అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు సన్నిహితులు టాటా చెప్పే పర్వం కొనసాగుతోంది. ఆయనకు అత్యంత సన్నిహితుల్లో ఒకరైన వైట్ హౌస్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ హోప్ హిక్స్ తన పదవికి రాజీనామా చేశారు. అధ్యక్ష ఎన్నికల ప్రచార సమయం నుంచి ట్రంప్ వెంట ఉన్న హోప్ రాజీనామా సమర్పించడం వైట్ హౌస్ లో చాలా మందిని ఆశ్చర్యంలో ముంచెత్తింది. హోప్ సుదీర్ఘ కాలంగా ట్రంప్ కు సలహాదారుగా ఉంటున్నారు. ఆమె రాజీనామాకు గల కారణాలు తెలియరాలేదు. కాగా, పలు విశ్లేషణలను అమెరికామీడియా వెలువరిస్తోంది. ఇటీవల వైట్ హౌస్ స్టాఫ్ సెక్రటరీగా పనిచేసిన రాబ్ పోర్టర్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. రాబ్ తమను శారీరకంగా - మానసికంగా వేధించేవాడని అతని మాజీ భార్యలు ఆరోపణలు చేయడంతో ఆయన రాజీనామా చేశారు. అయితే - రాబ్ పోర్టర్ కు - హోప్ కు మధ్య వివాహేతర సంబంధమున్నట్టు యూఎస్ మీడియాలో పలు కథనాలు వెలువడ్డాయి.
2016 అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యం చేసుకున్నట్టు అమెరికా ఇంటెలిజెన్స్ విభాగం ఆరోపిస్తోంది. ఈమేరకు ట్రంప్ ప్రచార బృందంలో పాల్గొన్న సభ్యులందరినీ హౌస్ ఇంటెలిజెన్స్ కమిటి విచారిస్తోంది. ఈ కమిటీ బుధవారం తొమ్మిది గంటల పాటు హోప్ ను విచారించింది. ఈ విచారణ ముగిసిన మరుసటి రోజే హోప్ రాజీనామా చేయడం గమనార్హం. ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి హోప్ సమర్ధవంతంగా పనిచేశారని ప్రశంసిస్తూ ట్రంప్ ఓ ప్రకటన విడుదల చేశారు. తాను ఆమెను ఎంతగానో కోల్పోతున్నానంటూ ఆ ప్రకటనలో పేర్కొన్నారు. అధ్యక్ష కార్యాలయమైన ఓవల్ ఆఫీస్ కు సంబంధించి వెస్ట్ వింగ్ లో ఆమె కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
అయితే, రష్యా దర్యాప్తు విషయంలో తాను ఎలాంటి అబద్ధాలు చెప్పలేదని హోప్ తెలిపారు. రాబర్ట్ ముల్లర్ ఆధ్వర్యంలోని ప్రత్యేక కౌన్సిల్ కూడా ఆమెను ప్రశ్నించింది. మాజీ మోడల్ అయిన హోప్ గతంలో ట్రంప్ కుమార్తె ఇవాంక కోసం పనిచేసేవారు. ట్రంప్ ఆమెను తన ప్రచార బృందంలోకి ఆహ్వనించేప్పటికి ఆమెకు ఎలాంటి రాజకీయ అనుభవం లేదు. కాగా, తాజా రాజీనామా అమెరికా వర్గాలు ఆరోపిస్తున్నాయి.