లాక్‌ డౌన్‌ లో విబేధాలు.. భార్యాభ‌ర్త‌ల తెగ‌దెంపులు

Update: 2020-04-04 02:30 GMT
క‌రోనా వ్యాప్తి ప్ర‌పంచ‌మంతా లాక్‌ డౌన్ అయ్యింది. ప్ర‌జ‌లంద‌రూ ఇళ్ల‌కే ప‌రిమిత‌మ‌య్యారు. కుటుంబ‌స‌భ్యులంతా ఇంట్లోనే కాల‌క్షేపం చేస్తున్నారు. స్వీయ గృహ నిర్బంధంలో ఉన్న ప్ర‌జ‌లు పొద్దుపోక తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నారు. కొంద‌రేమో ఈ స‌మ‌యాన్ని ఆస్వాదిస్తుండ‌గా.. మ‌రికొంద‌రికేమో చేదు అనుభ‌వాలు ఎదుర‌వుతున్నాయంట‌. అయితే ఈ లాక్‌డౌన్‌, హోం క్వారంటైన్ కుటుంబంలో చిచ్చు రేపుతున్నాయ‌ని స‌మాచారం. ముఖ్యంగా భార్యాభ‌ర్త‌ల మ‌ధ్య విబేధాలు ఏర్ప‌డి విడాకుల దాక వెళ్తుండ‌డం గ‌మ‌నార్హం. ప్ర‌పంచమంతా ఇదే ప‌రిణామం చోటుచేసుకుంటుండ‌డం ఆందోళ‌న క‌లిగిస్తోంది.

ప్ర‌స్తుతం భార్యాభ‌ర్త‌లు ఇద్ద‌రు ఉద్యోగాలు చేయ‌నిది బ‌త‌క‌లేని ప‌రిస్థితి. ఈ నేప‌థ్యంలో వారిద్ద‌రూ ఉద్యోగాలు చేస్తూ ఉరుకుల‌ప‌రుగులతో కాలం వెళ్ల‌దీస్తున్నారు. ప్ర‌స్తుతం క‌రోనా పుణ్యాన ఆ భార్యాభ‌ర్త‌లు ఇంటికే ప‌రిమిత‌మ‌య్యారు. వారిద్ద‌రూ ఏకాంతంగా.. ప్రేమ‌గా మాట్లాడుకోవ‌డానికి స‌మ‌యం చిక్కింది. ఇళ్ల‌కు ప‌రిమితమై వారు వివాహ బంధాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. అయితే కొంద‌రికీ మాత్రం ఈ లాక్‌ డౌన్‌ తో పాటు క్వారంటైన్ అనేది కొత్త చిక్కులు తెచ్చిపెడుతున్నాయి. ప్ర‌స్తుతం అంద‌రికీ వ‌ర్క్ ఫ్ర‌మ్ హోం లేదా ఉద్యోగాలకు సుదీర్ఘ సెలవులు రావ‌డంతో ఇంటికి ప‌రిమిత‌మ‌య్యారు. ఈ క్ర‌మంలో కొంద‌రు బ‌య‌ట న‌డిపించే వ్య‌వ‌హారాలు బ‌హిర్గ‌త‌మ‌వుతున్నాయి. గ‌తంలో ఉన్న చిన్న చిన్న విష‌యాలు భార్యాభ‌ర్త‌ల మ‌ధ్య చిచ్చురేపుతున్నాయి. ఈక్ర‌మంలో వారిద్ద‌రి మ‌ధ్య వాగ్వాదానికి దారి తీస్తోంది. చివ‌ర‌కు కొట్లాట‌లు తీవ్ర‌మై విడాకులు తీసుకునే స్థాయికి చేరాయి. క‌రోనా ప్ర‌భావంతో బంధాలు విక‌టిస్తున్నాయి.

ముఖ్యంగా చైనాలో ఈ ప‌రిస్థితి తీవ్రంగా ఉందంట‌. ఆ దేశంలో భార్యాభ‌ర్త‌లు విడాకులు కావాల‌ని పెద్ద సంఖ్య‌లో కోరుతున్నారంట‌. దీంతో అక్క‌డ విడాకుల రేటు భారీగా పెరిగింద‌ట‌. క‌రోనా వైర‌స్ తీవ్రంగా ప్ర‌బ‌లించిన నేప‌థ్యంలో చైనాలో క‌ట్టుదిట్టంగా లాక్‌డౌన్ అమ‌లుచేసిన విష‌యం తెలిసిందే. ఆ క్ర‌మంలో ప్ర‌జ‌లు ఇళ్ల‌కు ప‌రిమితమ‌య్యారు. ఆ స‌మ‌యంలో చాలామంది దంప‌తులు గొడ‌వ ప‌డి విడాకుల కోసం కోర్టుల‌ను ఆశ్ర‌యించారు. సాధార‌ణ రోజుల‌తో పోలిస్తే క్వారెంటైన్, లాక్‌డౌన్ స‌మ‌యంలో విడాకుల ద‌ర‌ఖాస్తులు భారీగా పెరిగాయి.

ఆస్ట్రేలియాలో కూడా ఇలాంటి కేసులు పెరిగిపోయాయి. గృహ‌హింసతో పాటు విడాకుల కేసులు కూడా పెరిగాయ‌ని అక్క‌డి లెక్క‌లు చెబుతున్నాయి. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఇలాంటి సంఘ‌ట‌న‌లు భారీగానే న‌మోద‌వుతున్నాయి. ఇప్పుడు భార‌త‌దేశంలో కూడా అలాంటి ప‌రిస్థితులే ఉన్నాయి. విలువైన ఈ స‌మ‌యాన్ని స‌ద్వినియోగం చేసుకోకుండా కొంద‌రు దుర్వినియోగం చేసుకుంటున్నారు. గొడ‌వ‌లు ప‌డుతూ.. విబేధాలు ర‌చ్చ‌కెక్కి కుటుంబ‌స‌భ్యుల మ‌ధ్య గొడ‌వ‌లు రావ‌డం లేదా భార్యాభ‌ర్త‌ల మ‌ధ్య విబేధాలు వ‌చ్చి పోలీస్‌ స్టేష‌న్‌ కు బారులు తీరుతున్నారు. ఒక‌రినొక‌రు అర్థం చేసుకునే అవ‌కాశం ఉన్నా ఇగోలు - స్వప్ర‌యోజ‌నం - వ్య‌క్తిగ‌త లాభం వంటి అంశాల‌తో కుటుంబీకుల మ‌ధ్య విబేధాలు ఏర్ప‌డి ప్ర‌స్తుతం పోలీస్‌ స్టేష‌న్‌ ల‌కు పంచాయితీలు చేరుతున్నాయి. ఇలాంటి ప‌రిణామాలు ఆందోళ‌న క‌లిగిస్తున్నాయి. ఒక‌రినొక‌రు అర్థం చేసుకుని ఈ విలువైన స‌మ‌యాన్ని కుటుంబ‌ స‌భ్యుల‌తో ఆనందోత్సాహాల‌తో ఉండాల‌ని మాన‌సిక నిపుణులు సూచిస్తున్నారు. చిన్న‌చిన్న విష‌యాల‌కు గొడ‌వ‌లు ప‌డ‌డం - ఇగోలు ప‌క్క‌న‌పెట్టి హాయిగా గ‌డ‌పాల‌ని చెబుతున్నారు.



Tags:    

Similar News