చింతామ‌ణి నాట‌కంపై నిషేధానికి హైకోర్టు నో

Update: 2022-06-24 12:02 GMT
ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో చింతామణి నాటకాన్ని ప్ర‌ద‌ర్శించ‌కుండా నిషేధించాల‌ని వైశ్యులు గ‌తంలో ఆందోళ‌న‌లు చేశారు. ఈ నేప‌థ్యంలో వైఎస్సార్సీపీ వైశ్యుల అభ్యంత‌రాల‌ను దృష్టిలో పెట్టుకుని ఈ నాట‌కాన్ని నిషేధించింది. ఎక్క‌డా ఈ నాట‌కాన్ని ప్ర‌ద‌ర్శించ‌వ‌ద్ద‌ని ఆదేశించింది. ఈ నాట‌కంలో వైశ్యుల మ‌నోభావాల‌ను దెబ్బ‌తీసే స‌న్నివేశాలు, సంభాష‌ణ‌లు ఉన్నందువ‌ల్ల దీన్ని నిషేధిస్తున్నామ‌ని పేర్కొంది. దీంతో వైఎస్సార్సీపీ స‌ర్కార్ నిర్ణ‌యాన్ని వ్య‌తిరేకిస్తూ హైకోర్టులో ప‌లు పిటిషన్లు దాఖలయ్యాయి.

ఈ క్ర‌మంలో న‌ర‌సాపురం వైఎస్సార్సీపీ రెబ‌ల్ ఎంపీ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు కూడా ప్ర‌భుత్వ నిర్ణ‌యానికి వ్య‌తిరేకంగా హైకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేశారు. నాటకాన్ని నిషేదిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై స్టే ఇవ్వాలని రఘురామకృష్ణ రాజు పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు చింతామణి నాటక నిషేదంపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది.

రఘురామకృష్ణ రాజు తరపు న్యాయవాది అభ్యర్థనను తోసిపుచ్చింది. మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి హైకోర్టు ధర్మాసనం అంగీకరించలేదు. అయితే, నాటకానికి సంబంధించిన అసలు పుస్తకం అనువాద‌ వెర్షన్ ను సమర్పించాల్సిందిగా ఆదేశించింది. కేసు తదుపరి విచారణను ఆగస్టు 17కు వాయిదా వేసింది.  

చింతామణి నాటకం నిషేధంపై రఘురామకృష్ణంరాజు దాఖలు చేసిన పిటిషన్ లో ఆయన తరపున సీనియ‌ర్ న్యాయవాది ఉమేష్ వాదనలు వినిపించారు. చింతామణి నాటకాన్ని నిషేధించడం వాక్ స్వాతంత్రాన్ని హరించడమేనని ధర్మాసనం ముందు ఉమేష్ గ‌ట్టిగా వాదించారు.

చింతామ‌ణి నాటకాన్ని నిషేధించ‌డంతో పలువురు త‌మ జీవనోపాధిని కోల్పోయారని తెలిపారు. దేవదాసి చట్టానికి వ్యతిరేకంగా చింతామ‌ణి నాటకం వచ్చిందన్నారు. ఈ నేప‌థ్యంలో నాటకాన్ని నిషేధించాల్సిన అవసరంలేదని కోర్టుకు తెలిపారు.

నాటకాన్ని నిషేధిస్తూ జ‌గ‌న్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై స్టే ఇవ్వాల్సిందిగా విన్న‌వించారు. అయితే ఆయ‌న‌ అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది. అలాగే మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వటానికి కూడా అంగీకరించలేదు.
Tags:    

Similar News