క‌రోనా ఎఫెక్ట్‌: 14 ల‌క్ష‌ల మంది స్వ‌దేశానికి

Update: 2020-09-17 12:10 GMT
గ‌త ఏడాది న‌వంబ‌రులో వెలుగు చూసిన క‌రోనా.. ఇప్ప‌టికీ ప్ర‌పంచాన్ని కుదిపేస్తున్న‌ విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికీ.. దాదాపు అన్ని దేశాలు కొవిడ్‌-19 ప్ర‌భావంతో అట్టుడుకుతూనే ఉన్నాయి. ఈ ప్ర‌భావం.. భార‌త్ నుంచి వివిధ దేశాల‌కు చ‌దువు నిమిత్తం వెళ్లిన విద్యార్థులు, ఉపాధి కోసం వెళ్లిన వారిపై తీవ్రంగా ప‌డింది. అన్ని దేశాల్లోనూ విధించిన లాక్‌డౌన్ నేప‌థ్యంలో వారంతా స్వ‌దేశానికి తిరిగి వ‌చ్చారు. ఇలా వ‌చ్చిన వారి సంఖ్య 14 ల‌క్ష‌ల వ‌ర‌కు ఉంద‌ని కేంద్రం ప్ర‌భుత్వం స్ప‌ష్టం చేసింది. `వందే భార‌త్‌` మిష‌న్ ద్వారా వివిధ దేశాల్లో చిక్కుకుపోయిన వారిని స్వ‌దేశానికి చేర్చిన‌ట్టు తెలిపింది.

ఈ మేర‌కు విదేశాంగ శాఖ స‌హాయ‌ మంత్రి వి. ముర‌ళీధ‌ర‌న్ గురువారం రాజ్య‌స‌భకు లిఖిత పూర్వ‌కంగా వెల్ల‌డించారు. స్వ‌దేశానికి తిరిగి వ‌చ్చిన వారిలో విద్యార్థులు 56,874 మంది ఉన్న‌ట్టు మంత్రి తెలిపారు. ప్ర‌యాణ స‌మ‌యంలో పౌరులు అంద‌జేసిన స‌మాచారం మేరకు.. భార‌త్‌కు తిరిగిన వ‌చ్చిన వారి సంఖ్య 14,12,835గా ఉంద‌ని పేర్కొన్నారు. ఇక‌, వీరిలో 3248 మందికి కొవిడ్‌-19 పాజిటివ్ నిర్ధార‌ణ అయిన‌ట్టు తెలిపారు. కాగా, ఇండియ‌న్ క‌మ్యూనిటీ వెల్ఫేర్ ఫండ్‌(ఐసీడ‌బ్ల్యుఎఫ్‌) ద్వారా క‌రోనా స‌మ‌యంలో వివిధ దేశాల్లోని 62 వేల మంది మ‌న దేశ‌ పౌరుల‌కు స‌హాయం అందించిన‌ట్టు మంత్రి వివ‌రించారు.

ఇదిలావుంటే, సోమ‌వారం నుంచి ప్రారంభ‌మైన పార్ల‌మెంటు వ‌ర్షాకాల స‌మావేశాలు అక్టోబ‌రు 1 వ‌ర‌కు కొన‌సాగ‌నున్నాయి. క‌రోనా నేప‌థ్యంలో ఉభ‌య స‌భ‌ల స‌భ్యులూ కొవిడ్‌-19 నిబంధ‌న‌ల‌ను పాటిస్తున్నారు. ఈ నేప‌థ్యంలోనే దేశ పార్ల‌మెంటు చ‌రిత్రలో తొలిసారి.. రాజ్య‌స‌భను ఉద‌యం 9 నుంచి మ‌ధ్యాహ్నం 1 గంట వ‌ర‌కు, లోక్‌స‌భ‌ను మ‌ధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి ఏడు గంట‌ల వ‌ర‌కు నిర్వ‌హిస్తుండ‌డం గ‌మనార్హం.
Tags:    

Similar News