టీవీ.. ఫ్రిజ్.. వాషింగ్ మెషిన్ కొనాలనుకుంటే అస్సలు లేట్ చేయొద్దు

Update: 2020-12-28 23:30 GMT
టీవీ.. ఫ్రిజ్.. వాషింగ్ మెషీన్ లాంటి ఎలక్ట్రానిక్ వస్తువుల్ని కొనాలన్న ప్లాన్ లో ఉన్నారా? అస్సలు ఆలస్యం చేయొద్దంటున్నారు మార్కెటింగ్ వర్గాలు. ఆలోచన వచ్చిందే తడువుగా.. బడ్జెట్ లెక్కలు వేసుకొని.. కొనేయటమే తప్పించి.. ఆలస్యం చేస్తే.. అందుకు తగిన మూల్యం చెల్లించక తప్పదంటున్నారు. ఎందుకిలా? అంటే.. దానికి బోలెడన్నికారణాలు ఉన్నట్లు చెబుతున్నారు.

కరోనా పుణ్యమా అని.. ఇప్పటికి పలు కంపెనీలు పూర్తిస్థాయిలో పని చేయలేకపోతున్నాయి. ఇదిలా ఉంటే.. ముడి పదార్థాల (ప్లాస్టిక్..రాగి.. అల్యూమినియం.. ఉక్కు) ధరలు పెరగటం.. రవాణా చార్జీలు పెరగటంతో పాటు.. ముడిచమురు ధరలు అంతకంతకూ పెరిగిపోవటంతో ధరల పెంపు ఖాయమని తయారీ సంస్థలు చెబుతున్నాయి. ప్రముఖ ఎలక్ట్రానిక్ సంస్థలు ఎల్ జీ.. ప్యానసోనిక్.. శ్యాంసంగ్ లాంటి సంస్థలు త్వరలోనే తమ ఉత్పత్తుల ధరలు పెరగనున్నట్లుగా వెల్లడించాయి.

వచ్చే ఏడాది మొదట్లోనే ధరల పెంపు ఉంటుందని చెబుతున్నారు. రానున్నమూడు నెలల వ్యవధిలో కనిష్ఠంగా 5 శాతం గరిష్ఠంగా 20 శాతం వరకు ధరలు పెరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. తొలిదశలో ఐదు నుంచి ఏడు శాతం వరకు ధరలు పెరిగే అవకాశం ఉంది. ఇక.. ఎలక్ట్రానిక్ ఉపకరణాల విషయానికి వస్తే.. టీవీ ధరలు భారీగా పెరుగుతాయని.. తర్వాతి స్థానంలో ఫ్రిజ్ లు.. వాషింగ్ మెషిన్లు ఉంటాయంటున్నారు. కరోనా నేపథ్యంలో ఉత్పత్తి మీద ప్రభావం చూపటం.. కంటెయినర్ల కొరతతో పాటు సముద్ర.. విమాన రవాణా ఛార్జీలు పెరిగిపోయాయి. దీనికి తోడు కమోడిటీల ధరలు భారీగా పెరగటంతో.. వస్తువుల ధరల పెంపు అనివార్యంగా మారినట్లు చెబుతున్నారు.

ధరల పెరిగే విషయంలో టీవీలు ముందుంటాయని చెబుతున్నారు. ప్యానళ్ల తయారీ దేశీయంగా లేకపోవటం.. సరఫరా పరిమితంగా ఉండటం కూడా కారణమని చెప్పొచ్చు. లాక్ డౌన్ నేపథ్యం.. ఇంటి నుంచి పని చేయటం.. ఆన్ లైన్ క్లాసులతో పాటు.. వివిధ అంశాలు టీవీల గిరాకీ పెరిగింది. దేశీయంగా ప్రత్యామ్నాయంగా ప్యానెళ్ల తయారీ లేకపోవటంతో చైనాపై ఆధారపడాల్సి వస్తోంది. అందుకే.. ధరల పెంపు ఖాయమంటున్నారు. సో.. ఎలక్ట్రానిక్ వస్తువులు ఏవైనా సరే.. కొనాలనుకుంటే మాత్రం ఆలస్యం చేయకుండా కొనేయటం మంచిదన్నది మర్చిపోవద్దు.
Tags:    

Similar News