ఏపీ మంత్రులా?మ‌ద్యానికి బ్రాండ్ అంబాసిడ‌ర్లా?

Update: 2018-07-15 06:36 GMT
సంక్షేమ కార్య‌క్ర‌మాల‌కు నిధులు కావాలి. అవి రావాలంటే ఉన్న మార్గాల్లో ఈజీ మార్గం.. ప్ర‌జ‌ల మీద ప‌న్నులు వేయ‌టం. అలా అని ఇష్టారాజ్యంగా బాదేస్తే.. వ్య‌తిరేక‌త పెరిగి మొద‌టికే మోసం రావ‌టం ఖాయం. అందుకే.. ఆదాయ వ‌న‌రు తెచ్చి పెట్టే మార్గాల మీద ప్ర‌భుత్వాలు దృష్టి సారిస్తూ ఉంటాయి. కేంద్ర ప్ర‌భుత్వానికి రాష్ట్రాల నుంచి వ‌చ్చే ఆదాయంతో పాటు.. మ‌రిన్ని మార్గాలు ఉంటాయి. కానీ.. రాష్ట్ర ప్ర‌భుత్వాలకు ప‌రిమిత వ‌న‌రులు మాత్ర‌మే ఉంటాయి. రాష్ట్రాల‌కు ఆదాయాన్ని తెచ్చి పెట్టే అంశాల్లో ఎక్సైజ్ ఒక‌టి.

నిజానికి ఈ రోజున రాష్ట్రాలకు పెద్ద ఎత్తున ఆదాయాన్ని తెచ్చి పెట్టే మార్గాల్లో ప్ర‌ధాన‌మైంది మ‌ద్యం షాపుల మీద వ‌చ్చేది అయితే.. రెండోది పెట్రోల్‌.. డీజిల్ మీద వ‌స్తాయి.  ప్ర‌జ‌ల ఆరోగ్యాన్ని హ‌రించే మ‌ద్య‌పానాన్ని నిషేధం విధించాల‌న్న డిమాండ్ ఉన్నా.. అలా చేస్తే రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితికి ఆయువు ప‌ట్టు మీద ప్ర‌భావం చూపించ‌టం ఖాయం. అందుకే.. మ‌ద్యపాన నిషేధం మీద ప్ర‌భుత్వాలు పెద‌వి విప్పేందుకు ఏ మాత్రం ఇష్ట‌ప‌డ‌వు.

బాధ్య‌త క‌లిగిన ఏ రాష్ట్ర ప్ర‌భుత్వం కూడా ఎక్సైజ్ ఆదాయం మీద పెద్ద‌గా ఆధార‌ప‌డేందుకు ఆస‌క్తి ప్ర‌ద‌ర్శించ‌వు. కానీ.. ఇప్ప‌టి ప్ర‌భుత్వాల తీరు వేరు కావ‌టంతో.. ఎంత ఆదాయం వ‌స్తుందో అంత పిండుకోవ‌టానికి ప్ర‌య‌త్నించ‌ట‌మే కాదు.. మ‌రింత పెంచుకునేందుకు ప్ర‌య‌త్నిస్తూ ఉంటాయి. ఇక‌.. ఏపీలో ప‌రిస్థితి చూస్తే ఇది మ‌రింత దారుణంగా క‌నిపిస్తుంది.

మ‌ద్య‌పానాన్ని ప్ర‌మోట్ చేసేలా ఆ పార్టీ నేత‌ల తీరు క‌నిపిస్తూ ఉంటుంది. ఎవ‌రి దాకానో ఎందుకు ఏపీ ఉప ముఖ్య‌మంత్రి నిమ్మ‌కాయ‌ల చిన‌రాజ‌ప్ప సంగ‌తే చూడండి. ఆయ‌న తాజాగా మాట్లాడుతూ.. మ‌ద్యం ఎంతైనా తాగండి... అది మీ ఇష్టం.. కానీ రోడ్ల మీద‌కు వ‌స్తే మాత్రం కేసులు పెడ‌తామ‌ని చెబుతున్నారు. మ‌ద్యం తాగి డ్రైవింగ్ చేస్తున్న ఉదంతాల కార‌ణంగా పెద్ద ఎత్తున ప్ర‌మాదాలు చోటు చేసుకుంటున్నాయ‌ని.. ప‌లువురు మ‌ర‌ణిస్తున్నార‌ని వాపోయారు. రోడ్డు ప్ర‌మాదాల్ని నివారించేందుకే పోలీసులు డ్రంక‌న్ డ్రైవ్ ను నిర్వ‌హిస్తున్న‌ట్లు వెల్ల‌డించారు.  

బాధ్య‌త క‌లిగిన స్థానంలో ఉన్న నేత చెప్పాల్సిందేమిటి?  ఇష్టం వ‌చ్చిన‌ట్లుగా తాగితే ఆరోగ్యానికి ప్ర‌మాద‌క‌ర‌మ‌ని.. మ‌ద్య‌పానం ఎంత‌మాత్రం మంచిది కాద‌ని చెప్పాల్సి ఉంది. కానీ.. అదేమీ లేకుండా.. మీ ఇష్టం వ‌చ్చినంత తాగండి.. రోడ్ల మీద‌కు మాత్రం రావొద్దంటూ హెచ్చ‌రిక‌లు చూస్తే.. మీరు ఎట్లా పోయినా ఫ‌ర్లేదు.. ప్ర‌మాదాల కార‌ణంగా ప్ర‌భుత్వానికి చెడ్డ పేరు రాకుంటే చాల‌న్న‌ట్లుగా ఉంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

ఇదిలా ఉంటే.. ఎక్సైజ్ మంత్రి జ‌వ‌హ‌ర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో బెల్టు షాపులు లేకుండా చేశామ‌న్న ఆయ‌న‌.. మ‌ద్యం తాగి వాహ‌నాలు న‌డ‌ప‌కూడ‌ద‌న్నారు. మ‌ద్యం తాగొద్ద‌ని తాము చెప్ప‌మ‌ని.. ఇంటికి తీసుకెళ్లి తాగాలంటూ స‌ల‌హాను ఇచ్చారు. ఇంట్లో మ‌ద్య‌పానం చేయ‌టం  ఇంట్లోని కుటుంబ స‌భ్యుల మీదా.. పిల్ల‌ల మీదా ప్ర‌భావం చూపిస్తుంద‌న్న చిన్న విష‌యాన్ని సైతం ఏపీ మంత్రి మ‌ర్చిపోవ‌టం చూస్తే.. రాష్ట్రానికి వ‌చ్చే ఆదాయం త‌ప్పించి మ‌రింకేమీ ప‌ట్ట‌దా? అన్న డౌట్ రాక మాన‌దు.
Tags:    

Similar News