16 నెలల జగన్ పాలనతో చేసిన అప్పులు అంతనా?

Update: 2020-10-01 23:30 GMT
విభజన ప్రభావం ఎంతన్న విషయాన్ని ఏపీ ప్రజలు కానీ ఏపీలోని ప్రభుత్వాలు కానీ పెద్దగా ప్రస్తావించింది లేదు. భారీ ఆదాయవనరుగా ఉండే హైదరాబాద్ మహానగరాన్ని కోల్పోవటం ఎంత నష్టమన్న విషయం ఏపీ ప్రజలకు ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది. దీనికి తోడు.. భారీగా సంక్షేమ పథకాల్ని తెర మీదకు తెస్తున్న ప్రభుత్వాల తీరుతో ఏపీ అప్పుల కుప్పగా మారుతోంది. ఈ వాదనలో నిజం ఎంతన్న విషయాన్ని తాజాగా వెల్లడైన గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

విభజన తర్వాత తొలిసారి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం.. సంక్షేమ పథకాలు.. ఇతర అంశాల పేరుతో భారీగా ఖర్చు చేసి.. రాష్ట్రాన్ని అప్పుల మోత మోగేలా చేసింది. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో ఘన విజయాన్ని సాధించిన జగన్.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారే కానీ.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నాల్ని చేయటం లేదన్న విమర్శ వినిపిస్తోంది. దీనికి తోడు ఆయన సర్కారు అదే పనిగా ప్రకటించే సంక్షేమ పథకాలకు భారీగా నిధులు అవసరమవుతున్నాయి. కరోనా నేపథ్యంలో రాష్ట్ర ఆదాయం తీవ్ర ప్రభావానికి లోనైంది.

దీంతో.. రాష్ట్ర ప్రభుత్వ బండిని నడిపేందుకు అప్పుల మీద అప్పులు తేవాల్సి వస్తోంది. పదహారు నెలల జగన్ ప్రభుత్వం ఇప్పటివరకు రూ.1.60లక్షల కోట్ల మొత్తాన్ని రుణాల్ని తీసుకొచ్చింది. మరిన్ని అప్పుల కోసం రాష్ట్ర ఆర్థిక శాఖ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈ భారీ అప్పును ఐదు కోట్లున్న ఏపీ ప్రజలకు సమానంగా పంచితే ఒక్కొక్కరిపై రూ.26వేల చొప్పున రుణభారం పడనుంది. సగటున ఒక్కోకుటుంబంలో నలుగురు కుటుంబ సభ్యులు ఉంటారన్న లెక్కలోకి తీసుకుంటే.. జగన్ సర్కారు చేసిన అప్పు ఏకంగా ఒక్కో ఇంటిపైన లక్షను దాటటం విశేషం.

సంక్షేమ పథకాలతో ప్రభుత్వం లబ్థిదారుల్లోని ప్రతి కుటుంబానికి గడిచిన 16 నెలల్లో సగటున రూ.20 నుంచి రూ.30వేల వరకు పంచినట్లు చెబుతారు. ఈ లెక్కన చూసినా.. పంచిన మొత్తంతో పోలిస్తే.. అప్పుల రూపంలో పడిన భారమే ఎక్కువ. మరి.. కొండలా పెరుగుతున్న ఈ రుణభారాన్ని ఏపీ ప్రభుత్వం ఎలా తగ్గిస్తుందన్నది అసలు ప్రశ్న. దీనికి సమాధానం చెప్పేవారెవరు?
Tags:    

Similar News