తప్పు చేస్తే చందా కొచ్చర్ అయినా ఊచలు లెక్కించాల్సిందే

Update: 2022-12-24 10:30 GMT
తెలియక చేసినా తప్పే అవుతుంది. అలాంటిది తెలిసి తప్పు చేస్తే? అందుకు చెల్లించాల్సిన మూల్యం భారీగా ఉంటుంది. అందునా చందా కొచ్చర్ లాంటి అత్యుత్తమ స్థానంలో ఉన్న వారు మరెంతో అప్రమత్తంగా ఉండాలి. కానీ.. అందుకు భిన్నంగా ఆమె వ్యవహరించిన తీరు అప్పట్లో సంచలనంగా మారటమే కాదు.. పలువురిని విస్మయానికి గురి చేసింది. ఐసీఐసీఐ బ్యాంక్ అన్నంతనే గుర్తించని రోజుల్లో చందాకొచ్చర్ కున్న ఇమేజ్.. చివరకు ఆమె ఆ బ్యాంక్ కు ఫేస్ గా మారిన వైనం.. ఆ బ్యాంకు అంతకంతకు ఎదుగుతూ వచ్చిన వైనం అందరికి తెలిసిందే.

ఐసీఐసీఐ ప్రయాణంలో చందాకొచ్చర్ పాత్రను ఎంత చెప్పినా తక్కువే. బ్యాంకు పురోగతి కోసం ఆమె పడిన  కష్టం అంతా ఇంతా కాదని చెబుతారు. అలాంటి ఆమె తీసుకున్న కక్కుర్తి నిర్ణయం ఆకాశాన ఉన్న ఆమెను పాతాళానికి  పడేయటమే కాదు.. చివరకు జైలు ఊచలు లెక్కించే వరకు తీసుకెళ్లింది. వీడియోకాన్ గ్రూప్ నకు ఆమె మంజూరు చేసిన రుణం ఆమె పాలిట శాపంగా మారటమే కాదు.. ఆమె జీవితాన్ని పూర్తిగా మార్చేసింది.

వీడియో కాన్ గ్రూప్ నకు అవసరమైన భారీ రుణాన్ని.. రూల్ ప్రకారం కంటే కూడా తనకున్న హోదాతో ఆ సంస్థకు భారీగా ఇవ్వటంలో ఆమె కీలక భూమిక పోషించారు. వీడియోకాన్ సంస్థకు రూ.3250 కోట్ల రుణాన్ని మంజూరు చేయటం.. ఆ భారీ మొత్తం తర్వాతి రోజుల్లో ఎన్ పీఏ (మొండి బకాయి)గా మారటంతో ఆమె చిక్కుల్లో చిక్కుకున్నారు. ఆమె మీద వచ్చిన ఫిర్యాదు.. దానిపై విచారణ సాగగా.. వీడియోకాన్ కు భారీగా రుణాన్ని ఇవ్వటం ద్వారా.. ఆమె, ఆమె కుటుంబం భారీగా లబ్ధి పొందిన విషయాన్ని విచారణలో గుర్తించారు.

దీంతో అవమానకర పరిస్థితుల నడుమ ఆమె బ్యాంకు నుంచి బయటకు రావాల్సి వచ్చింది. అప్పటివరకు దేశంలోనే అత్యంత పవర్ ఫుల్ ఉమెన్ గా పేరు ప్రఖ్యాతుల్ని సొంతం చేసుకున్న చందాకొచ్చర్ తీవ్రమైన ఆరోపణల్ని ఎదుర్కొన్నారు. తాజాగా ఈ కేసు విచారణలో భాగంగా ఆమెను.. ఆమె భర్త దీపక్ కొచ్చర్ ను సీబీఐ అధికారులు అరెస్టు చేశారు.

ఇదంతా చదివినప్పుడు ఎలాంటి చందాకొచ్చర్ కు ఎలాంటి పరిస్థితి? అది కూడా ఒక రుణం విషయంలో ఆమె వేసిన తప్పటడుగులు ఆమె జీవితాన్ని పూర్తిగా మార్చేయటమే కాదు.. ఎప్పటికి కోలుకోలేని రీతిలో దెబ్బేసిందని చెప్పక తప్పదు. అందుకే.. తప్పు అన్నది చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News