హోస్టన్ సభతో మోడీ మాస్టర్ స్ట్రోక్స్ ఇవే..

Update: 2019-09-23 07:25 GMT
ఇద్దరూ ఇద్దరే అన్నట్లుగా వ్యవహరించారు ట్రంప్.. మోడీలు. తాజా హోస్టన్ లో జరిగిన ర్యాలీలో ఇరు దేశాల అధినేతలు వ్యవహరించిన తీరు.. ఒకరిపై ఒకరు కురిపించిన ఆదరాభిమానాలు చూస్తే.. గతంలో ఇలాంటివి మరెప్పుడూ చోటుచేసుకోలేదని చెప్పాలి. అంతేకాదు.. ఇద్దరికి ఇద్దరూ ఒకరి మనసుల్ని ఒకరు కొల్లగొట్టుకోవటంతో పాటు.. అమెరికన్లు.. ప్రవాస భారతీయుల మనసుల్ని కొల్లగొట్టే ప్రయత్నం చేశారు.

ట్రంప్ మనసును దోచేకునేలా మోడీ ఏం చేశారంటే?

మిస్టర్ ప్రెసిడెంట్.. 2017లో నేను వైట్ హౌస్ కి వచ్చినప్పుడు మీరు మీ కుటుంబానికి నన్ను పరిచయం చేశారు. నేను నా కుటుంబాన్ని మీకు పరిచయం చేస్తున్నా అంటూ.. సభకుహాజరైన 50వేల మంది ప్రవాస భారతీయుల్ని ట్రంప్ నకు చూపించటం.. వారంతా ఆ సమయంలో కేరింతలు కొట్టటం ద్వారా.. తాను వారిని ఎంతలా ప్రభావితం చేయగలనో చెప్పేశారు.

మోడీ మనుసును ట్రంప్ ఎలా కొల్లగొట్టారంటే..

తన ప్రసంగంలో భాగంగా అప్పటికే ఐదు రోజుల క్రితం జరుపుకున్న బర్త్ డేను గుర్తు చేస్తూ.. హ్యాపీ బర్త్ డే అంటూ శుభాకాంక్షలు చెప్పటం ద్వారా.. మోడీ తనకెంతో ముఖ్యమైన స్నేహితుడో చెప్పేశారు. ఈ సందర్భంగా మోడీ పాలనను తెగ పొగిడేయటం ద్వారా ఆయన మనసును ట్రంప్ కొల్లగొట్టేశారు.

అమెరికన్ల మనసుల్ని మోడీ ఎలా దోచుకున్నారంటే..

హోస్టన్ కు చేరుకున్న మోడీకి స్వాగతం పలికేందుకు పలువురు అమెరికన్ ప్రముఖులు ఎయిర్ పోర్ట్ కు వచ్చారు. హోస్టన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగిన ప్రధానికి పలువురు ప్లవర్ బొకేలు ఇచ్చారు. ఆ సందర్భంలో ఒక బొకే నుంచి ఒక పువ్వు జారి కిందకు పడింది. ప్రధాని మోడీ వెంటనే ఆ పువ్వును కిందకు వంగి తీసుకున్నారు. ఒక దేశ ప్రధాని కిందకు వంగి స్వయంగా పువ్వు తీయటం.. చూసిన అక్కడి వారు మోడీ తీరుకు ఆశ్చర్యపోయారు. స్వచ్ఛత విషయంలో తానెంత కరెక్ట్ గా ఉంటానన్న విషయాన్ని చెప్పకనే చెప్పేశారు.

మరే ప్రధానికి దక్కని గౌరవం

అమెరికా పర్యటన సందర్భంగా గతంలో మరే భారత ప్రధానికి దక్కని గౌరవం లభించింది. హోస్టన్ కు వచ్చిన ఆయనకు ఆ నగర మేయర్ సిల్వెస్టర్ టర్నర్ వినూత్న రీతిలో స్వాగతం పలికారు. ఆ నగర తాళాల్ని మోడీకి అందించారు. ఇలాంటి గౌరవం గతంలో ఏ ప్రధానికి దక్కలేదు.

ఇదిలా ఉంటే.. బహిరంగ సభ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు ప్రసంగించేందుకు ఉపయోగించే బల్ల మీద ప్రెసిడెన్షియల్ సీల్ కు బదులుగా ఇరు దేశాల (భారత్- అమెరికా) జెండాలతో కూడిన చిత్రాన్ని ఉంచారు. ఇలా గతంలో మరెప్పుడూ చోటుచేసుకోలేదు.
   

Tags:    

Similar News