ఏపీ రాజధాని పై కీలక వ్యాఖ్యలు చేసిన హైకోర్టు ధర్మాసనం

Update: 2021-11-19 04:47 GMT
గడిచిన కొద్ది రోజులుగా ఏపీ రాజధానిగా నిర్ణయించిన అమరావతిని కాదని.. మరో రెండుచోట్ల కలిపి.. మొత్తం మూడు ప్రాంతాల్లో మూడు రాజధానులు ఏర్పాటు చేయాలన్న ఏపీ అధికారపక్ష అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయంపై ఏపీ హైకోర్టులో వాదనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. గడిచిన మూడు రోజలుగాఈ కేసుకు సంబంధించిన కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ కేసుకు సంబంధించిన విచారణను ఏపీ హైకోర్టు చీప్ జస్టిస్ జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్ర.. జస్టిస్ ఎం. సత్యనారాయణ మూర్తి.. జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులతో కూడిన త్రిసభ్య ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. అదే సమయంలో కేసులు వేసిన పిటిషనర్లు తరపున లాయర్లు కూడా వాదనలు వినిపించారు. ఈ నేపథ్యంలో హైకోర్టు ధర్మాసనం చేసిన వ్యాఖ్యలు ఏమిటి? పిటిషనర్లు తరఫున న్యాయవాదులు వినిపించిన వాదనలు ఏమిటన్నది చూస్తే..

ఏపీ హైకోర్టు ధర్మాసనం వ్యాఖ్యలు

- రాజధానికి ఏ నగరాలు అనువైనవో ప్రస్తుత కేసుల్లో మేం నిర్ణయించటం లేదు. సీఆర్ డీఏ రద్దు.. పాలన వికేంద్రీకరణ చట్టాల చట్టబద్ధతనే తేలుస్తాం. ఆ చట్టాల్ని చేసేందుకు ప్రభుత్వం అనుసరించిన విధానం సక్రమంగా ఉందా? లేదా? అన్నది నిర్ణయిస్తాం.

- రాజధానిగా విజయవాడ.. విశాఖపట్నం.. గుంటూరు..కర్నూలు.. అమరావతిలో ఏది ఉత్తమమైందో అన్నది తేల్చటం లేదు. ఇది నగరాల మధ్య పోటీ కాదు.

పిటిషనర్ల తరఫు న్యాయవాదుల వాదనల్లోని ముఖ్యాంశాలు

- పాలన వికేంద్రీకరణ.. సీఆర్ డీఏ రద్దు చట్టాల్ని చేయటం వెనుక ప్రభుత్వం.. పలువురు మంత్రుల దురుద్దేశం ఉంది. రాజధాని నిర్మిస్తామని ప్రభుత్వం రైతులకు హామీ ఇచ్చి భూసమీకరణ ద్వారా 33 వేల ఎకరాల్ని తీసుకుంది. ప్రభుత్వం ఇచ్చిన హామీ నుంచి వెనక్కి తగ్గటానికి వీల్లేదు.

- రాజధాని పై అధ్యయనం చేసి సిఫార్సులు చేసేందుకు కేంద్రం నియమించిన శివరామక్రిష్ణన్ కమిటీని ఎక్కువ శాతం ప్రజలు విజయవాడ - గుంటూరు మధ్యలో రాజధానిని ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కమిటీ సిఫార్సుల్ని పట్టించుకోకుండా గత ప్రభుత్వం అమరావతిని రాజధానిగా ప్రకటించిందని ప్రస్తుత ప్రభుత్వం చెప్పటం సరికాదు.

- దక్షిణాఫ్రికాలో మూడు రాజధానులు ఉన్నాయని ప్రస్తుత ప్రభుత్వం చెబుతోంది. అందులో ఆ ఫార్మాలా విఫలమైందని అక్కడి నిపుణులు చెబుతున్నారు.

- హైదరాబాద్.. చెన్నైలతో పోలిస్తే అమరావతిలో నిర్మాణ వ్యయం చాలా తక్కువ. కర్నూలు.. విశాఖపట్నాలతో పోలిస్తే అమరావతి రాజధానికి అనువైనదని అప్పటి ప్రభుత్వం భావించింది. అందుకే ఆ నిర్ణయాన్ని తీసుకుంది.

- అమరావతి రాష్ట్రానికి మధ్యలో ఉండటంతో రాకపోకలకు అనువుగా ఉంటుంది. భూ సమీకరణకు ఇబ్బంది లేదు. విపత్తులకు అవకాశం లేదు. ప్రపంచంలో ప్రముఖ నగరాలన్నీ నదీ తారాల్లోనే ఉన్నాయి. అమరావతి పక్కనే క్రిష్ణా నది ఉంది.

- రాష్ట్రంలో ఇతర ప్రాంతాలు అభివ్రద్ధి చెందకపోతే ప్రాంతీయ అసమానతలు తలెత్తుతాయని ప్రస్తుత ప్రభుత్వం భావిస్తోంది. రాజధాని అమరావతిగా నిర్ణయించినప్పుడు అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ వ్యతిరేకించలేదు. అందుకు సంబంధించిన వీడియోలు కోర్టు ముందు ఉంచాం. అధికారంలోకి రాగానే జగన్ మూడు రాజధానుల అంశాన్ని తెర మీదకు తీసుకొచ్చారు.

- మూడు రాజధానుల కోసం చట్టం చేసే శాసనాధికారం ప్రభుత్వానికి లేదు. అమరావతి కోసం భూములు ఇచ్చిన అధిక శాతం మంది రెండు ఎకరాల లోపు ఉన్న చిన్న.. సన్నకారు రైతులే. రాజధాని కోసం జీవనాధారాన్ని వదులుకున్నారు. మూడు రాజధానుల నిర్ణయంతో వారి హక్కులకు భంగం వాటిల్లుతోంది.

- రాజకీయ కారణాలతో రాజధానుల మార్పు సరికాదు. భూములు ఇచ్చిన రైతులకు ప్లాట్లు ఇస్తామని ప్రభుత్వం చెబుతోంది. డెవలప్ మెంట్ లేని అమరావతిలో ప్లాట్లు ఇచ్చి ప్రయోజనం ఏమిటి? అమరావతిని రాజధానిగా ప్రకటించటం వల్ల రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల వారు అసంత్రప్తితో ఉన్నారని.. అందుకే మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నామని ప్రభుత్వం చెప్పటం సరికాదు.

- అదే ఉంటే అప్పట్లోనే కోర్టులను ఎందుకు ఆశ్రయించలేదు? అమరావతి తమదనే బావన ఇతర ప్రాంత ప్రజలకు కలగటం లేదని ప్రభుత్వం చెప్పటం అర్థం లేని వాదన. దేశ ప్రజలందరికీ ఒకే రాజధాని ఉంది. దాన్ని అందరూ అంగీకరించటం లేదా?

- 33 వేల ఎకరాల్ని భూ సమీకరణ కింద రాజధాని కోసం రైతులు ఇచ్చిన సందర్భం దేశంలో ఇదే మొదటిది. దాన్ిన గౌరవించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. పిల్లి తన పిల్లల్ని ఇంటింటికీ మార్చినట్లు రాజధానిని మార్చటానికి వీల్లేదు.

- అక్బర్.. తుగ్లక్ చక్రవర్తులు రాజధానులు మార్చి.. మళ్లీ పాత రాజధానికే వచ్చినట్లు చరిత్రలో ఉంది. అప్పటి ప్రభుత్వం అమరావతిని రాజధానిగా నిర్ణయించటంలో తొందరపడిందని ప్రస్తుత ప్రభుత్వం చెబుతోంది. మరి.. ఇప్పటి ప్రభుత్వం చేస్తోందేమిటి? వికేంద్రీకరణ బిల్లుల విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోలేదా?

- సీఆర్ డీఏ చట్టం చేసేటప్పుడు అప్పటి ప్రభుత్వం ఇతర ప్రాంతాల ప్రజల మనోభావాల్ని పరిగణలోకి తీసుకోలేదని శాసన సభా వ్యవహారాల్ని తప్పు పట్టేలా ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి అప్పట్లో కౌంటర్ దాఖలు చేయటానికి ఎంత ధైర్యం? శాసనాలు సక్రమంగా ఉన్నాయా? లేదా? అనేదాన్ని చట్టసభలే పున: సమీక్షిస్తాయి. లేదా కోర్టులు తేలుస్తాయి. అంతే తప్ప ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి చట్టసభలు చేసిన శాసనాలపై అభ్యంతరం చెప్పటం సరికాదు.
Tags:    

Similar News