కేసీఆర్‌ కు షాక్: ఓట‌ర్ల జాబితాపై హైకోర్టు కీల‌క తీర్పు

Update: 2018-10-05 15:07 GMT
తెలంగాణలో ముంద‌స్తు ఎన్నిక‌ల‌పై సందేహాలు క‌మ్ముకునే ప‌రిణామం చోటుచేసుకుంది. రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణపై ముమ్మరంగా కసరత్తు జరుగుతున్న సమయంలో హైకోర్టు కీల‌క ఆదేశాలు జారీ చేసింది. ఓటర్ల జాబితా అవకతవకలపై మూడు పిటిషన్లను  హైకోర్టు ఇవాళ విచారణ చేపట్టింది. ఇందులో రెండింటిని తోసిపుచ్చిన హైకోర్టు.. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మర్రి శశిధర్‌ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ ను విచారణకు స్వీకరించింది. విచారణ పూర్తయ్యే వరకు తుది ఓటర్ల జాబితాను ప్రకటించవద్దని ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది.

ఓటర్ల జాబితాలో అవకతవకలపై హైకోర్టులోనే తేల్చుకోవాలని సుప్రీంకోర్టు ధర్మాసనం తేల్చుతూ.. శుక్రవారమే పిటిషన్‌లు దాఖలు చేయాలని ఫిటిషనర్‌లకు సూచించింది. సుప్రీంకోర్టు కాపీ అందడంతో ఉమ్మడి హైకోర్టు విచారణను ప్రారంభించింది. సుప్రీం కోర్టు ఆదేశాలతో ఓటర్ లిస్టు - ఓటర్ల జాబితా సవరణపై విచారణ చేపట్టిన హైకోర్టు..ఓటర్ లిస్టుపై దాఖలైన రెండు పిటీషన్లను కొట్టివేసింది. మర్రి శశిధర్‌ రెడ్డి దాఖలు చేసిన రిట్ పిటీషన్ పై ఇరు వర్గాల వాదనలు వినిపించారు. ఓటర్ల నమోదు నిరంతర ప్రక్రియ అని ఈసీ వాదనలు వినిపించింది. నామినేషన్ వేసే ముందు రోజు వరకు కొనసాగిస్తామని అన్నారు. మర్రి శశిధర్ తరపున వాదనలు వినిపించిన లాయర్ జంధ్యాల రవిశంకర్..ఈసీ వాదనలు తప్పుబట్టారు. 25తో సవరణ పూర్తి చేశారని మొత్తం 12 అంశాలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం తుది ఎన్నికల జాబితాపై స్టే విధించింది. తి అభ్యంతరాన్ని పరిణగణలోకి తీసుకొని కౌంటర్ దాఖలు చేయాలని స్పష్టం చేసింది. అలాగే తుది ఓటర్ల జాబితా, ఎన్నికల నోటిఫికేషన్ కూడా రిట్ పిటీషన్ తీర్పునకు లోబడి ఉండాలని కోర్టు క్లారిటీ ఇచ్చింది. పిటిషన్‌లో పేర్కొన్న అంశాలను పరిశీలించిన న్యాయస్థానం తదుపరి విచారణను ఈ నెల 8కి వాయిదా వేసింది.

సోమవారం ఈ పిటిషన్‌ తోపాటు మరో రెండు పిటిషన్లు విచారణకు రానున్నాయి. వచ్చే సోమవారం రోజునే ఈసీ ఓటర్ల తుది జాబితాను విడుదల చేయనుంది. అయితే..అదే రోజున ఓటర్ల జాబితా సవరణపై విచారణ జరగనుంది. తీర్పు అదే రోజున వెలువడుతుందా? లేదంటే మళ్లీ విచారణ వాయిదా పడుతుందా? అనేది ఉత్కంఠగా మారింది. హైకోర్టు ఆదేశాల తర్వాత సోమవారం ఓటర్ల తుది జాబితా విడుదలపై కూడా అనుమనాలు నెలకొన్నాయి. కాగా, మర్రి శశిధర్ రెడ్డి ఈ తీర్పుపై స్పందిస్తూ పైస్థాయి నుంచి వస్తున్న ఒత్తిళ్ల వల్లే ఓటర్ల జాబితా సవరణలో లోపాలు జరుగుతన్నాయని అరోపించారు. నామినేషన్ ముందు రోజు వరకు లోపాల సవరణ జరుతుందన్న ఈసీ వాదనను తప్పుబడ‌తూ ఓటర్ల జాబితాలో తప్పులకు కారణమైన ఉన్నతాధికారులపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Tags:    

Similar News