చారిత్రిక భవనమైతే సారుకు షాకే

Update: 2015-04-13 17:32 GMT
ఛాతీ ఆసుపత్రి విషయంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి షాక్‌ తగలనుందా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఛాతీఆసుపత్రిని తరలించి.. అందులో తెలంగాణ సెక్రటేరియట్‌ను నభూతో నభవిష్యతి అన్న చందంగా నిర్మించాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెగ ఆసక్తిని ప్రదర్శించటం తెలిసిందే. ఆ విషయాన్ని ఆయన ఓపెన్‌గా వ్యక్తం చేస్తున్నారు.

ఛాతీ ఆసుపత్రికి సెక్రటేరియట్‌ ఎందుకంటే వాస్తు బాగోలేదంటూ వ్యాఖ్యానించిన ఆయన తర్వాత.. వచ్చిన విమర్శల్ని పెద్దగా పట్టించుకోలేదు. కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యతో హైకోర్టుకు వెళ్లారు. వాస్తు బాగోలేదన్న కారణంగా సెక్రటేరియట్‌ను తరలిస్తున్నారన్న అంశంపై కేసు వేశారు. దీనిపై తాజాగా విచారణ జరిగింది. అధికారిక పత్రాల్లో ఎక్కడా వాస్తు కారణంగా సచివాలయాన్ని తరలిస్తున్నట్లు లేనందున.. ఛాతీ ఆసుపత్రిని తరలించే విషయంలో అభ్యంతరం ఏమిటని కోర్టు ప్రశ్నించింది.

దీనిపై పిటీషన్‌దారు తరఫున వాదించిన న్యాయవాది.. ఛాతీ ఆసుపత్రి పురాతన భవనమని.. చారిత్రక నేపథ్యంలో ఉందన్న అంశాన్ని లేవనెత్తారు. దీంతో.. సదరు భవనం పురావస్తు చట్టం పరిధిలోకి వస్తుందా? రాదా? అన్న అంశంపై నివేదిక ఇవ్వాలంటూ పురావస్తు శాఖను హైకోర్టు ఆదేశించింది. పురావస్తు శాఖ కానీ.. ఛాతీ ఆసుపత్రి కానీ చారిత్రక భవనం అని చెబితే మాత్రం తెలంగాణ సర్కారుకు షాక్‌ తగలటం ఖాయమన్న వాదన వ్యక్తమవుతోంది. మరి..ఛాతీ ఆసుపత్రిపై పురావస్తు శాఖ ఏం నివేదిక ఇస్తుందో చూడాలి..?
Tags:    

Similar News