అంబానీలు:అన్న ఆకాశంలో..త‌మ్ముడు అగాథంలో

Update: 2017-11-20 17:30 GMT
అవును దేశంలోనే ప‌రిచ‌యం అవ‌స‌రం లేని పేర్ల జాబితాలో ఉండే అన్న‌ద‌మ్ములు ముకేశ్ అంబానీ.. అనీల్ అంబానీల ఆర్థిక ప‌రిస్థితులు అత్యంత ఆస‌క్తిక‌రంగా మారిపోయాయి. పరిచయం అక్కర్లేని ఈ అన్న‌ద‌మ్ముల గురించి ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ తెర‌మీద‌కు వ‌చ్చింది. ఇటీవలికాలంలో అగ్ర‌జుడైన‌ ముకేశ్ పేరు ఎక్కడ చూసినా మెరిసిపోతుంటే, అనీల్ పేరు మాత్రం అన్నింటా మసకబారుతోంది. ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్‌ ఐఎల్) వ్యాపారాలు అంతకంతకూ పెరుగుతూపోతుంటే - అనీల్ అంబానీ నాయకత్వంలోని రిలయన్స్ అనీల్ ధీరూభాయ్ అంబానీ గ్రూప్ (ఆర్‌ అడాగ్) వ్యాపారాలు ఒక్కటొక్కటిగా తగ్గిపోతున్నాయి. ఫలితంగా సోదరులిద్దరి ఆస్తుల్లో అంతరాలు అమాంతం పెరిగిపోగా - సంపద విషయంలో ముకేశ్ - అనీల్‌ ల మధ్య వ్యత్యాసం నింగికి.. నేలకు మధ్య ఉన్న తేడాకు చేరిందంటే అతిశయోక్తి కాదు.

రిల‌య‌న్స్ వ్య‌వ‌స్థాప‌కుడు ధీరూభాయ్ అంబానీ మరణానంతరం రిలయన్స్ గ్రూప్ రెండుగా విడిపోయింది. ఆర్‌ ఐఎల్ - ఆర్‌ అడాగ్‌ లు ఏర్పడ్డాయి. ముకేశ్‌ కు చెందినది ఆర్‌ ఐఎల్ అవగా - అనీల్‌ ది రిలయన్స్ అడాగ్. రిలయన్స్ గ్రూప్ విడిపోక ముందు పెట్రోకెమికల్స్‌ ను ముకేశ్ అంబానీయే చూసుకునేవారు. టెలికం వ్యాపారాన్నీ ఒక్కరే నిర్వహించేవారు. ఆర్థికం - ఇంధనం - విద్యుత్ వ్యాపారాలను మాత్రం అనీల్ చూసేవారు. అయితే తెర వెనుక ఆస్తుల నిర్మాణంలో కీలకపాత్ర ముకేశ్‌ దైతే - తెర ముందు రిలయన్స్ వ్యాపారాల ప్రచారం - మదుపరులతో ముఖాముఖీలు అనీల్ చేపట్టేవారు. ఈ క్రమంలో ఇరువురికీ వివాహాలు కావడం - తండ్రీ ధీరూభాయ్ అంబానీ చనిపోవడంతో ఆస్తుల పంపకాలు - వ్యాపార విభజన తప్పలేదు. నిజానికి కలిసి వ్యాపారం చేద్దామన్న ప్రతిపాదన ఉన్నప్పటికీ.. అనీల్ ససేమిరా అనడంతో రిలయన్స్ గ్రూప్ రెండు ముక్కలైంది. తల్లి కోకిలాబేన్ విజ్ఞప్తిపై ఐసీఐసీఐ బ్యాంక్ సీఈవో - ఎండీ కేవీ కామత్.. ఆస్తుల పంపకానికి సలహాదారుగా ఉన్నారు. ఈ క్రమంలో పెట్రోకెమికల్ వ్యాపారాన్ని ముకేశ్ చక్కగా నిర్వహిస్తుండటంతో అది ఆయనకే దక్కగా - ఫైనాన్స్ - ఎనర్జీ వ్యాపారాల గురించి తెలిసిన అనీల్ చేతికి అవే వచ్చాయి. టెలికం వ్యాపారం కూడా ముకేశ్‌ కే రాగా - అనీల్ తనకే కావాలంటూ గట్టిగా పట్టుబట్టడంతో టెలికంను ముకేశ్ వదిలేసుకున్నారు. రూ.25,000 కోట్ల నగదునూ అనీల్‌ కు ఇచ్చారు. 2004 నవంబర్‌ లో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ముకేశ్ దీనిపై తన అసంతృప్తినీ వ్యక్తం చేశారు. తాను టెలికం వ్యాపారాభివృద్ధికి గొప్ప ప్రణాళికలు వేసుకున్నానని, అయినప్పటికీ తన చేతుల్లోంచి అది జారిపోవడం తీవ్రంగా బాధించిందని చెప్పారు.

అయితే ఈ ఇద్ద‌రు సోద‌రుల సంప‌ద‌లో విప‌రీత‌మైన వ్య‌త్యాసం క‌నిపిస్తోంది. తాజా వివ‌రాల ప్ర‌కారం అనీల్ సంపద కంటే ముకేశ్ సంపద 18 రెట్లు అధికం. ఫోర్బ్స్ మ్యాగజైన్ ఇటీవల విడుదల చేసిన జాబితాలో ఆసియాలోనే అంబానీల ఆస్తులు టాప్ ప్లేస్‌ లో ఉండగా, గతంతో పోల్చితే 19 బిలియన్ డాలర్లు ఎగబాకి 44.8 బిలియన్ డాలర్లుగా నమోదైయ్యాయి. అయితే ఇందులో ముకేశ్ ఆస్తులే 42 బిలియన్ డాలర్లకుపైగా ఉన్నాయి. భారత కరెన్సీలో వీటి విలువ రూ.2.75 లక్షల కోట్ల పైమాటే. అనీల్ అంబానీ ఆస్తులు కేవలం 2.3 బిలియన్ డాలర్లకే(రూ.15,000 కోట్లు) పరిమితమయ్యాయి. ముకేశ్ అంబానీ సంపదకు కేంద్ర బిందువు పెట్రో కెమికల్స్ వ్యాపారమే. కృష్ణా-గోదావరి (కేజీ) బేసిన్‌ లోగల గ్యాస్ - చమురు నిక్షేపాలు.. ముకేశ్‌ కు అపార సంపదను తెచ్చిపెడుతున్నాయి. రిఫైనరీ వ్యాపారం కూడా ముకేశ్‌ ను అపర కుబేరుడిగా నిలుపుతున్నాయి.

దేశంలోకెల్లా అతిపెద్ద చమురు శుద్ధి కేంద్రం ఆర్‌ ఐఎల్‌ దే. గుజరాత్‌ లోని జామ్‌ నగర్ వద్దగల ఈ రిఫైనరీ వార్షిక సామర్థ్యం 33 మిలియన్ మెట్రిక్ టన్నులు. ఇక ముకేశ్ మానస పుత్రిక రిలయన్స్ జియో. ఉచిత 4జీ సేవలతో ఏడాది క్రితం దేశీయ టెలికం రంగంలోకి ప్రవేశించిన జియో.. సృష్టించిన సంచలనాలకు కొదవే లేదు. భారతీయ టెలికం రంగ ముఖచిత్రాన్నే మార్చేసిన జియో.. ఈ రంగంలో దిగ్గజ కంపెనీలకు ముచ్చెమటలు పోయించింది. జియో ధాటికి అనీల్ సారథ్యంలోని ఆర్‌ కామ్ కుదేలవగా, టాటా టెలీ కూడా కనుమరుగైపోయింది. దాదాపు రూ.45,000 కోట్ల రుణభారంతో టెలికం సేవలకు ఆర్‌ కామ్ గుడ్‌ బై చెప్పగా - టాటా టెలికం.. ఎయిర్‌ టెల్‌ లో విలీనమైంది. వొడాఫోన్ - ఐడియా కూడా ఒక్కటైపోతుండగా, చిన్నాచితకా సంస్థలూ భారీ కంపెనీల గూటికి చేరుతున్నాయి. స్థూలంగా అగ్ర‌జుడు అంద‌లంవైపు సాగుతుండ‌గా...అనీల్ గ్రాఫ్ అంత‌కంత‌కూ క్షీణిస్తోంద‌ని అంటున్నారు.
Tags:    

Similar News