోర్టు తేల్చిచెప్పింది. షోకాజ్ నోటీసు ఇస్తూ ఈ నెల 28కి వాయిదావేసింది.


Tags:    

Similar News