బెజ‌వాడ ప‌ల్స్ మారింది!... సాక్ష్యం ఇదిగో!

Update: 2018-04-15 07:53 GMT
ఏపీలో రాజ‌కీయం చాలా వేగంగా చోటుచేసుకుంటున్న‌ట్టే క‌నిపిస్తోంది. గ‌డ‌చిన ఎన్నిక‌ల్లో టీడీపీకి కంచుకోట‌లుగా మారిన జిల్లాల్లో వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌కు పెరుగుతున్న మ‌ద్ద‌తే ఇందుకు నిద‌ర్శ‌నమ‌న్న విశ్లేష‌ణ‌లు సాగుతున్నాయి. గ‌డ‌చిన ఎన్నిక‌ల్లో వెంట్రుక వాసిలో అధికారం చేజార‌గా... ఈ ద‌ఫా ఎన్నిక‌ల్లో విజ‌య‌మే ల‌క్ష్యంగా జ‌గ‌న్ సుదీర్ఘ పాద‌యాత్ర‌ను చేప‌ట్టిన సంగ‌తి తెలిసిందే. త‌న సొంత జిల్లా క‌డ‌ప‌లోని త‌న తండ్రి స‌మాధి నుంచే జ‌గ‌న్ పాద‌యాత్ర మొద‌లుపెట్టారు. రాయ‌ల‌సీమ‌లో మంచి ప‌ట్టు సాధించిన జ‌గ‌న్‌ కు ఆ జిల్లాల్లో జ‌రిగిన పాద‌యాత్ర‌కు జ‌నం పోటెత్తారు. ఓ వైపు త‌న పార్టీ టికెట్ల‌పై విజ‌యం సాధించిన ఎమ్మెల్యేల్లో 23 మంది విడ‌త‌ల‌వారీగా టీడీపీలో చేరినా కూడా జగ‌న్‌ కు ప్ర‌జా మ‌ద్ద‌తు ఏమాత్రం త‌గ్గ‌లేద‌నే చెప్పాలి. ఈ క్ర‌మంలో రాయ‌ల‌సీమ‌లో జ‌గ‌న్‌ కు మ‌ద్ద‌తు రావ‌డం పెద్ద‌గా ఆశ్చ‌ర్య‌పోవాల్సిన ప‌నిలేద‌న్న కోణంలో విశ్లేష‌ణ‌లు సాగాయి. అయితే రాయ‌ల‌సీమ‌లో యాత్ర‌ను ముగించుకున్న జ‌గ‌న్‌... ఆ త‌ర్వాత నెల్లూరు - ప్ర‌కాశం జిల్లాల మీదుగా గుంటూరు జిల్లాలో ప్ర‌వేశించారు. రాయ‌ల‌సీమ‌లో జ‌గ‌న్ యాత్ర‌ల‌కు పోటెత్తిన జ‌నం కంటే కూడా నెల్లూరు - ప్ర‌కాశం జిల్లాల్లో మ‌ద్ద‌తు ల‌భించింది.

ఇక టీడీపీకి కంచుకోట‌గా ఉన్న గుంటూరు జిల్లాలో జ‌గ‌న్ యాత్ర‌కు భారీ మ‌ద్ద‌తు ల‌భించింది. టీడీపీ సీనియ‌ర్ నేత‌ - ఏపీ స్పీక‌ర్‌ గా ఉన్న కోడెల శివ‌ప్ర‌సాద్ సొంతూరు న‌ర‌స‌రావుపేట‌ - ఆయ‌న ప్రాతినిధ్యం వ‌హిస్తున్న స‌త్తెన‌ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గాల్లో జగ‌న్ నిర్వ‌హించిన స‌భ‌ల‌కు పోటెత్తిన జ‌నాన్ని చూసిన టీడీపీ శ్రేణుల గుండెల్లో రైళ్లు ప‌రుగెత్తాయ‌నే చెప్పాలి. రాయ‌ల‌సీమ‌లో కంటే కూడా గుంటూరులో జ‌గ‌న్ స‌భ‌ల‌కు రెట్టించిన సంఖ్య‌లో జ‌నం రావ‌డం చూసిన టీడీపీ అధిష్ఠానంలోనూ వ‌ణుకు మొద‌లైంద‌న్న వాద‌న వినిపించింది. ఇక టీడీపీకి మరింత‌గా ప‌ట్టున్న కృష్ణా జిల్లాలోకి నిన్న జ‌గ‌న్ యాత్ర ప్ర‌వేశించింది. ఈ సందర్భంగా గుంటూరు - కృష్ణా జిల్లాల మ‌ధ్య ఉన్న క‌న‌క‌దుర్గ‌మ్మ వార‌ధి వ‌ద్ద‌కు రాగానే జ‌గ‌న్ యాత్ర‌కు జ‌నం పోటెత్తారు. ఓ వైపు గుంటూరు నుంచి పార్టీ శ్రేణుల‌తో పాటు సామాన్యం జ‌నం కూడా జ‌గ‌న్ యాత్ర‌కు ఘ‌నంగా వీడ్కోలు ప‌ల‌క‌గా... కృష్ణా జిల్లాలోకి జ‌గ‌న్ యాత్ర‌కు స్వాగ‌తం ప‌లికేందుకు విజ‌య‌వాడ‌కు చెందిన జ‌నం కూడా భారీ ఎత్తున త‌ర‌లివచ్చారు. దీంతో వార‌ధి జగ‌న్ నామ‌స్మ‌ర‌ణ‌తో మారుమోగింద‌ని చెప్పాలి.

ఆ త‌ర్వాత విజ‌య‌వాడ‌లోకి ప్ర‌వేశించిన జ‌గ‌న్ యాత్ర‌కు అడుగ‌డుగునా నీరాజ‌నాలు ల‌భించాయి. ఇక సాయంత్రం న‌గ‌రంలోని చిట్టిన‌గ‌ర్‌ లో నిర్వ‌హించిన బ‌హిరంగ స‌భ‌కు ఇసుకేస్తే రాల‌నంత మేర జ‌నం పోటెత్తారు. సాధార‌ణంగా విజ‌య‌వాడ‌లో మెజారిటీ ప్ర‌జ‌లు టీడీపీకి అనుకూలంగానే ఉన్నార‌న్న వాద‌న ఉంది. అలాంటి ప‌రిస్థితుల్లో వైసీపీ అధినేత నిర్వ‌హించిన స‌భ‌కు అంత‌గా జ‌నం పోటెత్తారంటే.. జ‌నం ప‌ల్స్ లో మార్పు వ‌చ్చిన‌ట్లుగానే విశ్లేష‌ణ‌లు సాగుతున్నాయి. త‌న‌కు ల‌భించిన జ‌నామోదంతో మ‌రింత‌గా ఉత్సాహం క‌న‌బ‌రచిన జ‌గ‌న్‌... టీడీపీ స‌ర్కారు, ప్ర‌త్యేకించి టీడీపీ అధినేత‌ - ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడిపై త‌న‌దైన శైలిలో విరుచుకుప‌డ్డారు. చంద్ర‌బాబు సాగిస్తున్న పాల‌న‌పై విమ‌ర్శ‌లు గుప్పించిన జ‌గ‌న్‌... ఏపీకి ప్ర‌త్యేక హోదా సాధ‌నలో బాబు అనుస‌రించిన‌, అనుస‌రిస్తున్న వైఖ‌రిని ఎండ‌గ‌ట్టారు. చంద్ర‌బాబుపై జ‌గ‌న్ చేసిన విమ‌ర్శ‌ల‌కు జ‌నం నుంచి మంచి అప్లాజ్ ల‌భించింద‌నే చెప్పాలి.

అంతేకాకుండా గుంటూరు జిల్లాలో చంద్ర‌బాబుపై జ‌గ‌న్ సంధించిన విమ‌ర్శ‌ల‌ను తిప్పికొట్టేందుకు టీడీపీ నేత‌లు క్యూ క‌ట్టి మ‌రీ విరుచుకుప‌డ‌గా... విజ‌య‌వాడ‌లో జ‌గ‌న్ సంధించిన విమ‌ర్శ‌ల‌కు మాత్రం టీడీపీ నేత‌లు పెద్ద‌గా స్పందించ‌లేదు. జ‌నం ప‌ల్స్ లో మార్పు స్ప‌ష్టంగా క‌నిపించిన వైనాన్ని గుర్తించిన మీద‌టే టీడీపీ నేత‌లు జ‌గ‌న్‌ పై విరుచుకుప‌డేందుకు అంత‌గా సాహ‌సం చూప‌లేద‌న్న వాద‌న కూడా వినిపిస్తోంది. మొత్తంగా రాష్ట్రంలో రాజ‌కీయం వేగంగా మారుతున్న వైనాన్ని టీడీపీ నేతలకు కూడా తెలిసిపోయింద‌న్న కోణంలో ఇప్పుడు ఆస‌క్తిక‌ర చ‌ర్చ న‌డుస్తోంది. ఇదే రీతిన జ‌గ‌న్ ముందుకు సాగితే... టీడీపీ పుట్టి మున‌గ‌డం ఖాయ‌మ‌న్న వాద‌న కూడా వినిపిస్తోంది. రాజ‌కీయంగా మంచి ప‌రిణ‌తి క‌నిపించే విజ‌య‌వాడ‌లోనే జ‌గ‌న్‌కు ఈ మేర మ‌ద్ద‌తు లభించడం నిజంగానే ఆస‌క్తిక‌రంగా మారింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

Tags:    

Similar News