రోహిత్ కేసు గురించి హైకోర్టు చేసిన వ్యాఖ్యలు?

Update: 2016-04-06 09:34 GMT
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన హెచ్ సీయూ విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్యకు సంబంధించి కేసు విచారణ తాజాగా హైకోర్టు ఎదుట వచ్చింది. ఈ సందర్భంగా ఈ కేసును విచారించిన కోర్టు చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా ఉన్నాయి. కేసు వేసిన పిటీషనర్ వాదన ప్రకారం.. వర్సిటీ వీసీ అప్పారావును రోహిత్ ఆత్మహత్య కేసులో ఏ1 గా చేర్చాలన్న వాదనపై హైకోర్టు సూటి ప్రశ్నలు వేసింది.

అసలు ఏ విధంగా వీసీ ఏ1 అవుతారో చెప్పాలని ప్రశ్నించింది. మనోభావాల ప్రకారం విచారణ జరపలేమని స్పష్టం చేయటంతో పాటు.. నిబంధనల ప్రకారం వీసీని ఏ విధంగా తొలగించాలో చెప్పాలంటూ పిటీషనర్ వాదనను తీవ్రంగా తప్పు పట్టింది.  అంతేకాదు.. ఈ వ్యవహారంపై పూర్తిగా అధ్యయనం చేసిన తర్వాత సోమవారం కోర్టుకు రావాలంటూ ఈ కేసు విచారణను వాయిదా వేసింది.

రోహిత్ వేముల ఆత్మహత్య నేపథ్యంలో.. అతడి ఆత్మహత్యకు వీసీ.. కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయలు కారణమని.. వారిని ఆయా పదవుల నుంచి తొలిగించాలని కోరుతూ కాంగ్రెస్ స్టాండింగ్ కౌన్సిల్ సభ్యుడు దామోదర్ రెడ్డి వాజ్యం దాఖలు చేశారు. ఈ కేసుపై తాజాగా హైకోర్టు చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో తదుపరి విచారణ ఎలా ఉంటుందన్న ఉత్కంఠ వ్యక్తమవుతోంది.
Tags:    

Similar News