ప్ర‌స్తుతానికి బ‌య‌ట‌ప‌డ్డా.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆ ఎంపీకి సీటు లేన‌ట్టేనా?

Update: 2022-08-18 12:30 GMT
ఒక్క‌సారిగా త‌న‌ది అని చెప్ప‌బ‌డుతున్న న్యూడ్ వీడియో కాల్ ద్వారా దేశ‌వ్యాప్తంగా పాపుల‌ర్ అయ్యారు.. హిందూపురం వైఎస్సార్సీపీ ఎంపీ గోరంట్ల మాధ‌వ్. ఆ న్యూడ్ వీడియో ఫేక్ అని అనంత‌పురం జిల్లా ఎస్పీ ప్ర‌క‌టించ‌డం, వైఎస్సార్సీపీ అధిష్టానం అండ‌గా నిల‌బ‌డ‌టంతో గోరంట్ల మాధ‌వ్ ఈ వ్య‌వ‌హారం నుంచి ప్ర‌స్తుతానికి బ‌య‌ట‌ప‌డ్డారు. అయితే వ‌చ్చే ఎన్నిక‌ల్లో మాత్రం గోరంట్ల మాధ‌వ్‌కు సీటు హుళ‌క్కేన‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు. ఇందుకు న్యూడ్ వీడియో ఒక్క‌టే కార‌ణం కాద‌ని.. ఆ వీడియో బ‌య‌ట‌కు రాక‌ముందే వైఎస్సార్సీపీ హిందూపురం నుంచి కొత్త వ్య‌క్తిని బ‌రిలోకి దించాల‌ని భావిస్తోంద‌ని అంటున్నారు.

వాస్త‌వానికి గ‌త ఎన్నిక‌ల ముందు గోరంట్ల మాధ‌వ్ అనంత‌పురం జిల్లాలో సీఐగా ఉండేవారు. పోలీసు ఉద్యోగుల సంఘం నేత‌గా కూడా ఉన్నారు. ఆ స‌మ‌యంలో అప్ప‌టి అనంత‌పురం ఎంపీగా ఉన్న జేసీ దివాక‌ర్ రెడ్డి పోలీసుల‌పై ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. దీనికి కౌంట‌ర్‌గా గోరంట్ల మాధ‌వ్ కూడా మీసం మెలేసి జేసీని స‌వాల్ చేస్తూ మాట్లాడారు.

దీంతో గోరంట్ల మాధ‌వ్‌ను అనూహ్యంగా వైఎస్సార్సీపీ త‌మ పార్ల‌మెంటు అభ్య‌ర్థిగా ప్ర‌క‌టించింది. ఇందుకు గోరంట్ల మాధ‌వ్ సామాజిక‌వ‌ర్గం కూడా క‌ల‌సి వ‌చ్చింది. ఆయ‌న బీసీ కుల‌స్తుడు కావ‌డం, అందులోనూ అనంత‌పురం జిల్లాలో పెద్ద సంఖ్య‌లో ఉన్న కుర‌బ క‌మ్యూనిటీకి చెందిన‌వాడు కావ‌డం మాధ‌వ్‌కు క‌ల‌సి వ‌చ్చింది. అదే ఊపులో ఆయ‌న హిందూపురం ఎంపీ కూడా అయిపోయారు.

అయితే ఆ త‌ర్వాత కియా మోటార్స్ ఎండీని ఒక కార్య‌క్ర‌మంలో అంద‌రి ముందు గోరంట్ల మాధ‌వ్ తూల‌నాడ‌టం తీవ్ర వివాదాస్ప‌ద‌మైంది. అంతేకాకుండా ఈ మూడేళ్లలో ఎంపీ మాధ‌వ్ నియోజ‌క‌వ‌ర్గానికి చేసిందీమే లేద‌ని కూడా విశ్లేష‌కులు గుర్తు చేస్తున్నారు.

ముందు నుంచీ ఆయ‌న రాజ‌కీయ నాయ‌కుడు కాక‌పోవ‌డంతో ఇత‌ర పార్టీ నేత‌ల‌తోనూ అంత‌గా స‌న్నిహిత సంబంధాలు కూడా లేవ‌ని చెబుతున్నారు. అంతేకాకుండా హిందూపురం మొద‌టి నుంచి టీడీపీ కంచుకోట‌. గ‌త ఎన్నిక‌ల్లో వైఎస్సార్సీపీ వెల్లువ‌లో మాత్ర‌మే హిందూపురంలో వైఎస్ఆర్సీపీ గెలుపొందింద‌ని అంటున్నారు.

ఈ నేప‌థ్యంలో వీడియో లీక్ కాక ముందే హిందూపురంలో గోరంట్ల మాధ‌వ్‌కు వ‌చ్చే ఎన్నిక‌ల్లో సీటు ఇవ్వ‌కూడ‌ద‌ని వైఎస్సార్సీపీ నిర్ణ‌యించింద‌ని చెబుతున్నారు. ఇప్పుడు ఈ న్యూడ్ వీడియో లీక్ కావ‌డం, గోరంట్ల మాధ‌వ్ తీరుతో వైఎస్సార్సీపీ, రాష్ట్ర ప్ర‌భుత్వం రెండూ ఇర‌కాటంలో ప‌డ‌టం, ఈ వ్య‌వ‌హారాన్ని స‌మ‌ర్థించుకోలేక పరువు పోగొట్టుకోవ‌డం జ‌రిగాయ‌ని పేర్కొంటున్నారు. ఈ నేప‌థ్యంలో గోరంట్ల మాధ‌వ్‌కు వ‌చ్చే ఎన్నిక‌ల్లో సీటు ఇవ్వ‌కుండా జెల్ల కొట్ట‌డం ఖాయ‌మేనంటున్నారు.
Tags:    

Similar News