ఆ సీటు కోసం.. కూటమిలో దబిడదిబిడే..

Update: 2018-11-05 08:54 GMT
శేర్ లింగం పల్లి అసెంబ్లీ సీటు.. మహాకూటమికి సవాలుగా నిలుస్తోంది. రంగారెడ్డి జిల్లాలో ఆంధ్రా సెటిలర్లు, కమ్మ సామాజికవర్గం ఎక్కువగా ఉన్న ఈ సీటు కోసం లొల్లి మొదలైంది. గాంధీ భవన్ లో నిన్ననే కాంగ్రెస్ శ్రేణులు టికెట్ మాజీ ఎమ్మెల్యే భిక్షపతి యాదవ్ కు మాత్రమే ఇవ్వాలని టీడీపీకి ఇస్తే ఓడిస్తామని రచ్చ రచ్చ చేశారు. భిక్షపతి యాదవ్ అనుచరులు ఆత్మహత్యాయత్నానికి కూడా పాల్పడ్డారు. చెప్పులు విసిరి నానా యాగీ చేశారు.

అయితే ఈ సీటును టీడీపీకి ఇద్దామనే ఆలోచనలోనే కాంగ్రెస్ ఉందట.. ఈ మేరకు చంద్రబాబు అండ్ టీం భవ్య క్రియేషన్స్ అధినేత ఆనంద్ ప్రసాద్ కు  హామీ ఇచ్చినట్టు వార్తలొచ్చాయి. చంద్రబాబు అలా లీక్ చేశాడో లేదో భవ్య వర్గీయులు శేర్ లింగంపల్లిలో ర్యాలీ నిర్వహించారు. సీటు ఇవ్వకముందే ఇలా చేస్తారా అంటూ మండిపడ్డ కాంగ్రెస్ శ్రేణులు ఏకంగా గాంధీ భవన్ లోనే ఆందోళన చేసి హెచ్చరికలు పంపారు.

ఇక టీడీపీలోనూ చిచ్చు మొదలైంది. సీటును ఆనంద్ ప్రసాద్ కు ఎలా ఇస్తారని.. శేర్ లింగంపల్లి టీడీపీ నియోజకవర్గ నేత మొవ్వా సత్యానారాయణ తిరుగుబాటుకు తెరతీశారు. ఈ సీటు తెలుగు దేశం పార్టీకి హాట్ స్పాట్ వంటిదని.. తెలుగుదేశం పార్టీ ఎన్నో సార్లు గెలిచిన ఈ నియోజకవర్గంలో తనకే టికెట్ ఇవ్వాలని కోరుతున్నారు.

 శేర్ లింగపల్లి సీటును కాంగ్రెస్ లేదా టీడీపీలో ఎవరికి దక్కినా అసమ్మతి రేగడం ఖాయంగా కనిపిస్తోంది. దాదాపు టీడీపీకే ఈ సీటు కన్ఫం అన్న వార్తల నేపథ్యంలో శేర్ లింగం పల్లి కాంగ్రెస్ నేత భిక్షపతి యాదవ్ మరోసారి గాంధీ భవన్ పైకి యుద్ధం చేయడానికి రెడీ అయ్యారట.. నిన్న బయటే ఆందోళన చేశామని.. ఈసారి గాంధీ భవన్ లోపల ఆందోళన చేయడానికి డిసైడ్ అయ్యారట.. ఈ ఒక్కసీటుకే ఇంత అసమ్మతి ఉంటే రాష్ట్రవ్యాప్తంగా ఇంకా ఎన్ని సీట్లకు ఎంత రచ్చ జరుగుతుందోనన్న ఆందోళన కాంగ్రెస్ ను కలవరపెడుతోంది. కాంగ్రెస్ టికెట్లు ప్రకటిస్తే కానీ తెలియదు అసలు కథ..
Tags:    

Similar News