వామ్మో..కూర్చున్న హోటల్ నే అమ్మేశారే!

Update: 2020-02-06 03:30 GMT
జాదూగిరీ... అంటేనే ఓ రేంజి చోరకళ. ఆ చోర కళకే హైలెట్ గా నిలుస్తున్న ఘటన ఇది. ఓ హోటల్ కు వెళ్లి... దాని లాబీల్లోనే కూర్చుని అదే హోటల్ ను దాని ఓనర్ కు తెలియకుండా అమ్మేయడమంటే చోరకళకే హైలెట్టే కదా. ఈ తరహా ఘటనలు సినిమాల్లో సాధ్యం గానీ.. నిజ జీవితంలో సాధ్యమా? అంటారా? అయితే... చెన్నైలో జరిగిన ఈ ఘటన వివరాల్లోకి వెళితే... రియల్ లైఫ్ లో కూడా ఈ తరహా ఘటనలు జరుగుతాయని ఒప్పేసుకోక తప్పదు. సరే... మరి అమితాసక్తి రేకెత్తిస్తున్న ఈ ఘటన వివరాల్లోకి వెళ్లిపోదాం పదండి.

చెన్నైలోని ఓ హోటల్ అప్పుల్లో కూరుకుపోయిందట. ఇదే విషయాన్ని ఆసరా చేసుకున్న  కొందరు జాదూగాళ్లు రంగంలోకి దిగిపోయారు. నేరుగా సదరు హోటల్ లోకే వెళ్లారు. దర్జాగా లాబీల్లో కూర్చున్నారు. అక్కడి నుంచే తమ హోటల్ ను అమ్మకానికి పెట్టినట్టుగా ఓ సంస్థకు లేఖ రాశారట. ఇది నిజమేనేమోనని నమ్మిన సదరు సంస్థ ప్రతినిధులు కూడా అదే హోటల్ కు వచ్చి... లాబీల్లో కూర్చున్న జాదూగాళ్లనే ఓనర్లుగా నమ్మేసి బేరసారాలు మొదలెట్టేశారట. బేరసారాల్లో సదరు సంస్థ ప్రతినిధులను రూ.160 కోట్లకు కొనేలా జాదూగాళ్లు ఒప్పించేశారట. ఇంకేముంది.. అడ్వాన్స్ గా 10 శాతాన్ని తీసుకునేందుకు కూడా సిద్ధపడ్డారు. ఆ మొత్తాన్ని జాదూగాళ్లకు ఇచ్చేందుకు సదరు సంస్థ ప్రతినిధులు కూడా సిద్ధమైపోయారట.

మరికొన్ని నిమిషాలు ఉంటే... ఈ డీల్ లో రూ.16 కోట్లు జాదూగాళ్ల చేతులకు అందేవే. అడ్వాన్స్ తీసుకునే ప్రయత్నంలో హోటల్ యాజమాన్యం ఈ డీల్ ను పసిగట్టిందట. హోటల్ సిబ్బంది ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు జాదూ బ్రోకర్లను అరెస్ట్ చేశారు. ఈ మొత్తం వ్యవహారాన్ని జాదూగాళ్లు ఎలా సాగించారన్న విషయం తెలిసి పోలీసులతో పాటు - హోటల్ యాజమాన్యం కూడా షాక్ తిన్నదట. హోటల్ కు సంబంధించి నకిలీ డాక్యుమెంట్లను సృష్టించి ఈ తతంగాన్ని జాదూగాళ్లు కొనసాగించారట.


Tags:    

Similar News